custody extended
-
బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఇప్పటల్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 6 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 16న కేసు నమోదు చేయగా.. మే 18న కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం జూన్ 22న వరకు కస్టడీ పొడిగించగా.. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిని కోర్టు కొట్టివేసింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. -
Delhi liquor scam: మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీíÙయల్ కస్టడీకి పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులు ఆయన్ను శనివారం ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీíÙయల్ కస్ట డినీ పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మనీశ్ సిసోడియా జైలులోనే ఉన్నారు. -
మద్యం స్కాంలో కవిత ప్రధాన కుట్రదారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కుట్రదారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం ఈ కుంభకోణం సూత్రధారుల్లో కవిత ఒకరుగా తేలిందని పేర్కొంది. ఈ కేసులో కవితను అరెస్టు చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. మరో ఐదు రోజులపాటు ఆమె కస్టడీ పొడిగించాలని కోరుతూ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు సమర్పించింది. అందులో పలు ఆరోపణలు చేసింది. తప్పించుకొనేలా సమాధానాలు ఇస్తున్నారు.. ఢిల్లీలో మద్యం లైసెన్సుల్లో భారీ వాటాను చేజిక్కించుకొనేందుకు ‘సౌత్ గ్రూప్’ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెల్లించిన రూ. 100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. ముడుపులు చెల్లించినందుకు మద్యం పాలసీ రూపకల్పనలో తనకు అనుకూలంగా మార్పులు చేయాలని కవిత కోరారని తెలిపింది. తన బినామీ అరుణ్ పిళ్లై ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ‘ఇండోస్పిరిట్స్’లో కవిత పార్టనర్షిప్ పొందారని... రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపులు, మనీలాండరింగ్‌లో ఆమె చురుకైన పాత్ర పోషించారని వివరించింది. ఇండో–స్పిరిట్స్‌లో కవిత బినామీ ద్వారా రూ. 192.8 కోట్ల మేర నేరం జరిగిందని... మొత్తంగా రూ. 292.8 కోట్ల మేర నేరాల సొమ్ముకు సంబంధించిన లావాదేవీల్లో కవిత భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపించింది. ఈ నేరాలకుగాను పీఎంఎల్ఏ సెక్షన్ 3 కింద కవిత దోషి అని, అందుకే పీఎంఎల్ సెక్షన్ 19 కింద అరెస్టు చేశామని కోర్టుకు ఈడీ తెలిపింది. అరెస్టుకు సంబంధించిన కారణాలు విడిగా రికార్డు చేశామని, అరెస్టు చేసిన విషయాన్ని కవిత భర్తకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు తెలిపింది. కస్టోడియల్ విచారణ సమయంలో కవిత తప్పించుకొనేలా సమాధా నాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నెల 17 నుంచి మార్చి 22 వరకు ఆమె స్టేట్మెంట్లు తీసుకున్నామని, దీంతోపాటు మరో నలుగురు నిందితులకు సంబంధించి నాలుగు వాంగ్మూలాలు తీసుకున్నామని తెలిపింది. సహ నిందితుల స్టేట్మెంట్లను చూపి వాటిలోని అంశాల ఆధారంగా కవితను ప్రశ్నించామని ఈడీ పేర్కొంది. అలాగే జప్తు చేసిన కవిత ఫోన్లోని డేటా ఫార్మాటింగ్‌కు గురైనట్లు తేల్చిన ఫోరెన్సిక్ నివేదికను ముందుపెట్టి విచారించామని తెలిపింది. బంధువు ప్రమేయం గురించి తెలియదంటూ.. కవిత వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ గురించిన వివరాలు చెప్పాల్సిందిగా కోరగా ‘తెలియదు’ అని కవిత ముక్తసరిగా బదులిచ్చారని ఈడీ పేర్కొంది. కానీ ఈ నెల 15న కవిత నివాసంలో సోదాల సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నారని.. దీంతో ఆయన ఫోన్‌ను కూడా జప్తు చేశామని వివరించింది. అనుమానాస్పద లావాదేవీలు ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన్ను విచారణకు రావాలని రెండుసార్లు సమన్లు పంపగా రాలేదని ఈడీ తెలిపింది. గత వారం రోజులుగా చేపట్టిన దర్యాప్తులో మద్యం స్కాంలో ఆర్జించిన సొమ్ము బదిలీ లేదా వినియోగంలో శరణ్ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని.. కానీ అతను విచారణకు సహకరించనందున అతని ఇంట్లో శనివారం సోదాలు చేపట్టినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు శరణ్ ద్వారా జరిగిన నగదు బదిలీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇప్పటికే అరెస్టు చేసిన ఇండో–స్పిరిట్స్ ప్రమోటర్ సమీర్ మహేంద్రును మరింత లోతుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. అందుకు అనుమతించాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో పాత షరతులతోనే కవితను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. బెయిల్ మంజూరు చేయాలి: కవిత న్యాయవాది కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ కవిత నుంచి ఈడీ కొన్ని డాక్యుమెంట్లు కోరుతోందని, అయితే కస్టడీలో ఉన్న కవిత వాటిని ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. బెయిల్ ఇస్తేగానీ ఆ డాక్యుమెంట్లు అందజేయలేరని పేర్కొన్నారు. ఈ మేరకు బెయిల్ కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు. అయితే బెయిల్‌ను ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వ్యతిరేకించారు. ఈ సమయంలో ఆ అప్లికేషన్ మెయింటైనబిలిటీ ఉండదని కోర్టుకు తెలిపారు. దీంతో కవిత ఈడీ కస్టడీ ముగియగానే బెయిల్ పిటిషన్ విచారించాలని రాణా కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా కవితను 3 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు తిరిగి హాజరుపరచాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు.. -
అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికాస్ ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాదులు నవీన్‌కుమార్, జొహబ్ హొస్సైన్ వాదనలు వినిపిస్తూ సౌత్గ్రూపులో కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేయగానే తన వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్ దాఖలు దాఖలు చేశారని పరోక్షంగా కవితకు నోటీసులు జారీ అయిన తదుపరి ఇలా జరిగిందని ధర్మాసనానికి వివరించారు. సీసీ టీవీ సమక్షంలోనే పిళ్లైను విచారించామన్నారు. కేసు కీలక దశలో ఉందని ఆడిటర్ బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని విచారించాల్సి ఉన్న కారణంగా కస్టడీని పొడిగించాలని కోరారు. మద్యం పాలసీ ముసాయిదా ఫోన్లోకి రావడం, హోటల్ సమావేశాలపై సౌత్‌గ్రూపులోని వారిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. తనని టార్చర్ చేశారని పిళ్లై ఆరోపిస్తున్నారని ఒకవేళ అలా చేస్తే మరో 12 సార్లు స్టేట్మెంట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విచారణ తర్వాతే పిళ్లై స్టేట్మెంట్లు రూఢీ చేసుకున్నామన్నారు. ఈడీ వాదనలతో పిళ్లై న్యాయవాదులు విభేదించారు. అనంతరం ఈ నెల 16 వరకూ పిళ్లైని ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ నెల 15న విచారణకు రావాలని ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో 9న విచారణకు రావాలని కోరగా బుచ్చిబాబు 13న వస్తానని అంగీకరించారని అయితే పిళ్లై ను కోర్టులో హాజరు పరచాల్సి ఉండడంతో తేదీ మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15న íపిళ్లై, బుచ్చిబాబులను కలిపి ఈడీ విచారించనుండగా 16న విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గత విచారణ సమయంలో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే. -
పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. మరో మూడు రోజుల పాటు పిళ్లై కస్టడీని పొడగించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు పిళ్లై ఈడీ అదుపులోనే ఉండనున్నారు. మరోవైపు 16వ తేదీనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు మరోసారి రావాలని ఈడీ కోరిన సంగతి తెలిసిందే. దీంతో పిళ్లైను కవితతో కలిపి మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజాగా.. సంబంధిత వార్త: పిళ్లైను మేం టార్చర్ చేయలేదు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. 15వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. బుచ్చిబాబుతోనూ పిళ్లైను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా సైతం ఈడీ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో పిళ్లై వాంగ్మూలం పక్కాగా నమోదు చేశామని, కానీ, ఒక బలమైన వ్యక్తికి సమన్లు జారీ చేశాకే(కవిత సమన్లను ఉద్దేశించి..) ఆయన తన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును ఆశ్రయించారని, పిళ్లై ఎందుకు మాట మార్చారో స్పష్టమవుతోందంటూ కోర్టులో ఈడీ వాదించింది. లిక్కర్ స్కాంలో మరికొంత మందికి సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కాబట్టి పిళ్లై కస్టడీ పొడగింపు కీలకమని కోర్టుకు తెలిపింది ఈడీ. దీంతో ఈడీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుని.. కస్టడీని పొడిగించింది. -
వాజే ఎన్ఐఏ కస్టడీ పొడిగింపు
ముంబై: ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో గురువారం ఎన్ఐఏ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు..మరో 15 రోజులు కస్టడీకి అప్పగించాలని జడ్జీ పీఆర్ సిత్రేని కోరారు. ఈ సందర్భంగా వాజే..తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా బలిపశువును చేశారంటూ వాపోయారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు వాజే నివాసం నుంచి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాటిని ఇంట్లో ఎందుకు ఉంచారనే విషయమై విచారణ చేపట్టారు. పోలీసు శాఖ ఆయనకు మంజూరు చేసిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే దొరికాయి. మిగతావి లభ్యం కాలేదు’అని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇదే కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మరో ఇద్దరితోపాటు వాజేను కలిపి విచారణ జరపాల్సి ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై హైకోర్టులో పరమ్‌బీర్ సింగ్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తక్షణం నిష్పాక్షి విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ గురువారం ముంబై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఆయన కోరారంటూ పరమ్‌బీర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
ఛోటా రాజన్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గత అక్టోబర్ 25న ఇండోనేసియాలోని బాలీలో అరెస్టయిన ఛోటా రాజన్‌ను నవంబర్ 6న భారత్‌కు తరలించిన సీబీఐ అధికారులు ఢిల్లీలోనే ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి కస్టడీ గడువు ముగియడంతో అధికారులు.. ఢిల్లీ సీబీఐ కోర్టు ఎదుట ఛోటాను హాజరుపర్చారు. ఈ నెల 19 వరకు రాజన్‌ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఛోటా రాజన్ ను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచి విచారిస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాజన్‌ను ఆయన సోదరీమణులు కలుసుకున్నారు. 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా తమ సోదరుణ్ని కలుసుకునేందుకు అనుమతించాలని రాజన్ సోదరీమణులు కోర్టును అభ్యర్థించడంతో ఆమేరకు అనుమతి లభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో చోటుచేసుకున్న 80 కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్.. భారత్ నుంచి పారిపోయి 27 ఏళ్లపాటు విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.