
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఇప్పటల్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 6 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.
కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 16న కేసు నమోదు చేయగా.. మే 18న కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్‌లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.
తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం జూన్ 22న వరకు కస్టడీ పొడిగించగా.. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిని కోర్టు కొట్టివేసింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment