UAPA act
-
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్‌్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉపా చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్ మీద దాఖలు చేసిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపైనా కేసులు తక్షణమే ఎత్తేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద కేసులు దాఖలైన పరిణామంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండడం, ముఖ్యంగా మేధోవర్గం నుంచి అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 👉 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా-UAPA) కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా.. తాజాగా వెలుగు చూసింది. 👉 పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. 👉 మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. 👉 తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద.. ఓ రోజు వేకువజామున మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. సైలెంట్‌గా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసుల కదలికలను గమనించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయగా.. విప్లవ సాహిత్యం, పలు వస్తువులు దొరికాయి. కాగ.. ఆ పుస్తకాల్లో ప్రముఖుల పేర్లు ఉండడంతో.. వారిని నిందితులుగా చేర్చారు 👉 మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో సర్కారు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, సర్కారును పడగొట్టటం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, యువతను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు రకరకాల అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. అయితే.. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రమౌళితో పాటు నిందితులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్‌తో పాటు ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్.. తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 👉 సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంఘ విద్రోహ శక్తులను, సంఘాన్ని ఉద్రేక పరుస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే వారిని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టమే ఉపా చట్టం (UAPA Act). ఇదీ చదవండి: ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి -
ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్‌లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్‌లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. స్పందించిన ప్రొఫెసర్ రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యా సంఘాల ఖండన ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరిస్తే అప్పీలే
సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేస్తే, ఆ ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అప్పీల్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై క్రిమినల్ పిటిషన్ దాఖలుకు వీల్లేదని, దానికి విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. మావోయిస్టు సానుభూతిపరుడు పంగి నాగన్న దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను కొట్టేసింది. ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంతో విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పంగి నాగన్నను 2020లో అరెస్ట్ చేశారు. తర్వాత కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. నాగన్నపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో నాగన్న విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నాగన్న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. ఈ పిటిషన్ విచారణార్హతపై ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ అభ్యంతరం తెలిపారు. ఎన్ఐఏ చట్టం సెక్షన్ 21(4) కింద నిందితుల బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేస్తే, దానిపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలే తప్ప, క్రిమినల్ పిటిషన్ దాఖలుకు వీల్లేదన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. నాగన్న పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దానిని కొట్టేశారు. -
అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం
ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం. విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్ జస్టిస్) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్సన్ వ్యాధి, కోవిడ్ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి. సంబంధం లేని కేసులో.... కోరేగావ్ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్ కాథలిక్ పూజారి స్టాన్ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్ పరిషత్ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్‌టాప్‌లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్వేర్’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్ ఫోరెన్సిక్ సంస్థ నిరూపించింది. అదే, స్టాన్‌స్వామీ ల్యాప్‌టాప్ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్, మొబైల్ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు. ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా? న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్‌స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్సన్ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు. 2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
వాజే ఎన్ఐఏ కస్టడీ పొడిగింపు
ముంబై: ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో గురువారం ఎన్ఐఏ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు..మరో 15 రోజులు కస్టడీకి అప్పగించాలని జడ్జీ పీఆర్ సిత్రేని కోరారు. ఈ సందర్భంగా వాజే..తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా బలిపశువును చేశారంటూ వాపోయారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు వాజే నివాసం నుంచి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాటిని ఇంట్లో ఎందుకు ఉంచారనే విషయమై విచారణ చేపట్టారు. పోలీసు శాఖ ఆయనకు మంజూరు చేసిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే దొరికాయి. మిగతావి లభ్యం కాలేదు’అని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇదే కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మరో ఇద్దరితోపాటు వాజేను కలిపి విచారణ జరపాల్సి ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై హైకోర్టులో పరమ్‌బీర్ సింగ్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తక్షణం నిష్పాక్షి విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ గురువారం ముంబై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఆయన కోరారంటూ పరమ్‌బీర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
ఉగ్రవాదుల జాబితా ప్రకటించిన కేంద్రం..
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సహా తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా గుర్తించింది. ఈ మేరకు బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వం జాబితా ప్రకటించింది. అమెరికాలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పంజాబ్ యువకులను ఉగ్రవాదంలోకి చేరడానికి ప్రేరేపిస్తున్నాడనే కారణంతో పన్నూన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. యూఏపీఏ కింద ఉగ్రవాదులుగా గుర్తించబడిన వారిలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన గుర్మిత్ సింగ్ బాగ్గా తదితరులు ఉన్నారు. కాగా గత సెప్టెంబర్‌లో.. సవరించిన యూఏపీఏ నిబంధనల ప్రకారం ప్రకటించిన ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీంలతో కలిపి ఈ సంఖ్య 13కు చేరుకుంది. (కీలక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ..) -
యూఏపీఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (యూఏపీఏ) 2019ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కే హక్కును నిరోధించే యూఏపీఏను రాజ్యాంగవ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుందని, టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదని పిటిషనర్ సజల్ అవస్ధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్పీ బిల్లుకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ.. చట్ట సవరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, తాజా సవరణతో వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను కోర్టులు కొట్టేసే అవకాశముందున్నారు. డీఎంకేకు చెందిన రవికుమార్ మాట్లాడుతూ.. మూకదాడి కేసులు, పరువు హత్యల్లో నిందితులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరారు. దీనిపై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మతం రంగు పులిమింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు పేలుడు ఘటనల్లో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టింది. దీంతో అసలైన నిందితులు తప్పించు కోగలిగారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకునే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసి, మీడియాపై ఆంక్షలు విధించింది’ అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. విదేశాల్లో ఉగ్ర కేసులపైనా ఎన్ఐఏ దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం–1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికే చట్ట సవరణను చేపట్టామన్నారు. ఒక సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తే అందులోని వ్యక్తులు వేర్వేరు పేర్లతో ప్రమాదకర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రస్తుత చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి వారి చర్యలపై నిఘా వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను అడ్డుకునేందుకే తాజాగా సవరణ చేపట్టాం’ అని వివరించారు. ‘ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగేందుకు వీలులేకుండా నిబంధనలున్నాయి. నాలుగు దశల్లో పరిశీలన జరిపిన మీదటే ఎవరైనా వ్యక్తులను ఉగ్ర వాదులుగా ప్రకటించేందుకు వీలుంటుంది’ అని తెలిపారు. -
యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలపాల (నిరోధక) సవరణ బిల్లు (యూఏపీఏ)కు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 147 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 42 మంది ఎంపీలు ఓటు చేశారు. వ్యక్తులనూ ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించే ఈ బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తున్న సందర్భాల్లో వ్యక్తులు మరో కొత్త సంస్థలను ఉనికిలోకి తెస్తున్నారని ఆయన అన్నారు. పెద్దలో సభలో బిల్లు ఆమోదానికి ముందు బిల్లుపై వాడివేడి చర్చ సాగింది. ఉగ్రవాదానికి మతం లేదని, కాలానుగుణంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చర్చను ప్రారంభిస్తూ అమిత్ షా అన్నారు. గతంలో ఈ తరహా కేసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించారని, యూఏపీఏ బిల్లును ఓ మతాన్ని టార్గెట్ చేస్తుందనే దుష్ర్పచారం సాగిందని చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశిస్తూ ఎమర్జెన్సీ సమయంలో మీడియాను నిషేధించి, విపక్ష నేతలందరినీ జైలు పాలు చేసిన మీకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నామని మమ్మల్ని ఆరోపించే అర్హత లేదని మండిపడ్డారు. యూఏపీఏ బిల్లు రెండు విభిన్న అంశాలతో కూడిఉందని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్పుకొచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదం రెండు భిన్న అంశాలను ఒకే బిల్లులో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వ్యక్తులను శిక్షించే అధికారం ప్రస్తుత చట్టంలో ఉండగా సవరణ బిల్లు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉగ్రవాదులో కూడిన ఉగ్ర సంస్ధలను నిషేధిస్తే తిరిగి వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ఎందుకని నిలదీశారు. వివాదాస్పద అంశాలతో కూడిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చిదంబరం కోరారు. -
నిరంకుశ పోకడకు ఇది నిదర్శనం
లోక్‌సభలో తాజాగా ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. ఎమర్జెన్సీలో అకారణంగా అరెస్టుల పాలై నాటి జనసంఘ్, ఆరెస్సెస్‌లకు చెందిన వేలాది కార్యకర్తల జీవితాలు ఛిద్రమైన చరిత్ర మరవకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపా పేరిట నిరంకుశ చట్టానికి మరిన్ని కోరలు తొడిగి బిల్లుకు ఆమోదం పొందటం గర్హనీయం. వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఈ సవరణ చట్టం అవకాశం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం భారతదేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్య. ఇంత నిరంకుశ చట్టాన్ని తీసుకొచ్చినా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అసాధ్యం. టెర్రరిజం, నక్సలిజం మూలాలను పట్టించుకోకుండా క్రూర చట్టాలతో వాటిని అంతం చేయడం అసంభవం, అసాధ్యం. అది 1975. ఎమర్జెన్సీ ప్రకటించిన కాలం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో నూకల రామచంద్రరావు హిందీ లెక్చరర్. ఆయన స్వతహాగా మంచి వ్యక్తి. తన పని తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకొనేవాడు కాదు. కాలేజీలో జరిగే సామాజిక, రాజకీయ అంశాల్లో కనీసం చర్చల్లో కూడా పాల్గొనే తత్వం కాదాయనది. అయితే అదే కళాశాలలో కొంత మంది లెక్చరర్లు సామాజిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. అందులో ఘనశ్యాంప్రసాద్, నిట్టల రామ దాస్లతో పాటు మరికొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఎస్.కే.బీ.ఆర్ కళాశాల మీద పోలీసులు నిఘా వేయడానికి అదే కారణం. ఇందులో ఘనశ్యాం ప్రసాద్, నేటి బీజేపీ కీలక నేత రాం మాధవ్‌కు గురువులాంటి వారని చెపుతుంటారు. అలాగే అమలాపురంలో నూకల రామచంద్రమూర్తి అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవారు. అయితే ఆయన లెక్చరర్ కాదు. నూకల రామచంద్రమూర్తి పేరు పోలీసుల లిస్టులో ప్రముఖంగా ఉంది. నూకల రామచంద్రమూర్తి, ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తోన్న నూకల రామచంద్రరావు ఒక్కరే అని పోలీసులు పొరపాటు పడ్డారు. హిందీ లెక్చరర్ నూకల రామచంద్రరావును ఆనాటికే అమ లులో ఉన్న ‘మీసా’ (ఆంతరంగిక భద్రతా చట్టం) కింద అరెస్టు చేశారు. ఆయనా, ఈయనా ఒకరు కాదని, ఎవ్వరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు పది నెలలకు పైగా ఆ అమాయకుడైన హిందీ లెక్చరర్ని ఆరెస్సెస్ కార్యకర్త స్థానంలో జైల్లో పెట్టారు. ఆయనకు ఆరెస్సెస్తోగానీ, మరే ఇతర సంస్థలతోగానీ సంబంధంలేదు. పది నెలలు ఏ నేరం చేయకుండా, ఎటువంటి రాజ కీయాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్బంధంలో ఉన్న రామచం ద్రరావు జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఆయన కంటి చూపు పూర్తిగా మందగించింది. అరెస్టుతో పరువు పోయిందని భావించిన రామచంద్రరావు ఆ దిగులుతోనే కన్నుమూ శారు. ఎమర్జెన్సీలో నిర్బంధ చట్టాల ద్వారా అక్రమ నిర్బంధాలకు గురైన వేల మంది అమాయకుల్లో రామచంద్రరావు ఒకరు. అది కేరళ రాష్ట్రం. కాలికట్ పట్టణం. అక్కడి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రాజన్‌ను 1976, మార్చి, 1వ తేదీన కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు నక్సలైట్లు పోలీసు స్టేషన్ మీద దాడి చేశారని, అందులో రాజన్ పాల్గొన్నాడని పోలీసుల అభియోగం. నిజానికి ఫిబ్రవరి 28వ తేదీన కాలికట్ ఇంజ నీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ కళాశాల ఉత్సవాల్లో ఉన్నారు. అంతే కాకుండా, నక్సలైట్ ఉద్యమంతోగానీ, ఆ దాడితోగానీ రాజన్‌కు ఎటు వంటి సంబంధమూ లేదు. కానీ పోలీసులు మాత్రం రాజన్‌ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేశారు. శవం కూడా దొరకకుండా మాయం చేశారు. ఆ తర్వాత రాజన్ తండ్రి ఎచ్చరవారియర్ హెబియస్‌కార్పస్ పిటిషన్ వేశారు. రాజన్‌తో పాటు అరెస్టయి, ఆయనతో పాటు చిత్ర హింసలు అనుభవించిన చంద్రన్ అనే వ్యక్తి ఆ తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత కేసు విచారణకు వచ్చింది. రాజ న్ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపినట్టు రుజువైంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంత మంది పోలీసులు నేరస్తులని చివరకు తేలింది. అయితే రాజన్ ప్రాణం మాత్రం తిరిగిరాలేదు. పై రెండు ఘటనలు 1975 నుంచి 1977 వరకు 19 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎటువంటి విచారణ లేకుండా అమాయకులను పట్టుకెళ్ళి జైళ్ళలో నిర్బంధించి పౌర హక్కులను కాలరాసిన ఆ దుర్భర రాత్రులను ఎవ్వరూ మరచిపోలేరు. ఆ రోజున అమలు జరిపిన నిర్బంధ చట్టాల వల్ల, పోలీసులకూ, భద్రతా బలగాలకూ ఇచ్చిన అపరిమితమైన అధి కారాల వల్లా జరిగిన ఘోరాలివి. ఎమర్జెన్సీలో దాదాపు లక్షమందికి పైగా జైళ్ళలో అక్రమ నిర్బంధాన్ని అనుభవించారు. అందులో ఈ రోజు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఎల్.కే. అద్వానీ, వాజ్ పేయి, ప్రకాశ్ జవ్దేకర్, బంగారు లక్ష్మణ్, ప్రమోద్ మహాజన్, సిహెచ్ విద్యాసాగర్‌రావు, జంగారెడ్డిలు ఉన్నారు. అనేక మంది ఇతర పార్టీల నాయకులు సైతం జైళ్ళలో మగ్గారు. ఎమర్జెన్సీలో నిర్బంధానికి గురైన వేలాది మంది నాయకులు ఈ రోజు ఇంకా బతికే ఉన్నారు. నిర్బంధ చట్టాలు దుర్వినియోగం జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఎమర్జెన్సీ లాంటి నిర్బంధపాలన వస్తే ప్రతిపక్షాలూ, ఇతర సంఘాలు, సంస్థలు మాత్రమే కాదు. అధికార పార్టీవారు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. వారం రోజుల క్రితం లోక్‌సభలో ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. పౌరులను అభద్రతాభావంలోకి నెడుతోంది. టెర్రరిజం, హింస ద్వారా హత్యాకాండ చేస్తున్న వ్యక్తులు, సంస్థలూ చట్టం ప్రకారం శిక్షార్హులే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రజాస్వా మ్యాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళు, రక్త పాతంతో, హింసాకాండలతో ఎటువంటి సంబంధమూ లేనివాళ్లు రక్త పాతాన్ని సమర్థించేవాళ్ళూ, సమర్థించని వాళ్ళూ, కొన్ని భావజాలా లను సమర్థిస్తున్నవారు ఈ సమాజంలో ఉన్నారు. అయితే టెర్రరిజాన్ని అణచివేయడానికి ప్రభు త్వాలు తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలకు మరిన్ని సవరణలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువ లను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ‘ఉపా’ చట్ట సవరణలలో ముఖ్యమైనవి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ)కు విస్తృతమైన అధికారాలివ్వడం. అందులో రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం. ఇది భారత దేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ హక్కులను కోల్పోక తప్పని పరిస్థితి. వ్యక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రప్రభుత్వాల మనుగడను సైతం ఇది ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. అంతేకాకుండా, గతంలో కొన్ని సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రక టించేవారు. ఇప్పుడు దానితో పాటు, వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే ప్రమాదకర అవకాశాన్ని ఈ సవరణ ఇస్తున్నది. ఏ విచారణా జరగకుండానే, ఆ వ్యక్తి ఉగ్రవాది అనే విషయాన్ని చట్టపరంగా న్యాయ స్థానాలు నిర్ధారించక ముందే ఆస్తులను జప్తు చేయడం, ఇతర రకాలైన పౌరహక్కులన్నింటినీ లాగేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇది పూర్తిగా రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవు తుంది. వాక్స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ హక్కు సహా చివరకు జీవించే హక్కునే ఆ వ్యక్తి కోల్పోయే దారుణమైన పరిస్థితి. చాలావరకు అమాయకులు, రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక నాయకులతో శతృత్వం ఉన్న వాళ్ళు అందరూ ఈ చట్టం వల్ల ఇబ్బంది పాలవుతారు. ఎమర్జెన్సీలో బాధితులుగా ఉన్న పార్టీ, సంస్థలు ఇలాంటి చట్టం తేవడం బాధాకరం. ఆ రోజుల్లో ఎన్నివేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు ఇబ్బం దులు పడ్డారో ఇటీవల ఎమర్జెన్సీ దురాగతాల గురించి మాట్లాడిన బీజేపీ నేతలు వెల్లడించారు. ఆ అనుభవాలను గుణపాఠాలుగా తీసు కోవడానికి ఆనాటి బాధిత పక్షం, ఈనాటి అధికార పక్షం సిద్ధంగా లేదు. టెర్రరిజం, నక్సలిజం అనే కార్యకలాపాలను అంతమొందించాలనే ఉద్దేశ్యం కోసమే ఈ చట్టం అవసరమైతే, ఇది సమగ్ర ఫలితాలను ఇవ్వదు. టెర్రరిజం దానికిగల కారణాలకు తగ్గట్టుగా చర్యలు తీసు కోవాలి. అందులో చట్టాలు కూడా భాగమే. కానీ అవి మాత్రమే సమ స్యను పరిష్కరించలేవు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇంతకన్నా ఘోరమైన నిర్బంధాన్ని అమలు జరిపారు. కానీ ఫలితం రాలేదు. అక్కడి ప్రజల అభిప్రాయాలకూ, వారి విశ్వాసాలకూ ప్రాధాన్యతనివ్వ కుండా, కశ్మీర్‌ని భౌగోళికంగా మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఈనాటికీ అక్కడి ప్రజల మనసులను ఏ ప్రభుత్వం గెలుచుకోలేక పోయింది. అడుగడుగునా నిర్బంధం విధించి సైనిక పాలన చేస్తే సమస్య పరిష్కారమవుతుందా? లేక మరింత చిక్కనై, జటిలం అవుతుందా? అనే విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి. నక్సలైట్ సమ స్యను కూడా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నంత కాలం దానికి పరిష్కారం ఉండదు. ఈ రోజు భారతదేశంలో నక్సలైట్ సమస్య ఆయు ధాలు, బాంబుల సమస్యకాదు. అది అడవిలో ఆదివాసీల సమస్య. అక్కడి ఆదివాసులను భారతదేశంలో పౌరులుగానే మనం గుర్తించడం లేదు. వారి విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సౌకర్యాలు మనకు ఏ మాత్రం పట్టవు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వమే ఉనికిలో లేదు. ఇన్ని విషయాలను వదిలేసి, కేవలం చట్టాలు, పోలీసులు, సైన్యం, నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు మాత్రమే టెర్రరిజానికీ, నక్సలిజానికీ పరి ష్కారంగా భావిస్తే, గతంలో లాగానే మరో నిర్బంధ చీకటి భారతాన్ని ప్రభుత్వం కలగంటోందని భావించాల్సి వస్తుంది. పిల్లిని సైతం నిర్బంధంలో ఉంచి హింసిస్తే చావడం కన్నా తిరగబడటమే మేలనుకొంటుం దన్న విషయాన్ని మనం మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఈ చట్టాలు ఎవరి చుట్టాలు?
నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, ప్రధాని హత్యకు కుట్రపన్నారని చేసిన ఆరోపణల ఆధారంగా కోర్టులో హక్కుల ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి, వారిపై అభియోగాలు రుజువుకావడం లేదా కాకపోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించే వారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే యూఏపీఏ చట్టం కింద అభియోగాలు నమోదు చేస్తారు. ఈ తరహా వేధింపుల చట్టాలు పాలకపక్షానికి రాజకీయ ప్రయోజనం కలిగిస్తాయి. ఈ కేసుల్లో చిక్కుకున్న వారు ఏళ్ల తరబడి విచారణ పేరుతో నిర్బంధంలో మగ్గిపోతుంటారు. చట్టాన్ని తన పని తనను చేసుకోనివ్వండి, అని ఈ రోజుల్లో కొందరు తెలివిగా చెబుతారు. వాస్తవానికి దాడులు, బెదిరింపులు, అరె స్టులతో వేధింపుల ఆట మొదలవుతుంది. చట్టాన్ని ఇష్టమొచ్చినట్టు వంచి తమకు అనుకూలంగా వాడు కుంటారు పాలకులు. మంచి, చెడు మధ్య, చట్ట బద్ధ మైన, చట్ట వ్యతిరేక ప్రవర్తన మధ్య సాక్ష్యాధారాలను బట్టి ఏది న్యాయమైనదో తేల్చడంపైనే చట్టాల అమలు ఆధారపడి ఉంటుంది. ఇటీవల పుణె పోలీ సులు అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల ఉద్యమ నేతలు సుధాభరద్వాజ్, గౌతమ్నవలాఖా, అరుణ్ ఫెరీరా, వరవరరావు, వర్నన్ గొన్సాల్వ్స్‌పై చేసిన ఆరోపణలను బట్టి వారికి నక్సల్స్‌తో సంబంధా లున్నాయని లేదా భీమా కోరేగావ్ హింసలో వారికి పాత్ర ఉందని లేదా వారంతా కలిసి ప్రధాని హత్యకు కుట్రపన్నారని అనుకోవాలి. కాని, కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి. వారిపై అభియోగాలు రుజువుకావడానికి లేదా కాక పోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజ కీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించేవారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు చేస్తారు. అయితే, నేరం నిరూపించడానికి లేదా నిరూపించ లేకపోవడానికి అంత ప్రాధాన్యం ఉండదు. ఉగ్రవాద చర్యలు, సంస్థలు, దేశ ఆర్థిక భద్రతకు ముప్పు తెచ్చే నేరాలూ–ఇవన్నీ యూఏపీఏ పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకుంటే పోలీసు కస్ట డీలో గరిష్ట కాలం ఉంచవచ్చు. 180 రోజుల వరకూ చార్జిషీటు దాఖలు చేయకపోయినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అంతేగాక దీని కింద అరెస్టయిన వారికి బెయిలు దొరకడం కష్టం. రుజువుకాని సంబం ధాలపై ఆధారపడి చేసే అభియోగాలను బట్టి నింది తులను దోషులుగా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. 2007లో యూఏపీఏ నిబంధనల కింద అరెస్టుచేసిన వర్నన్ గొన్సాల్వ్స్‌పై మొత్తం 17 అభియోగాలు నమోదు చేశారు. వీటన్నిటి నుంచి నిర్దోషిగా బయటపడటానికి ముందు ఆయన తన జీవితంలో ఆరేళ్లు జైల్లో గడపాల్సివచ్చింది. కాబట్టి యూఏపీఏ కింద అరెస్టయినవారు ఎవరైనా ఇలాంటి కష్టాలు తప్పవు. మహ్మద్ అమీర్‌ఖాన్ ఈ చట్టం కింద చేసిన 18 ఆరోపణల నుంచి విముక్తి పొంద డానికి 14 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇంకా మహ్మద్ అబ్దుల్ కలీం వంటి వేలాదిమంది తమ జీవితాల్లో కీలకమైన సమయాన్ని కారాగారాల్లోనే గడపాల్సి వచ్చింది. ఇలాంటి తీర్పులు వచ్చేనాటికి ఈ చట్టం కింద నిర్బంధంలో గడిపిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా నీరసించిపోతారు. యూఏపీఏ కింద అరెస్టు చేయడమే.. నిందితులకు తర్వాత ఎదురయ్యే నిర్బంధం కారణంగా ఓ తరహా క్రమశిక్షణలా, అదుపు చేసే టెక్నాలజీలా పనిచేస్తుంది. ఆగస్టు 28న పైన చెప్పిన ఐదుగురు ప్రముఖులను అరెస్ట్ చేయ డానికి ముందు జూన్‌లో ఐదుగురిని మహారాష్ట్ర పోలీ సులు అరెస్ట్ చేశారు. జనవరి ఒకటిన భీమా కోరే గావ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించే ఈ అరెస్టులూ జరిగాయి. గత మూడు నెలల్లో అరెస్టు చేసిన ఈ పది మంది, రెండు మూడేళ్లలో అరెస్టయిన అనేక మంది కూడా ప్రజల కోసం పనిచేసే ఉద్యమ కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావేత్తలు. దేశంలో అత్యంత బలహీన స్థితిలో ఉన్న బడుగు వర్గాలైన ఆదివాసీలు, దళితులు, విచారణ ఖైదీల తర ఫున వారు చట్టబద్ధ పోరాటాలు చేస్తున్నారు. జూన్‌లో అరెస్టయినా చార్జిషీట్ పెట్టలేదు! యూఏపీఏ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న కేసుల్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమౌతాయి. భీమా కోరేగావ్ హింసను సాకుగా చూపి జూన్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురిపై ఇంతవరకు అభియోగ పత్రం దాఖలు చేయలేదు. ప్రధానమంత్రి హత్యకు సంబంధించిన కుట్ర కేసులో దర్యాప్తును మూడు నెలలైనా పూర్తి చేయకపోవడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒకవేళ నిందితులపై చేసిన అభియో గాలకు సాక్ష్యాధారాలు సరిగ్గా దొరక్కపోతే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధారాలు లేకుండా కొందరిని ఎందుకు లక్ష్యంగా చేసుకుని వారిని జైళ్లలో పెట్టారు? వారు ‘పట్టణ నక్సల్స్’ అనీ దేశాన్ని ‘ముక్కలు ముక్కలు’ చేసే ముఠా అని ముద్ర వేసి పదేపదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వారిని ఇలా వేధించడం, శిక్షించడం స్వయం ప్రకటిత జాతీయ వాదులకు ఆనందాన్ని, ఊరటను ఇస్తోంది. ప్రాతి నిధ్యం, సమన్యాయ పాలన, స్వేచ్ఛా స్వాతం త్య్రాలు– ఈ మూడు కీలకాంశాలపై ఆధారపడి ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ప్రాతినిధ్యం అంటే కేవలం చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారితో మాట్లా డటం తెలియని, చట్టాలు ఉపయోగించు కోవడంపై అవగాహన లేని నోరులేని ప్రజల తరఫున పని చేయడం కూడా ప్రాతినిధ్యమనే ముఖ్య విషయం కిందకు వస్తుంది. ఆదివాసీలు, దళితులు, కార్మి కులు వంటి బడుగువర్గాల తరఫున న్యాయస్థానాల్లో పోరా డుతున్న లాయర్లు–సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, సురేంద్ర గాడ్లింగ్, ఉపేంద్ర నాయక్ (ఒడిశా), మురుగన్ (తమిళనాడు), సత్యేంద్ర చౌబే (ఛత్తీస్ గఢ్). వీరందరినీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వేధి స్తూనే ఉన్నాయి. బలహీనవర్గాల ప్రజల తరఫున వాదించకుండా పారిపోయేలా చేయడానికే లాయ ర్లను అరెస్టు చేయడం లేదా అరెస్టు చేస్తామని బెది రించడం, యూఏపీఏ వంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించడం జరుగుతోంది. దేశంలో అభివృద్ధి ఏకపక్షంగానే ఉంటుందని, ఇలా కొందరికి ప్రగతి ఫలాలు లభించే ఏకపక్ష అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే ఇలాంటి చట్టాల కింద అభియోగాలు మోపి ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రభుత్వాల ఉద్దేశం. న్యాయపాలన ఎక్కడుంది? ప్రజాస్వామ్యం రెండో ప్రధాన లక్షణం న్యాయ పాలన, చట్టాలు అమలు చేసేవారు జవాబుదారీగా పనిచేయడం. ప్రజల హక్కులు కాపాడటమేగాక, వాటిని హరించే సందర్భాల్లో బాధితులకు తగిన సాయం, ఊరట లభించేలా చేయడమే న్యాయ పాలన లక్ష్యం. ఆదివాసీలు, స్థానిక జాతుల ప్రజలు వారి భూములను కాపాడుకోవడానికి సంబంధించి రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూలులో ప్రత్యేక చట్టాలు, అటవీ హక్కుల చట్టం(2006) ఉన్నాయి. అటవీ, షెడ్యూల్డ్ ప్రాంతాల భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు జనంతో సంప్ర దింపులు జరపాలి. ఒడిశా నియంగిరిలో డొంగరియా కోంధుల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఈ విషయమే తేల్చిచెప్పింది. కాని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలను జవాబుదారీగా, బాధ్య తతో మెలిగేలా చేయడం మీడియా విధి. మారు మూల అటవీ ప్రాంతాల్లో చట్టాల ఉల్లంఘనతో ఆది వాసీలకు అన్యాయం జరిగితే సమాచారం సేకరించి, జాతీయ మీడియాకు అందించే జర్నలిస్టులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి న్యాయమైన సమాచారం జాతీయస్థాయి మీడియా సంస్థలకు చేరకుండా ఆపడానికి అనేక మంది జర్నలిస్టులను ప్రభుత్వాలు, చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ విభాగాలు నానా వేధింపులకు గురిచేస్తున్నాయి. వారిపై నిఘాతోపాటు వారిని బెది రించడం, అరెస్ట్ చేయడం లేదా పనిచేసే ప్రాంతాల నుంచి పంపించేయడం నిత్యం జరిపే వేధింపుల్లో భాగం. ఛత్తీస్‌గఢ్ ప్రజా భద్రతా చట్టం కింద జర్నలి స్టులు మాలినీ సుబ్రమణ్యం (జగదల్పూర్లోని ఆమె ఇంటిని ధ్వంసం చేశారు, ఊరు వదిలిపోయే వరకూ రాళ్లు విసిరారు), దీపక్ జైస్వాల్, సొమూరూ నాగ్, సంతోష్ యాదవ్‌లను బస్తర్‌లో అరెస్ట్ చేశారు. అంతరిస్తున్న స్వాతంత్య్రాలు అనేక స్వాతంత్య్రాల ద్వారా ప్రజాస్వామ్యం పని చేస్తుంది. మాట్లాడే, భావాన్ని వ్యక్తంచేసే, సంఘాలు పెట్టుకునే, అసమ్మతి తెలిపే స్వాతంత్య్రాలు ప్రధా నమైనవి. జన సమీకరణ, అభిప్రాయాలు, ఎజెం డాల మధ్య పోటీ ద్వారా ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తుంది. అసమ్మతి వ్యక్తీకరణ ప్రజాస్వామ్యానికి అవసరమనే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్ సూటిగా చెప్పారు. ఉదారవాద ప్రజా స్వామ్య వ్యవస్థను అర్థంచేసుకుని ఆయన ఈ విష యంపై వివరణ ఇచ్చారు. అందుకూ అసమ్మతి ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అనీ, దాన్ని పని చేయనివ్వకపోతే పేలుడు తప్పదని ఆయన హె^è్చ రించారు. చట్టాలు గౌరవించే ప్రజలందరికీ మేలు చూస్తూ జనరంజకంగా సాగాల్సిన ప్రజాస్వా మ్యంలో తరచూ జనం కోసం పనిచేసే వారిని అరె స్టులు, నిర్బంధాలతో ఎందుకు ప్రభుత్వాలే వేధిస్తు న్నాయి? అలాగే, యూఏపీఏ, దానికి ముందు అమలులో ఉండి రద్దయిన ఉగ్రవాద నిరోధక చట్టం, ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం వంటివి ఎందుకు వస్తున్నాయి? అవి కొనసాగడానికి కారణాలేంటి? చట్టాలు గౌరవించే పౌరులను బోధన, న్యాయవాద వృత్తి, రచన, ఉపన్యాసాలు ఇవ్వడం, వార్తా సేకరణ వంటి తమ వృత్తుల్లో కొన సాగకుండా నిరోధించడానికి నిరంతరం వారిని రాక్షస చట్టాలతో వేధించే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? అనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పాలకులు తప్పక జవాబు చెప్పాలి. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, లాయర్లపై వేధిం పులు కొనసాగడాన్ని చూస్తే– పాలకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని భావించేవారిని అడ్డుతొల గించుకుంటారని సూత్రీకరించిన అమెరికా సిద్ధాంత కర్త హెన్రీ గిరోక్స్ గుర్తుకొస్తారు. ప్రజలను అణచి వేసే రాజ్యం భారత కార్పొరేట్ సంస్థల ప్రయోజ నాలు కాపాడటానికే పనిచేస్తుంది. అందుకు అవసర మైతే ఆదివాసీలు, పేదలు, బలహీనవర్గాలను మరింత దుర్భర, దారుణ పరిస్థితుల్లోకి నెట్టడానికి కూడా అనుమతిస్తుంది. రాజశ్రీ చంద్ర రాజనీతి శాస్త్ర విభాగం వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఢిల్లీలోని జానకీదేవి మెమోరియల్ కాలేజీ -
ఇస్లామిక్ స్టేట్ సంస్థపై నిషేధం
* ఐఎస్ఐఎస్తో దేశ భద్రతకు పెనుముప్పు * యూఏపీఏ చట్టం కింద నిషేధించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో వరుస హత్యలు, దాడులతో దారుణ మారణకాండను కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను భారత్ నిషేధించింది. భారత్ సహా వివిధ దేశాల యువతను ఉగ్రవాదులుగా ఆ సంస్థ నియమించుకుంటోందని, ఉగ్రవాద శిక్షణ పొందిన యువత తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే జాతీయ భద్రతకే పెనుముప్పు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/డైష్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఇరాక్, దాని సరిహద్దు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఎస్ఐఎస్ ప్రపంచ జిహాద్‌కు ప్రయత్నిస్తోందని కేంద్రం తన నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి సొంత ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని, అమాయక పౌరులను, భద్రతా బలగాలను హతమారుస్తూ ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేస్తోందని తెలిపింది. కాగా, ఐఎస్ఐఎస్లో చేరేందుకు గతేడాది ముంబై నుంచి నలుగురు యువకులు ఇరాక్, సిరియాలకు వెళ్లారు. వారిలో ఒకరు గతేడాది తిరిగి రాగా, మిగతా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. అలాగే, బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే యువకుడు ఐఎస్ఐఎస్కు అనుకూలంగా ట్వీటర్లో ఖాతా నిర్వహించి అరెస్టు అయిన విషయం తెలిసిందే.