Rajya Sabha approved the bill
-
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. -
‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్పీ బిల్లుకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ.. చట్ట సవరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, తాజా సవరణతో వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను కోర్టులు కొట్టేసే అవకాశముందున్నారు. డీఎంకేకు చెందిన రవికుమార్ మాట్లాడుతూ.. మూకదాడి కేసులు, పరువు హత్యల్లో నిందితులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరారు. దీనిపై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మతం రంగు పులిమింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు పేలుడు ఘటనల్లో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టింది. దీంతో అసలైన నిందితులు తప్పించు కోగలిగారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకునే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసి, మీడియాపై ఆంక్షలు విధించింది’ అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. విదేశాల్లో ఉగ్ర కేసులపైనా ఎన్ఐఏ దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం–1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికే చట్ట సవరణను చేపట్టామన్నారు. ఒక సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తే అందులోని వ్యక్తులు వేర్వేరు పేర్లతో ప్రమాదకర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రస్తుత చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి వారి చర్యలపై నిఘా వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను అడ్డుకునేందుకే తాజాగా సవరణ చేపట్టాం’ అని వివరించారు. ‘ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగేందుకు వీలులేకుండా నిబంధనలున్నాయి. నాలుగు దశల్లో పరిశీలన జరిపిన మీదటే ఎవరైనా వ్యక్తులను ఉగ్ర వాదులుగా ప్రకటించేందుకు వీలుంటుంది’ అని తెలిపారు. -
ఎన్నికల టీం రెడీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతోంది. లోక్, రాజ్యసభలు తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర, గెజిట్ ప్రకటనే తరువాయి. అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో రాజకీయ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికల టీం రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా ప్రకటించడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే వాటిపై కసరత్తు చేస్తోంది. ఈసీ ఆదేశాలకు మేరకు ఇప్పటికే జిల్లాలో బదిలీలు జరిగాయి. జిల్లాకు బదిలీపై వచ్చిన కొత్త తహశీల్దార్లు కొందరు ఇప్పటికే విధుల్లో చేరారు. జిల్లాస్థాయి అధికారులు, కొత్తగా వచ్చిన 47 మంది తహశీల్దార్లతో ఇప్పటికే కలెక్టర్ అహ్మద్‌బాబు సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూచనలు చేశారు. పర్యవేక్షణ బాధ్యతలు ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని కలెక్టరేట్ అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగా జాయిం ట్ కలెక్టర్, ఐటీడీఏ పీవోలతోపాటు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు ఎస్వీఈఈపీ, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారాల బాధ్యతలు అప్పగించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు కంప్యూటరైజేషన్, ఎన్నికల వ్యయం, ఎస్ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. డీఆర్వో రాజుకు జిల్లా పరిశీలన ప్రణాళిక, శాంతి భద్రతలు.. సీపీవో షేక్‌మీరాకు బ్యాలెట్ పత్రాలు, డమ్మీ బ్యాలెట్ పత్రాల ముద్రణ.. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డికి సిబ్బంది శిక్షణ.. డీఈవో రామరావుకు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్.. ఆర్వీఎం పీవో శ్రీనివాస్‌రెడ్డికి ఈవీఎం పర్యవేక్షణ.. ఉప రవాణా శాఖ కమిషనర్ ప్రవీణ్‌రావుకు రవాణా పర్యవేక్షణ.. పరిశ్రమల జీఎం రవీందర్‌కు మెటీరియల్ మేనేజ్మెంట్.. కార్మిక శాఖ ఉప కమిషనర్ దండపాణికి ఇంప్లిమెంటింగ్ ఎంసీసీ.. వికలాంగుల శాఖ ఏడీ నారాయణరావుకు అబ్జర్వర్.. డీపీఆర్వో రవికుమార్‌కు మీడియా కమ్యూనికేషన్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. రిటర్నింగ్ అధికారులు జిల్లాలోని పది నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. రిటర్నింగ్ అధికారులు నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలలో ఉన్న అధికారులు.. సిర్పూర్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ఎస్డీసీ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్‌కు సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఖానాపూర్‌కు ఉట్నూర్ ఆర్డీవో రామచంద్రారావు, ఆదిలాబాద్‌కు ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, బోథ్‌కు డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, నిర్మల్‌కు ఆర్డీవో అరుణశ్రీ, ముథోల్‌కు ఏజేసీ రాజు, చెన్నూర్, బెల్లంపల్లికి ఇన్చార్జి ఎస్డీసీ తిరుపతిరెడ్డి, మంచిర్యాలకు ఆర్డీవో చక్రధర్‌రావును నియమించనున్నారు.