రూ. 292.8 కోట్ల లావాదేవీల్లో ఆమె భాగస్వామ్యం
ఫోన్లోని సమాచారాన్ని ఆమె డిలీట్ చేశారు
విచారణలో తప్పించుకొనేలా సమాధానాలు ఇస్తున్నారు
స్కాం సొమ్ము బదిలీలో ఆమె ఆడపడుచు అల్లుడి పాత్ర గుర్తించాం
కస్టడీ పొడిగింపు అప్లికేషన్‌లో ఈడీ వెల్లడి
3 రోజుల కస్టడీకి అనుమతించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కుట్రదారు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం ఈ కుంభకోణం సూత్రధారుల్లో కవిత ఒకరుగా తేలిందని పేర్కొంది. ఈ కేసులో కవితను అరెస్టు చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. మరో ఐదు రోజులపాటు ఆమె కస్టడీ పొడిగించాలని కోరుతూ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు సమర్పించింది. అందులో పలు ఆరోపణలు చేసింది.
తప్పించుకొనేలా సమాధానాలు ఇస్తున్నారు..
ఢిల్లీలో మద్యం లైసెన్సుల్లో భారీ వాటాను చేజిక్కించుకొనేందుకు ‘సౌత్ గ్రూప్’ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెల్లించిన రూ. 100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. ముడుపులు చెల్లించినందుకు మద్యం పాలసీ రూపకల్పనలో తనకు అనుకూలంగా మార్పులు చేయాలని కవిత కోరారని తెలిపింది. తన బినామీ అరుణ్ పిళ్‌లై ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ‘ఇండోస్పిరిట్స్’లో కవిత పార్టనర్‌షిప్ పొందారని... రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపులు, మనీలాండరింగ్‌లో ఆమె చురుకైన పాత్ర పోషించారని వివరించింది.
ఇండో–స్పిరిట్స్‌లో కవిత బినామీ ద్వారా రూ. 192.8 కోట్ల మేర నేరం జరిగిందని... మొత్తంగా రూ. 292.8 కోట్ల మేర నేరాల సొమ్ముకు సంబంధించిన లావాదేవీల్లో కవిత భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపించింది. ఈ నేరాలకుగాను పీఎంఎల్‌ఏ సెక్షన్ 3 కింద కవిత దోషి అని, అందుకే పీఎంఎల్ సెక్షన్ 19 కింద అరెస్టు చేశామని కోర్టుకు ఈడీ తెలిపింది. అరెస్టుకు సంబంధించిన కారణాలు విడిగా రికార్డు చేశామని, అరెస్టు చేసిన విషయాన్ని కవిత భర్తకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు తెలిపింది.
కస్టోడియల్ విచారణ సమయంలో కవిత తప్పించుకొనేలా సమాధా నాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నెల 17 నుంచి మార్చి 22 వరకు ఆమె స్టేట్‌మెంట్లు తీసుకున్నామని, దీంతోపాటు మరో నలుగురు నిందితులకు సంబంధించి నాలుగు వాంగ్మూలాలు తీసుకున్నామని తెలిపింది. సహ నిందితుల స్టేట్‌మెంట్లను చూపి వాటిలోని అంశాల ఆధారంగా కవితను ప్రశ్నించామని ఈడీ పేర్కొంది. అలాగే జప్తు చేసిన కవిత ఫోన్‌లోని డేటా ఫార్మాటింగ్‌కు గురైనట్లు తేల్చిన ఫోరెన్సిక్ నివేదికను ముందుపెట్టి విచారించామని తెలిపింది.
బంధువు ప్రమేయం గురించి తెలియదంటూ..
కవిత వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ గురించిన వివరాలు చెప్పాల్సిందిగా కోరగా ‘తెలియదు’ అని కవిత ముక్తసరిగా బదులిచ్చారని ఈడీ పేర్కొంది. కానీ ఈ నెల 15న కవిత నివాసంలో సోదాల సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నారని.. దీంతో ఆయన ఫోన్‌ను కూడా జప్తు చేశామని వివరించింది. అనుమానాస్పద లావాదేవీలు ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన్ను విచారణకు రావాలని రెండుసార్లు సమన్లు పంపగా రాలేదని ఈడీ తెలిపింది.
గత వారం రోజులుగా చేపట్టిన దర్యాప్తులో మద్యం స్కాంలో ఆర్జించిన సొమ్ము బదిలీ లేదా వినియోగంలో శరణ్ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని.. కానీ అతను విచారణకు సహకరించనందున అతని ఇంట్లో శనివారం సోదాలు చేపట్టినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు శరణ్ ద్వారా జరిగిన నగదు బదిలీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇప్పటికే అరెస్టు చేసిన ఇండో–స్పిరిట్స్ ప్రమోటర్ సమీర్ మహేంద్రును మరింత లోతుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. అందుకు అనుమతించాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో పాత షరతులతోనే కవితను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేసింది.
బెయిల్ మంజూరు చేయాలి: కవిత న్యాయవాది
కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ కవిత నుంచి ఈడీ కొన్ని డాక్యుమెంట్లు కోరుతోందని, అయితే కస్టడీలో ఉన్న కవిత వాటిని ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. బెయిల్ ఇస్తేగానీ ఆ డాక్యుమెంట్లు అందజేయలేరని పేర్కొన్నారు. ఈ మేరకు బెయిల్ కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు. అయితే బెయిల్‌ను ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వ్యతిరేకించారు. ఈ సమయంలో ఆ అప్లికేషన్ మెయింటైనబిలిటీ ఉండదని కోర్టుకు తెలిపారు. దీంతో కవిత ఈడీ కస్టడీ ముగియగానే బెయిల్ పిటిషన్ విచారించాలని రాణా కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా కవితను 3 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు తిరిగి హాజరుపరచాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత
తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు..
Comments
Please login to add a commentAdd a comment