‘వందలాది మంది విద్యార్ధుల బలిదానాలతో, అన్ని వర్గాల ప్రజల ఉద్యమ భాగస్వామ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆకాంక్షించాం. విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని భావించాం. దశాబ్దాలుగా కలగానే మిగిలిన ’అందరికీ విద్య’ లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందనుకున్నాం. ’కేజీ టూ పీజీ’ అలాంటి ఆశలనే రేకెత్తించింది. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. విద్యావ్యవస్థ మరింత భ్రష్టుపట్టిపోయింది. చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారింది’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకులుగా, కామన్ స్కూల్ విధానం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా ఉన్న ఆయన తెలంగాణ లో విద్యారంగం తీరుతెన్నులపై ’సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత విద్యారంగంపై సమాలోచనలు ఆయన మాటల్లోనే..
కలగానే కామన్ స్కూల్ విధానం
ఇప్పటికీ కోట్లాది మంది చదువుకు దూరంగానే ఉండిపోయారు. స్వాతంత్య్రానంతరం ’అందరికీ విద్య’ను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా రూపొందించేందుకు అంబేద్కర్ వంటి మహనీయులు కృషి చేసినా అమలుకు నోచలేదు. మొదటి నుంచి విద్య ప్రభుత్వం ఆధీనంలో లేదు. ప్రభుత్వమే దాన్ని చేతుల్లోకి తీసుకొని అన్ని వర్గాలకు ఒకేరకమైన విద్యను అందజేసే కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయవలసింది. కానీ అలా జరగలేదు. చివరకు 1985-86 నాటికి విద్యావ్యవస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి కామన్ స్కూల్ విధానం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. తెలంగాణలో చదువుకుంటున్న సుమారు 62 లక్షల మంది పిల్లల్లో 34 లక్షల మందికి పైగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలోనే ఉన్నారు. 28 లక్షల మంది పిల్లలు కనీస సదుపాయాలులేని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 500 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ శక్తుల చేతుల్లో ఉంటే నాలుగైదే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. సంపన్నులకు, సామాన్యులకు ఒకేరకమైన విద్య అమలు కావాలనే లక్ష్యంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1985లో విద్యా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం, కృషి ఫలితంగా టీఆర్‌ఎస్ కేజీ టూ పీజీ విద్యను తన మేనిఫెస్టోలో చేర్చింది. కానీ అది కేవలం నినాదంగానే మిగిలింది.
విద్యార్ధుల్లో విషాన్ని నింపుతున్న గురు’కులాలు’
కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేసి, ప్రైవేట్ పాఠశాలలను, విద్యాసంస్థలను పూర్తిగా నియంత్రించి కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే విద్యను అందజేస్తుందని ఆశించాం. తెలంగాణ పోరాటంలో యూనివర్సిటీల పిల్లలు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రాణాలర్పించారు. పిల్లల పోరాటానికి ప్రతిఫలంగా, వారి కృషికి గుర్తింగా రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో గొప్ప అభివృద్ధి జరుగుతుందనుకున్నాం. కానీ వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. కేజీ టూ పీజీ స్థానంలో 600 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. కానీ వెనుకబడిన కులాలు, గిరిజనులు,దళితులు, ముస్లింలు, అమ్మాయిలు,, అబ్బాయిలు, తదితర వర్గాలుగా పిల్లలను విభజించి వీటిని ఏర్పాటు చేయడం దారుణం. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 12 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో అది 7 శాతానికి పడిపోయింది. ఆరు వేల స్కూళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. 16 వేల టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక్క డీఎస్సీ కూడా లేదు. కాంట్రాక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. వర్సిటీల్లో అత్యధిక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా విద్యారంగంపై సీరియస్‌గా దృష్టి సారించాలి.
- పగిడిపాల ఆంజనేయులు
మిథ్యగా అందరికీ విద్య
Published Thu, Nov 1 2018 2:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment