‘ఫాసిజం వైపు దేశం’
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రజాస్వామ్య సంఘాల నేతల అరెస్టులను చూస్తుంటే దేశం ఫాసిజం వైపు పయనిస్తోందని అర్థం అవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ‘చత్తీస్‌ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్టును వెంటనే ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని’ డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవాలను తెలుసుకోవటానికివ వెళ్లిన ఉద్యమ నాయకులను అరెస్టు చేయటం దారుణమని విమర్శించారు. దేశంలో ఉన్న వ్యవస్థలన్ని దెబ్బతిన్నాయని, చివరకు న్యాయ వ్యవస్థ కూడ ప్రభుత్వం ఏం చెపుతుందో మరునాడు అదే చెపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను మద్య తరగతి ప్రజలు అర్థం చేసుకోవాలని, లేకుంటే చీకటి రోజులను చూడాల్సి వస్తుందని అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజల కష్టాలను చూస్తుంటే దేశాన్ని ఎవరైనా పాలించవచ్చు అనిపిస్తుందని అన్నారు. మీడియా రాజ్యం స్వభావాన్ని ప్రశ్నించాలి తప్ప పాలనలో భాగస్వామ్యం కావద్దని సూచించారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించానని అన్నారు.
అక్రమ కేసులు పెట్టడాన్ని సాయుధ పోరాటంలోనే చూశానని ఇది ఫ్యూడల్ పద్దతి అని విమర్శించారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎవరూ మాట్లాడకూడదు అనే రీతిలో రాజ్యం అణచివేస్తుందన్నారు. ఆదివాసి ప్రాంతాల మీద తీవ్ర నిర్భంధం కొనసాగుతుందని విమర్శించారు. అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించిన ఉద్యమ నాయకులు బల్ల రవీందర్, చిక్కుడు ప్రభాకర్, దుడ్డు ప్రభాకర్, బండి దుర్గా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నజీర్, రమణాల లక్ష్మయ్యలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు విమలక్క, నలమాసు కృష్ణ, కోటి, గురజాల రవీందర్, ప్రొఫెసర్ లక్ష్మణ్, వి. రఘునాథ్, దేవేంద్ర, నారాయణరావు, కుమారస్వామి, సావిత్రి, కె. కృష్ణ, కనీజ్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.