
ముంబై: ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం కేసులో వాజే ఎన్‌ఐఏ అదుపులో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో గురువారం ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు..మరో 15 రోజులు కస్టడీకి అప్పగించాలని జడ్జీ పీఆర్ సిత్రేని కోరారు.
ఈ సందర్భంగా వాజే..తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా బలిపశువును చేశారంటూ వాపోయారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు వాజే నివాసం నుంచి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాటిని ఇంట్లో ఎందుకు ఉంచారనే విషయమై విచారణ చేపట్టారు. పోలీసు శాఖ ఆయనకు మంజూరు చేసిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే దొరికాయి. మిగతావి లభ్యం కాలేదు’అని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇదే కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మరో ఇద్దరితోపాటు వాజేను కలిపి విచారణ జరపాల్సి ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముంబై హైకోర్టులో పరమ్‌బీర్ సింగ్ పిటిషన్
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తక్షణం నిష్పాక్షి విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ గురువారం ముంబై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఆయన కోరారంటూ పరమ్‌బీర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment