సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: ప్రజాఉద్యమాలు కొనసాగడమే పాలనకు గీటురాయని, ఎన్ని ప్రజాఉద్యమాలు జరిగితే పాలన అంత సజావుగా జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కానీ, తెలంగాణలో ప్రజాఉద్యమాలను పూర్తిగా అణచివేస్తున్నారని, ఉద్యమాలు చేస్తున్నవారిని అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అక్రమంగా అరెస్టు చేసిన అక్కాచెల్లెళ్లు భవానీ, అన్నపూర్ణ, అనూషలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సంబంధం పెట్టుకుని ప్రజాసంఘాలను నిర్బంధిస్తున్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కట్టడం, షాదీ ముబారక్‌లు ఇవ్వడం కాదని, ప్రజాస్వామ్యం కాపాడడం, ఉద్యమాలు చేయనివ్వడం అని పేర్కొన్నారు.
మా పిల్లలు ఏ నేరమూ చేయలేదు...
అరెస్టుకు గురైన మహిళల తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, ఆత్మకూరి రమణయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు 15 మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి తమ కూతుళ్లను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆ పోలీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసు డ్రస్‌లో, మిగిలినవారందరూ మఫ్టీలో ఉన్నారని, దౌర్జన్యంగా అరెస్టు చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న 7 సెల్‌ఫోన్లు, ఐడీ ప్రూఫ్‌లు బలవంతంగా తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలపై ఏ నేరచరిత్ర లేదని, కేవలం మహిళాసంఘాలతో కలసి, మహిళల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు.
కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారన్నారు. ప్రజాచైతన్య యాత్ర చేసినందుకే కక్షగట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. తమ పిల్లల్ని ఎక్కడ నుండి తీసుకువెళ్లారో, అక్కడ వదిలిపెట్టాలని, ఇంట్లో నుండి తీసుకెళ్లిన వస్తువులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్తలు సజయ, సనా ఉల్లాఖాన్, ముజాహిద్ హష్మీ, ప్రొఫెసర్ ఖాసీం తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment