సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్‌లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్‌లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే..
పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది.
స్పందించిన ప్రొఫెసర్
రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
విద్యా సంఘాల ఖండన
ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment