‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం | Parliament approves amendment to UAPA Amendment bill | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Published Sat, Aug 3 2019 4:19 AM | Last Updated on Sat, Aug 3 2019 4:19 AM

Parliament approves amendment to UAPA Amendment bill - Sakshi

రాజ్యసభలో మాట్లాడుతున్న అమిత్‌షా

న్యూఢిల్లీ: కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్‌పీ బిల్లుకు మద్దతు తెలిపాయి.   

కాంగ్రెస్‌పై అమిత్‌ షా విమర్శలు
బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ..  చట్ట సవరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, తాజా సవరణతో వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను కోర్టులు కొట్టేసే అవకాశముందున్నారు. డీఎంకేకు చెందిన రవికుమార్‌ మాట్లాడుతూ.. మూకదాడి కేసులు, పరువు హత్యల్లో నిందితులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరారు.

దీనిపై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మతం రంగు పులిమింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు పేలుడు ఘటనల్లో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టింది. దీంతో అసలైన నిందితులు తప్పించు కోగలిగారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకునే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసి, మీడియాపై ఆంక్షలు విధించింది’ అని కాంగ్రెస్‌ పార్టీకి చురకలు అంటించారు.  

విదేశాల్లో ఉగ్ర కేసులపైనా ఎన్‌ఐఏ
దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్‌ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జలియన్‌ వాలాబాగ్‌ నేషనల్‌ మెమోరియల్‌ చట్టం–1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జలియన్‌ వాలాబాగ్‌ నేషనల్‌ మెమోరియల్‌ కమిటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. డ్యామ్‌ సేఫ్టీ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.  

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే..
చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిస్తూ.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికే చట్ట సవరణను చేపట్టామన్నారు. ఒక సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తే అందులోని వ్యక్తులు వేర్వేరు పేర్లతో ప్రమాదకర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రస్తుత చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి వారి చర్యలపై నిఘా వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను అడ్డుకునేందుకే తాజాగా సవరణ చేపట్టాం’ అని వివరించారు. ‘ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగేందుకు వీలులేకుండా నిబంధనలున్నాయి. నాలుగు దశల్లో పరిశీలన జరిపిన మీదటే ఎవరైనా వ్యక్తులను ఉగ్ర వాదులుగా ప్రకటించేందుకు వీలుంటుంది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement