సాక్షి, హైదరాబాద్: ఉపా చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్ మీద దాఖలు చేసిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపైనా కేసులు తక్షణమే ఎత్తేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద కేసులు దాఖలైన పరిణామంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండడం, ముఖ్యంగా మేధోవర్గం నుంచి అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
👉 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా-UAPA) కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా.. తాజాగా వెలుగు చూసింది.
👉 పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది.
👉 మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి.
👉 తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద.. ఓ రోజు వేకువజామున మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. సైలెంట్‌గా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసుల కదలికలను గమనించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయగా.. విప్లవ సాహిత్యం, పలు వస్తువులు దొరికాయి. కాగ.. ఆ పుస్తకాల్లో ప్రముఖుల పేర్లు ఉండడంతో.. వారిని నిందితులుగా చేర్చారు
👉 మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో సర్కారు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, సర్కారును పడగొట్టటం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, యువతను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు రకరకాల అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రమౌళితో పాటు నిందితులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్‌తో పాటు ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్.. తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
👉 సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంఘ విద్రోహ శక్తులను, సంఘాన్ని ఉద్రేక పరుస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే వారిని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టమే ఉపా చట్టం (UAPA Act).
ఇదీ చదవండి: ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment