Vimalakka
-
నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క
సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) రూపొందించిన ‘పూసే పూల కవాతు’, ‘రావె రావె బతుకమ్మ రావే’అనే పాటల వీడియోలను ఆదివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క తెలిపారు. 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మను ఈ ఏడాది ‘మద్యం రద్దు– మగువల రక్షణ’అనే అంశంపై ప్రకృతి పూల కవాతుగా నిర్ణయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఈ నెల 13న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలై 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో ముగుస్తుందని విమలక్క వెల్లడించారు. -
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు!
సిరిసిల్ల: సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ అగ్రనేతలు కూర రాజన్న అలియాస్ రాజేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, వెంకటేశ్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, కొమురన్న, సంతోష్ గురువారం ప్రకటించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న రాజన్న, అతనితోపాటు ఉన్న వెంకటేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అమర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 12 రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న కూర రాజన్నతోపాటు అతని సహాయకుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పోలీసులు వెంటనే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా, కూర రాజన్న, అమర్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం సమీపంలోని ఒక తోటలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
మళ్లీ వస్తా అన్నాడు ఇంతలోనే..విమలక్క కన్నీటి పర్యంతం
-
గద్దర్ మరణం: మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు
Updates.. గద్దర్ మృతి పట్ల ఆయన భార్య విమల బోరున విలపించారు. ► రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర కొనసాగనుంది. మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ► అల్వాల్‌లో గద్దర్ స్థాపించిన స్కూల్ గద్దర్ అంత్యక్రియలు. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ భార్య విమల సూచించారు. ► గద్దర్ మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ► గద్దర్ మృతి బాధాకరం: ప్రియాంక గాంధీ. గద్దర్ మృతికి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరం అని ట్వీట్ చేశారు. Saddened to hear about the passing of Shri Gummadi Vittal Rao garu, the iconic poet and relentless activist. His unwavering dedication to social causes and the fight for Telangana's statehood was truly inspiring. Gaddar ji's powerful verses echoed the aspirations of millions,… pic.twitter.com/Zaq7Ev7zv6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 6, 2023 ►ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. గద్దర్ మృతికి దర్శకుడు ఎన్. శంకర్ సంతాపం తెలిపారు. ‘పల్లె పాట మీద ప్రేమ ప్రేమపెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే ఎర్రజెండా కు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు.. గద్దరన్న ఏ లోకంలో వున్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది.. జోహార్ గద్దరన్న’ అని యన్. శంకర్ చెప్పారు. ► గద్దర్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ సంతాపం తెలిపారు. గద్దర్ మరణం బాధాకరం. ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచారు. తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. తన జీవితాన్ని గద్దర్ ప్రజలకే అంకితం చేశారు. తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. ► గద్దర్ పార్ధీవదేహం ఉన్న ఎల్బీ స్టేడియం వద్దకు హరగోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ జ్ఞాపకాలు మరిచిపోలేం. విప్లవ ఉద్యమానికి గద్దరే స్ఫూర్తి. బలహీనవర్గాల పీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి గద్దర్. ► గద్దర్ మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గద్దర్ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గద్దర్ తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ మరణం తీరని లోటు. గద్దర్ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ప్రజల్లో జానపదం ఉన్నంత కాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది. ► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మెతుకు సీమ ముద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయి. ► గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ► ఎల్బీ స్టేడియానికి గద్దర్ పార్థివదేహం తరలింపు. ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థివదేహన్ని అక్కడికి తరలించారు. గేట్ నెంబర్-6 వద్ద పార్ధివదేహన్ని ఉంచారు. గద్ధర్ పార్థివదేహం వెంట విమలక్క, సీతక్క, రేవంత్ రెడ్డి, వీహెచ్ ఉన్నారు. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గద్దరన్న మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఉద్యమ నాయుకులు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ భావం ఉంటుంది. ప్రజా సమస్యల పోరాడిన వ్యక్తి ఇలా కన్నుమూయడం చాలా బాధాకరం. గద్దరన్న భార్య కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఇప్పుడు మనమందరం బాసటగా ఉండాలి. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంతాపం తెలిపారు. గద్దర్ మృతి చాలా బాధాకరం. ప్రజా గొంతుక మూగబోయింది. ► గద్దర్ మృతిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏 సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023 ► గద్దర్ మృతిపై గవర్నర్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ కవి, విప్లవ వీరుడు, ఉద్యమకారుడు గద్దర్ @గుమ్మడి విట్టల్ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలంగాణ రాష్ట్రం తన అద్భుతమైన కవితా శైలితో, నాయకత్వ పటిమతో చెరగని ముద్ర వేసిన ఒక ప్రముఖ కవిని, ఉద్యమకారుడిని కోల్పోయిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో, ప్రజాయుద్ధనాయకుడిగా రాజకీయాలలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మృతుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ► తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ ఉద్యమనేత గద్దర్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి అని కామెంట్స్ చేశారు. Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist. His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023 ► అమీర్‌పేట్ ఆసుపత్రి నుంచి అల్వాల్‌లోని భూదేవీనగర్కు గద్దర్ పార్థీవదేహాన్ని తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కళాకారులు అపోలో ఆసుపత్రి వద్ద గుమ్మిగూడారు. ► అపోలో ఆసుపత్రికి చేరుకున్న టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధ నౌక కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకం. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. ప్రజా సమస్యలపై గద్దర్ పోరాటం అజరామరం. తనదైన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆయనకు నివాళులు. ► గద్దర్ మృతి నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద అరుణోదయ ఉద్యమకారణి విమలక్క కంటతడిపెట్టారు. అనంతరం విమలక్క మీడియాతో మాట్లాడుతూ.. కామ్రేడ్ గద్దరన్నకు రెండు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి వినమ్రంగా విప్లవ జోహార్లు. తాను బ్రతికనంత కాలం గద్దరన్న ప్రజల పాటగా నిలబడ్డాడు. గద్దరన్న ఒక లెజెండ్. ప్రజల పాట గద్దరన్న. ప్రజల ఆట, మాట గద్దరన్న. అమరుల కుటుంబాలకు గద్దరన్న అండగా నిలబడ్డారు. గద్దరన్నను ఇలా బెడ్ మీద చూస్తానని అనుకోలేదు. ఆయన కుటుంబాకు ప్రగాఢ సానుభూతి. జోహార్ గద్దరన్న అని అన్నారు. ► గద్దర్ మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు. ► గద్దర్ మృతిపై నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. ‘ఒక అన్నమయ్య పుట్టారు.. దివంగతులయ్యారు ఒక రామదాసు పుట్టారు.. దివంగతులయ్యారు ఒక పాల్ రబ్సన్ పుట్టారు.. దివంగతులయ్యారు ఒక గద్దర్ పుట్టారు.. డివంగతులయ్యారు ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’ అని అన్నారు. ► గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమను షాక్‌కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూశారు. అయితే, గద్దర్ ఇటీవలే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ తుదిశ్వాస విడిచారు. ఇక, గద్దర్ మృతిపై పలువరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
ఒక తరపు పోరాట గాథ
‘కలెనేత’ ఆత్మకథ రచయిత్రి బల్ల సరస్వతమ్మ కన్నతల్లి ఊరూ, మా అమ్మమ్మ ఊరూ లద్దునూరే అని ఈ పుస్తకంతోనే తెలిసింది. ఆడవాళ్లుగా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలైనా వారి తల్లి ఊరి పేరు విన్నా, కన్నా చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ తమ మూలాలను గుర్తెరిగి ‘‘అమ్మా మనిద్దరి మాయిముంత లద్దునూర’’ని మాట్లాడుతుంటే సొంత అన్న లాగే మనసు పులకరించి పోయి వర్గ సంబంధాలు మరింత బలపడ్తుం టాయి. ఇప్పుడా మాయిముంత బల్ల సరస్వతమ్మను, నన్ను చుట్టేసి ఒకే కూరాడు దగ్గరకు చేర్చినట్లయింది. తెలంగాణలో కూరాడు ఆడబిడ్డలకు చిహ్నం. మాతృస్వామ్య అవశేషాలకు చిహ్నంగా తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కుతున్న గౌరవ హోదా ఒకింత వర్గ సంబంధాలకు అతీతంగా కనబడ్తుంది. ఎక్కడా లేని విధంగా బతుకమ్మతో మన ఆత్మగౌరవం ఇనుమడింపజేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడబిడ్డల కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్నీ, సంస్కృతినీ ఏదో మేరకు తెలంగాణ పల్లె సీమలు నేటికీ ప్రతిబింబిస్తున్నాయి. వీటన్నిటి కలబోతగా ‘కలెనేత’కు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వత మ్మకు వేనవేల శణార్థులు. తమ విలువైన ముందుమాటలో ప్రముఖ రచయిత, నవలా కారుడు అల్లం రాజయ్య అన్నట్లు ‘‘అక్షర రూపం ఇస్తే తెలంగాణ సాయుధ పోరాట గ్రామాల్లో కొంచెం అటు ఇటుగా ప్రతి ఇంట్లోనూ ఇదే కథ పునరావృతమవుతుంది.’’ ఇటీవలే ఒకరోజు ప్రజా ఉద్యమాల్లో చిరకాల మిత్రులైన న్యాయవాద దంపతులు బల్ల రవీంద్రనాథ్, కోళ్ళ సావిత్రిలు ‘అరుణోదయ’ కార్యాలయానికి వచ్చి ‘కలెనేత’ పుస్తకావిష్కరణ సభకు నన్ను సాదరంగా ఆహ్వానించారు. బల్ల రవీందర్ తమ తల్లి ఊరు (అమ్మమ్మగారి ఊరు) లద్దునూరని చెప్పారు. ఇదే విషయం చెప్పి సరస్వతమ్మ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఏడుతరాల వాస్తవ జీవిత గాథకు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వతమ్మ నా దృష్టిలో ధన్యురాలు. చరిత్రను పాఠ్య గ్రంథాలకు అందకుండా సిలబస్ నుండే అంతర్థానం చేయాలన్న పంతం కొనసాగుతున్న కాలంలో జీవితగాథను చరిత్రగా, సహజ వైరుధ్యాల కలబోతగా అందించడం చాలా మందికి ప్రేరణ కలిగించి తీరుతుంది. 585 పేజీల సుదీర్ఘ గ్రంథం ఇది. బల్ల రవీందర్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం... లద్దునూరులో మా అమ్మమ్మ బెడద సిద్ధమ్మ ఇల్లు, సరస్వతమ్మ తల్లిదండ్రులు పాశికంటి లక్ష్మమ్మ–రామదాసుల ఇల్లు దరిదాపుల్లోనే ఉండేవి. వారు బట్టలు నేసే పద్మశాలీలైతే, మా అమ్మమ్మ వాళ్లు గొంగళ్లు నేసేవారు. అలనాటి జ్ఞాపకాలన్నింటినీ తట్టి లేపుతున్న సరస్వతమ్మ ‘కలెనేత’తో పెద్ద యజ్ఞమే చేసింది. కష్టాలు – కన్నీళ్ళ కలబోతగా, ఉద్యమాల తలబోతగా, అనుబంధాలు–అనుభవాల నెమరు వేతగా ‘కలెనేత’ ప్రాచుర్యం పొంది ప్రజల ఆదరణను చూర గొంటుందని నా గట్టి నమ్మకం. గడిచిపోయిన 150 ఏళ్లలో జీవించిన ఏడు తరాలను తడిమిన ‘కలెనేత’ కల్పితం కాదు, వాస్తవ చరిత్ర. ‘కలెనేత’ లోకి తలదూర్చగానే మా అమ్మమ్మ ఇంట్లోని లోతు గిన్నెల్లో మీగడ పెరుగుతో గటక తిన్న అనుభూతి కలిగింది. ఇది తప్పక స్త్రీల సమాన హక్కుల పోరాటానికి తోడ్పాటునిస్తుందనీ, మానవ విలువలను ప్రజాస్వామీకరించడానికి దోహదపడ్తుందనీ ఆశిద్దాం. అటు సమాజంలోని, ఇటు కుటుంబంలోని అంతర్లీన ఆర్థిక–సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి ‘కలెనేత’ ఒక విస్తృత పాఠ్యగ్రంథంగా ఉపయోగపడి తీరుతుంది. చిన్నతనంలో బలపాలు పోగొట్టుకోవడం నుండి, ప్రధానో పాధ్యాయులుగా బాధ్యతలు నిలబెట్టుకున్న బల్ల సరస్వతమ్మ జీవితం తల్లులకు... ముఖ్యంగా తెలంగాణ తల్లులకు ప్రతి బింబమై అట్టడుగున పడి ఉన్న మగువల చరిత్రను తట్టిలేపు తుంది. విమలక్క వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త (నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బల్ల సరస్వతమ్మ ఆత్మకథ ‘కలెనేత’ ఆవిష్కరణ సందర్భంగా.) -
నాన్న చూపిన ఉద్యమ పథం...
బిడ్డల్ని భుజాన కూర్చోబెట్టుకుని జాతరలకు తీసుకుపోయి వారికి ప్రపంచాన్ని పరిచయం చేసే తండ్రులకు ఇక్కడ కొదవ లేదు! కానీ పసితనం నుండి వేలు పట్టుకుని విప్లవ ప్రపంచాన్ని చూపించి, నా గొంతులో విప్లవ గానాన్ని పదు నెక్కించి నడిపించిన మా తండ్రి కామ్రేడ్ బండ్రు నర్సింహులు 22 జనవరి 2022న భౌతిక జీవితం నుండి నిష్క్రమించాడు. ఆయన కళ్ళతో విప్లవ విజయాన్ని, కనీసం నిజమైన కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతను చూడాలని కాంక్షించి, ఆత్రంగా ఎదురు చూశాడు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట సైనికుడిగా, పన్నెండేళ్ళు జైలు జీవితపు రాజకీయ ఖైదీగా, భూస్వాముల– గూండాల భౌతిక దాడులను ఎదిరించిన వీరుడిగా, వారి గుండెల్లో సింహ స్వప్నమైన నాయకుడిగా తన నూరేళ్ళపై బడ్డ జీవితంలో గర్వంగా తలెత్తుకుని అదే స్ఫూర్తితో వెళ్ళిపోయాడు. ప్రజల కోసం జీవించా లని ఆయన చెప్పిన మాటలే నాకు శాసనాల య్యాయి. సాహసంతో జీవించాలని బోధించిన నాన్నకు ప్రేమతో ప్రణమిల్లుతూ విప్లవాంజలి. నూరేళ్ళుపై బడిన ఒక నిరక్షరాస్య కాపరిని ఒక వీరుడిగానే కాదు, గొప్ప చదువరిగా మార్చింది తెలంగాణ నేలతల్లి. ఐదుగురు సంతానం గల మా ఇంట్లో అందరికంటే చిన్న దాన్నయిన నాకు, ప్రజా కార్యకర్త అయిన మా నాన్నకు ఇంటి బాధ్యతలు ఏమీ లేవని చెప్ప వచ్చు. తమ విప్లవ వారసత్వం, కష్టాలు– కడగండ్లు తమ పిల్లలకు రావద్దన్న చాలా మంది ఆలోచనలకు భిన్నంగా నన్ను, మా చిన్నన్న భాస్కర్‌ను మా నాన్న ప్రజా ఉద్యమాల్లో పని చేయాలని ప్రోత్సహించాడు. ఆలేరు ప్రాంత ఉద్య మాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్న ఆలోచనతో మా అన్నయ్య ఉండేవాడు. ఆయన ద్వారానే నాకు కామ్రేడ్ అమర్ మొట్టమొదట పరోక్షంగా పరిచయ మయ్యాడు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న మా పెద్ద బావ కె.నిమ్మయ్య 1973 విద్యార్థి దశలోనే మా పెద్దక్క అరుణను ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే ఆహ్వనించాడు. మా చిన్నక్కయ్య పెళ్లి చేసుకుని తన కుటుంబాన్నే ఉద్యమ సానుభూతిపరులుగా మార్చుకుని 1997 మే 6న కేన్సర్‌తో కన్నుమూసింది. మా కుటుంబ సభ్యుల కారాగార వాసం, అంతకు మించిన రహస్య జీవితం, నిత్య పోరాట కార్యక్రమాలతో మా ఇళ్ళు విప్లవ కార్యాలయంగా మారినా... మా అమ్మ నర్సమ్మ – వదిన ఆండాళమ్మ ఇరువురు ఎంతో ఓపికతో కుటుంబాన్ని నడిపారు. ఒంటరి మహిళ అయిన మా నానమ్మ కొమ రమ్మ అప్పు పేరిట భూమి కాజేయాలన్న షాహు కారు నారాయణ మోసానికి వ్యతిరేకంగా పోరా టం చేసి విజయం సాధించడమే మా నాన్నకు బాల్యంలో అందిన ప్రేరణ. నా బాల్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి ముషీరా బాద్ జైలువరకు మా అమ్మతో కల్సి చిన్నన్న నేను కాలినడకన పోతూ ములాఖత్ కల్సిరావడం కామ్రేడ్స్ వరవరరావు, కాశీపతి తదితరులు జైలులో పాటలు పాడించు కోవడం లాంటి అనుభూతులు నాతో కోకొల్లలుగా ఉన్నాయి. జైలు మా కుటుంబ జీవితంలో భాగ మైంది. మనం ఇతరులకు బోధించడం కాదు, ఉద్యమాన్నే మార్గంగా స్వీకరించాలని కుటుంబ సభ్యులను మా నాన్న ప్రోత్సహించాడు. వెనుక డుగు వేస్తే కూడా సహించేవాడు కాదు. మా అమ్మను కూడా తనతో పాటు పని చేయమని దాదాపు బలవంత పెట్టినంత పని చేశాడని తన ఆత్మకథలో రాసి ఉంది. కుల–వర్గ దోపిడీ వ్యవస్థను అన్ని కోణాల నుండి తిప్పి కొట్టడానికి నన్నూ, మా అన్నయ్య భాస్కర్లను ప్రోత్సహిం చాడు. చివరికి కులాలు–సంప్రదాయాలు బద్దలు కొడ్తూ నేను అమర్‌ను, మా అన్నయ్య శోభారాణిని ఉద్యమంలోనే జీవిత సహచరులుగా ఎంచు కున్నాం. మా పిల్లలను కుల – మత అంతరాలు లేని హేతువాదులుగానే పెంచాం. శతాధిక వృద్ధుడిగా బండ్రు నిష్క్రమణ వేడుకనే గానీ, వేదన కాదనే మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. కానీ తండ్రిగా వేలు పట్టుకొని నడిపించడమేగాదు, పొరపాట్లేమైనా ఉంటే సుతిమెత్తగా విమర్శించి, సవరించే తండ్రి లేడన్న ఒకింత బాధ తప్ప! – విమలక్క ‘ మొబైల్: 88868 41280 -
మీ ప్రకృతి ప్రేమ నిజమే అయితే...
ప్రకృతి వ్యవసాయం – రక్షిత ఫలసాయం అంటూ ఈ యేడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహి స్తుండటంతో రైతాంగంలో, మేధావుల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని అనేక మంది రచనలు పంపించారు. ప్రకృతి వ్యవసాయం లేదా తరతరాలుగా మనం అనుసరిస్తున్న సాంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే ఐదు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 లోనే ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజనా’ పథకం కింద సబ్సిడీలు ప్రకటించింది. అయితే రసా యన ఎరువులు, పురుగుమందులు పూర్తిగా నిషే ధించి నేలతల్లినీ, ప్రజారోగ్యాన్నీ రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. శ్రీలంక ప్రభుత్వం, సిక్కిం రాష్ట్రం ప్రమాదకర రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించాయని విన్నాము. ‘భార తీయ ప్రకృతి కృషి పద్ధతి’ కింద ఆంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లో 2 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని కొన్ని గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా దీన్నొక పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్ చేస్తున్నాం. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రి కల్చర్ మూవ్మెంట్’ గణాంకాల ప్రకారం 2018– 19లో భారతదేశంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం సాగుతున్నది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో చైనా మూడవ స్థానంలో, అమెరికా ఏడవ స్థానంలో ఉండగా మనం 9వ స్థానంలో నిలిచాము. కాబట్టి ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ కింద ఎంతమంది రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందిందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. పరంపరాగత వ్యవసాయానికి పరం పరగా వస్తున్న దేశీయ విత్తనాలు, బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి నాటు విత్తనాలను కాపాడి చిన్న, సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యమైనది. కాబట్టి వేలాది ఎకరా లను హస్తగతం చేసుకున్న జమీందారీ, జాగిర్దారీ వ్యవస్థల్లాగా బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్ల పైన వేలాది ఎకరాలు అప్పగించరాదు. ప్రభుత్వ భూముల అమ్మకానికి చేసిన జీవోలను రద్దు చేసి రైతులకు భూపంపిణీ జరగాలి. చారిత్రక కడివెండి గ్రామంలో ‘దున్నేవారికి దుక్కులు – దుక్కుల్లో ప్రకృతి మొక్కలు’ అంటూ బహుజన బతుకమ్మ పిలుపు నిచ్చింది. అంతకు ముందే ఆలగడపలో సెజ్‌ల కోసం ప్రజల సాగు భూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమ క్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బాబాసాహెబ్ ప్రవచించినట్లు ‘ఆర్థిక ప్రజా స్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం’ అమలు జరగా లంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. వ్యవసాయం, చేతి వృత్తులు జంటగా అభివృద్ధి కావాలి. అందుకే భూసా రాన్ని కాపాడుకోవడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్కీమ్ స్థానంలో మొత్తంగా రసాయన ఎరు వులు, క్రిమిసంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసు కోలేరా? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగు మందుల కంపెనీలు చేసే ప్రచారాన్నయినా ఎందుకు అరికట్టలేక పోతున్నారు? పాడి–పంట–పెంట విధానాల ద్వారా ఇంటింటికో ఎరువుల కర్మాగారం, పాడి ఉత్పత్తుల అభివృద్ధి, సాంప్రదాయక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా పథక రచనలు జరగాలి. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగి నప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదల వుతుంది. విమలక్క బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున... మొబైల్ : 88868 41280 -
ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
చౌటుప్పల్ (మునుగోడు) : కరోనా కష్టకాలంలో చేనేత కార్మి కులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని వీడాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలో చేనేత జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిబత్తిని ప్రభాకర్, పర్వతాల రాజిరెడ్డి, మాచర్ల కృష్ణ, జెళ్ల ఈశ్వరమ్మ, వర్కాల శ్రీమన్నారాయణ, కొలను మధుసూదన్, బోనగిరి కుమార్, పొట్టబత్తిని వాసుదేవ్, వర్కాల సూర్యనారాయణ జెళ్ల పాండు, కొలను సుధాకర్, రచ్చ ఉపేందర్, భీమనపల్లి నర్సింహ, పుష్పాల యాదయ్య, గుర్రం వెంకటేశం, శ్రీనివాస్ ఉన్నారు. చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : విమలక్క భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కరోనా వల్ల ఉపాధి లేక విలవిల్లాడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క అన్నారు. చేనేత సమస్యలను పరిష్కరించాలని 12 రోజులుగా మున్సిపల్ కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం సందర్శించి చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లయిన చేనేత వస్త్రాల కొనుగోలు, ఒక్కో కార్మికుడి కుటుంబానికి నెలకు రూ. 8వేల జీవనభృతి, కార్మికుడికి నేరుగా నూలుపై సబ్సిడీ, ప్రతి మగ్గానికి పెట్టుబడి సాయం కింద రూ.2 లక్షలు, మగ్గాలన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జేఏసీ కన్వీనర్ తడక రమేశ్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు శంకరయ్య, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మంగళపల్లి శ్రీహరి, భారత వాసుదేవ్, కౌన్సిలర్ కొంగరి కృష్ణ, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి అంకం పాండు, చిక్క కృష్ణ, కర్నాటి పాండు, సూర్యప్రకాశ్, నాగేశ్, మిర్యాల వెంకటేశం, భాస్కర్, సంగెం చంద్రయ్య, రుద్ర నర్సింహ, వీరస్వామి, బాలయ్య, బాలరత్నం, శంకరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎవరూ చనిపోవద్దు.. అంతిమంగా విజయం మనదే’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉస్మానియా విద్యార్థులే కారణమనే సంగతి సీఎం కేసీఆర్ మరిచిపోయినట్లు ఉన్నారని ప్రజా గాయకురాలు విమర్శించారు. ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నారో, ఆనాడో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడన్నారు. అసలు కేసీఆర్‌ది నోరా.. తాటిమట్టా అంటూ విమలక్క మండిపడ్డారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచినందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ తన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విభాగం శుక్రవారం సంఘీభావ సభ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా మాట్లాడిన విమలక్క.. ‘ఆర్టీసీ కథ ముగియదు.. కేసీఆర్ నువ్వ ఖతం అవుతావ్. ప్రజలు పెట్టిన భిక్షతోనే నువ్వు సీఎం అయ్యావ్. నువ్వు సీఎం అయ్యాక పోలీసుల రిక్రూట్మెంట్ తప్ప ఏ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆర్టీసీ ఎప్పట్నుంచో ఉంది. కార్మికుల చేసే సమ్మెలో న్యాయం ఉంది. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై హైకోర్టు స్పందించింది. కోర్టు ధిక్కరించిన వారికి గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో,.. ఇప్పుడు కేసీఆర్‌కు కూడా అదే పరిస్థితి రావాలి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అందరూ రోడ్డు మీదకు రావాలి. ఇది ఉద్యమాల గడ్డ.. పోరాటల గడ్డ. కార్మికులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కార్మికులు ఎవరూ చనిపోవద్దు.. అంతిమంగా మనదే విజయం’ అని విమలక్క పేర్కొన్నారు. -
‘ఉద్యమాలను అణచివేస్తున్నారు’
హైదరాబాద్: ప్రజాఉద్యమాలు కొనసాగడమే పాలనకు గీటురాయని, ఎన్ని ప్రజాఉద్యమాలు జరిగితే పాలన అంత సజావుగా జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కానీ, తెలంగాణలో ప్రజాఉద్యమాలను పూర్తిగా అణచివేస్తున్నారని, ఉద్యమాలు చేస్తున్నవారిని అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అక్రమంగా అరెస్టు చేసిన అక్కాచెల్లెళ్లు భవానీ, అన్నపూర్ణ, అనూషలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సంబంధం పెట్టుకుని ప్రజాసంఘాలను నిర్బంధిస్తున్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కట్టడం, షాదీ ముబారక్‌లు ఇవ్వడం కాదని, ప్రజాస్వామ్యం కాపాడడం, ఉద్యమాలు చేయనివ్వడం అని పేర్కొన్నారు. మా పిల్లలు ఏ నేరమూ చేయలేదు... అరెస్టుకు గురైన మహిళల తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, ఆత్మకూరి రమణయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు 15 మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి తమ కూతుళ్లను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆ పోలీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసు డ్రస్‌లో, మిగిలినవారందరూ మఫ్టీలో ఉన్నారని, దౌర్జన్యంగా అరెస్టు చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న 7 సెల్ఫోన్లు, ఐడీ ప్రూఫ్‌లు బలవంతంగా తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలపై ఏ నేరచరిత్ర లేదని, కేవలం మహిళాసంఘాలతో కలసి, మహిళల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారన్నారు. ప్రజాచైతన్య యాత్ర చేసినందుకే కక్షగట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. తమ పిల్లల్ని ఎక్కడ నుండి తీసుకువెళ్లారో, అక్కడ వదిలిపెట్టాలని, ఇంట్లో నుండి తీసుకెళ్లిన వస్తువులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్తలు సజయ, సనా ఉల్లాఖాన్, ముజాహిద్ హష్మీ, ప్రొఫెసర్ ఖాసీం తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
అణచివేత నుంచే ఉద్యమాలు: విమలక్క
తొగుట (దుబ్బాక): పాలకుల అణచివేత నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన సంవిధాన్ సమ్మాన్ యాత్ర (రాజ్యాంగ గౌరవయాత్ర)కు శనివారం ఆమె సంఘీభావం ప్రకటిం చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడం సాధ్యంకాదని నిపుణులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలు ముందుండి పోరాడితే విజయం మనదేనన్నారు. వేములఘాట్ ను రక్షించుకునేందుకు గ్రామస్తులు 875 రోజులుగా దీక్షలు చేయడం అభినందనీయమన్నారు. -
పోస్టర్ల చింపివేత నిలిపివేయాలి : విమలక్క
సాక్షి, హైదరాబాద్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన బహుజన బతుకమ్మ పోస్టర్లు చించివేయడంపై విమలక్క ఫైర్ అయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిందని, ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మను జరుపుతామని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కష్టపడి పోస్టర్లను ప్రింట్ చేయించామని అయితే వాటిని చించివేయడం బాధాకరమని ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని, ఎన్నికలకు తమ సంస్థ దూరమని, పోస్టర్లు చించివేయడం అన్యాయమని, వెంటనే పోస్టర్ల చించివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
కులం తక్కువ కావడంతోనే ప్రణయ్ హత్య
మిర్యాలగూడ (నల్గొండ): కుల దురహంకారంతోనే ప్రణయ్‌ని హత్య చేయించారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కులం కంటే గుణం చాలా గొప్పదన్నారు. కులాంతర వివాహం చేసుకున్న కూతురును ఆ తండ్రికి మనసుంటే ఆశ్వీరదించాలి కానీ కులదురంహకారంతో హత్య చేయించే హక్కు అయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమాజం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నప్పటికీ కుల వివక్షలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు. ప్రణయ్ హత్యతో ఆ కుటుంబం కొడుకును కోల్పోవడంతో పాటు అమృత భర్తను ఆమె కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని కోల్పోయిందన్నారు. ఇలాంటి హత్యలు చేయడం సరైంది కాదన్నారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ప్రణయ్ హత్యపై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు సుబ్బారావు, తెలంగాణా మట్టి మనుషుల వేదిక కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, సాగర్, రాములు, సౌమ్య, శిరీష పలువరు నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ కేసు: కాంగ్రెస్ నేతను సస్పెండ్ చేస్తున్నాం!
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విమలక్క పరామర్శ ప్రణయ్ భార్య అమృతను, అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం కంటే గుణం గొప్పదన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనినైనా శాంతితో జయించాలి తప్ప ద్వేషంతో కాదని హితవు పలికారు. ప్రణయ్ కుటుంబానికి సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమికులను విడదీసి చంపే హక్కు ఎవరికి లేదన్నారు. -
వేయి గొంతుకల విమలక్క
ఒక గొంతుక అనేక గొంతుకలై నాలుగు దశాబ్దాలుగా ప్రజలపక్షం నిలవడం అపురూపం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసు కున్న పదేళ్ల తరువాత, విప్లవ కుటుం బంలో పుట్టిన విమల 1964లో అరుణ గానవనంలోకి ప్రవేశించింది. నలభై ఏళ్లుగా ఆగకుండా సాగుతున్న విప్లవ సాంస్కృతిక రంగంలో అజేయంగా నిలిచింది. కళాకారిణిగా ఉంటూ అరుణోదయ (ఏసీఎఫ్)కి నాయకత్వం వహిం చింది. జాతీయ స్థాయిలో తెలుగువారి చేవ చూపించిన మహి ళల్లో విమలక్క ఒక్కరే. దేశంలో వివిధ భాషా రాష్ట్రా లలో తన గళం వినిపించిన ఘనత ఆమెదే. రెండు దశాబ్దాలుగా తెలంగాణ కోసం తన పంచేంద్రియా లను ఆట, మాట, పాట, సంగీతం ఆహార్యంగా చేసింది. తనకి సంకెళ్లు వేసిననాడు గుండె చెదరలేదు. కార్యా లయాన్ని పోలీసులు ఆక్రమించి రోడ్డు మీద పడేసిననాడు వెరవలేదు. పాటలచెట్టుని నరికేశామనుకున్నారు. తాను, తన కళాకారులు రోజుకొక్క చోట తలదాచుకున్నారు. నిర్బంధా లలో సైతం అనేక రాగాలవేడి కాపు కుని చలికాచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అరెస్టు, నిర్బంధం అరుణోదయ విమలపైనే! కడుపులో బాధ ఎలా కాలి పోతుందో, విషాదాన్ని ఏ పేగు మూలన కుక్కి పెడుతుందో తెలి యదు. కానీ చిరునవ్వు ఆమె పెదా లని విడిచిపోలేని నేస్తం. మహిళా కళా కారిణులలో దేశం గర్వించే స్థాయి ఆమెది. సగం ఆకాశం కాదు. ఒకే ఒక్క విమలక్క. జనం చప్పట్లే ఆమెకు జేజేలు. విప్లవ సాంస్కృతికోద్య మంలో సుదీర్ఘంగా, నిలి చిన పాటల కొండకి అభి నందనలు. 16 సెప్టెంబర్ 2018 (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నలభై ఐదేళ్ల అరు ణోదయంలో విమలక్క విప్లవ ప్రస్థాన గానసభ’ కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో గద్దర్, అల్లం నారాయణ, జయధీర్ తిరుమలరావు, కె. రామ చంద్రమూర్తి, కె. శ్రీనివాస్, ప్రొ‘‘ ఎ. వినాయక్‌రెడ్డి తదితరులు పాల్గొం టారు. అందరికీ ఆహ్వానం. జయధీర్ తిరుమలరావు మొబైల్ : 99519 42242 -
కేటీఆర్‌పై పోటీ చేసేదెవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా కేసీఆర్ కొనితెచ్చుకున్న ఎన్నికల్లో కేసీఆర్‌పై గద్దర్, కేటీఆర్‌పై విమలక్క పోటీ చేయనున్నారని టీమాస్ ఫోరం ఛైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్, విమలక్కలు మాత్రమే తెలంగాణ వారసులని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. గద్దర్ రాష్ట్రం కోసం పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని.. ఆయనకు 6 బుల్లెట్లు తగిలాయని, విమలక్క కాలుకు గజ్జె కట్టి రాష్ట్రం కోసం ఆడీపాడారని చెప్పారు. ఏ త్యాగం చేయని కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. వారిపై పోటీ పెట్టకుండా కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల వారు సహకరించాలని కోరారు. పోటీ పెట్టవద్దని రాహుల్ గాంధీ, కుంతియా, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం సమర్పించనున్నట్లు ఐలయ్య స్పష్టం చేశారు. సమావేశంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ, నాయకులు హిమబిందు, రేఖ ముక్తాల, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్,ప్రొఫెసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు: ఐలయ్య
నిర్మల్ అర్బన్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయొద్దని.. మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టవద్దని టీమాస్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం‘ఓటు హక్కు–ఎన్నికల సంస్కరణ’పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు త్యాగాలు చేశారని, కానీ సామాజిక తెలంగాణ రాకుండా వెలమ, రెడ్ల చేతుల్లోకి అధికారం వెళ్లిందన్నారు. ఈసారి వారిని గెలవనీయవద్దని చెప్పారు. ఉద్యమాన్ని తమ ఆటపాటల ద్వారా ఉవ్వెత్తున నిలిపిన గద్దర్, విమలక్కలకు మద్దతునిస్తూ కేసీఆర్, కేటీఆర్‌లపై పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. టీమాస్ అధికారంలోకి వస్తే సోషలిస్ట్ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేస్తామని, ఎమ్మెల్యేల వేతనాలను ఎత్తేస్తామని, రూ.3కే టిఫిన్, రూ.5 బహుజన బువ్వ, ఇంటర్మీడియెట్‌ను రద్దు చేసి కేజీ నుంచి 12వ తరగతి వరకు గ్రామంలోనే ఆంగ్లబోధన అందేలా చూస్తామని వివరించారు. -
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ దొంగలే
కాకినాడ రూరల్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు ఇద్దరూ దొంగలేనని, సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాలను వాడుకుంటున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ చైర్పర్సన్ విమలక్క ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల నుంచి కాకినాడ వరకు ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల కిందట చేపట్టిన జన సమర యాత్ర సోమవారం ముగిసింది. అనంతరం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముంగిట్లో చంద్రబాబు చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటం నీడతో యుద్ధం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగాల కల్పనలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టాలని కోరారు. రంపచోడవరాన్ని ఆదివాసి జిల్లాగా ఏర్పాటుచేయాలని, పోడు భూములు, ఆదివాసుల సంస్కృతి, జీవన విధానాన్ని కాపాడాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డి.పట్టా భూములకు కౌలుదార్లకు రుణ సౌకర్యం కల్పించాలని, ఉచిత వ్యవసాయ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట మండలం మల్లిసాలలో 353/2 సర్వే నంబరులో 500 ఎకరాల 80 సెంట్లు అడ్డుకొండ భూములను మల్లిసాల, కె గోపాలపురం గ్రామాల పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రైతాంగంపై మోపిన అన్ని రకాల కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, స్త్రీ విముక్తి రాష్ట్ర కార్యదర్శి కె.అనురాధ, తెలంగాణ కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
డాక్టర్ వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల’పై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్‌గా ఉంది. ‘భూమి తో మాట్లాడు...’ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు. వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్ మొహినుద్దిన్ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు) -
భూస్వాములకు దోచిపెడుతుండ్రు
వికారాబాద్ అర్బన్ : రైతుబంధు పథకం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని భూస్వాములకు దోచి పెడుతోందని యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. వ్యవసాయ సంక్షోభాన్ని అడ్డుకోవాలని, హిందుత్వ హింసను అరికట్టాలనే డిమాండ్లతో టీయూఎఫ్, ప్రజాసంఘాల ఆధ్వర్యాన వికారాబాద్ నుంచి రాజ్వభవన్ వరకు చేపట్టిన పాదయాత్రను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం ధనికులు, భూ స్వాములకు వరంగా మారిందన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ఈ మచ్చను తుడిపేసుకునేందుకే రైతుబంధు పథకాన్ని తెచ్చారని మండిపడ్డారు. దీని ద్వారా 50 నుంచి 500 ఎకరాలు ఉన్న భూస్వాములే లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. పేద రైతులకు ఆర్థి క సహకారం అందించడం మంచి కార్యక్రమమే అయినప్పటికీ దీనిద్వారా వారికి వచ్చిందేమీ లేదన్నారు. రెండెకరాల భూమి ఉన్న అసలైన రైతుకు రూ.8 వేలు వస్తే, 50 ఎకరాలు ఉన్న భూ స్వామికి రూ.2 లక్షలు వస్తున్నాయని చెప్పారు. ఇలా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక చేయూత ఎవరికి లాభం చేకూరుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఎవరూ మెచ్చుకోవడం లేదని, కేవలం ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఆ పార్టీ నాయకులు వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వందల ఎకరాలున్న భూ స్వాములు గ్రామాల్లో ఉన్న పేదలకు భూములను కౌలుకు ఇచ్చి పట్టణాల్లో ఎక్కడో ఉంటున్నారని వివరించారు. వీరి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న కౌలు రైతులు పంటలు సాగు చేసి నష్టపోతున్నారన్నారు. గతంలో ఇలాంటి వారికి కనీసం బ్యాంకులు రుణాలు ఇచ్చేవని తెలిపారు. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. భూస్వాములైన యజమానులకు నేరుగా డబ్బులు ఇస్తూ కౌలు రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు.. కేంద్రంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రమైనట్లు విమలక్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీ వంటి సంఘాల కార్యకర్తలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం హిందుత్వ ఎజెండా అమ లుకోసం హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. నక్సల్స్ ఎజెండానే తన ఎజెండా అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి దొరల పాలన చేస్తున్నారని ఆరోపించారు. కొత్త రకం దోపిడీ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేకి అని తెలిపారు. రైతుబంధు పథకం అమ లు తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుం దని చెప్పారు. మట్టి ముట్టుకోని భూస్వాములు, బడాబాబులకు లక్షలాది రూపాయల పెట్టుబడి సాయం అందించడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వాలు కల్లబొల్లి పథకాలతో రైతులను ముంచేస్తున్నాయని తెలిపారు. రైతుబంధు పథకంతో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులే ఎక్కుగా లాభ పడ్డారన్నారు. అన్నదాతల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేద రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనికుల ఫాంహౌస్‌లకు లక్షల రూపాయలు ఇవ్వడంకంటే నిజమైన సాగు భూమికి సాయం అందించాలని కోరారు. రైతుబంధు పథకాన్ని భూ స్వాములకు, దొరలకు కాకుండా వ్యవసాయం చేసేవారికి వర్తింపజేయాలన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో దోచిపెట్టింది కాకుండా, ఇప్పుడు కొత్త రకం దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీ మాస్ రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ, టీయూఎఫ్ దాసు, భీంభరత్, టీమాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సాధు సత్యానంద్, కేవీపీఎస్ నాయకులు మహిపాల్, మల్లేశం, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సీపీఐ నాయకులు గోపాల్‌రెడ్డి, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మను ‘కార్పొరేట్’గా మార్చారు..
హసన్‌పర్తి/వెంకటాపురం(కె): బతుకమ్మ ను కార్పొరేట్‌గా మార్చారని తెలంగాణ యునైటెడ్ ఫోరం (టఫ్) రాష్ట్ర అధ్యక్షు రాలు విమలక్క అన్నారు. వరంగల్ 57వ డివిజన్ ముచ్చర్లలో శుక్రవారం జరిగిన బతుకమ్మ సంబరా ల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం (కె)లో విలే కరులతో మాట్లాడారు. ఊరూవాడా ఏకమై సం తోషంగా బతుకమ్మలు ఆడాలే తప్ప... గిన్నిస్‌బుక్ కోసం బతుకమ్మలు ఆడడ మేమిటని ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెబుతూ వందల కోట్లలను టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విమలక్క డిమాండ్ చేశారు. -
బహుజన బతుకమ్మ
సందర్భం బతుకమ్మ వంటి ప్రజా సంప్రదాయాలు ఉత్తి మతాచారాలు కావు. ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానానికి ప్రతీకలు. కానీ నేడు జాతీయత, దేశభక్తి పేరిట ఆధిపత్య, నియంతృత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలను సహిం చని మధ్యయుగాల నాటి మనుధర్మ శాస్త్రాలు, పండుగ లను మార్కెట్ చేస్తున్న కార్పొ రేట్ వ్యాపారాలు కలగలసి ఏలుతున్న కాలంలో కూడా బతుకమ్మ పండుగ తెలం గాణలో నిలదొక్కుకుంటు న్నది. స్థానికత అంటే ప్రపం చీకరణ వ్యతిరేక దేశీయతే అంటూ చాటుతూ బతు కమ్మ ముక్కోటి తెలంగాణీయులను ఏకతాటిపై నడి పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక వార థిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మూడేండ్ల తరువాత ఉద్యమం లేవనెత్తిన అంతర్గత వలస విముక్త స్వావలంబన, నూటికి 93 శాతంగా ఉన్న బహుజనులకు రాజకీయ అధికారం అనే అంశాల ద్వారా నవ తెలంగాణ నిర్మాణం జరుగు తుందా? లేదా? అనేదే బతుకమ్మ సందర్భంగా మనం బేరీజు వేసుకోవాల్సిన అంశాలు. ‘బతుకమ్మా బతుకుమంటూ’ వ్యాఖ్యానించిన కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ మాసంలో వస్తున్న సద్దుల బతుకమ్మను అంతరాలు లేని సమాజం కోసం ‘బహుజన బతుకమ్మ’ ఉద్యమంగా జరుపుకుంటాం. కాగితపు పూలతో, డీజే శబ్దాలతో కృత్రిమ వ్యాపార తంతుగా మార్చకుండా, గడ్డిపూలతో నవధాన్యాలకు స్వాగతమిచ్చే ప్రకృతి ఆరాధనగా బహుజన బతు కమ్మను మలచుకుందాం. పర్యావరణోద్యమంతో జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ చైతన్యం పొందుతున్న ప్పుడే నిజమైన హరితహారం అనుభవంలోకి వస్తుంది. తెలంగాణ సహజత్వాన్ని కాపాడుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ బతుకమ్మలో భాగం కావాలి. చెరువులు కుంటలు పొంగి పొర్లాలి. ఎంగిలి బతుకమ్మకు 11 రోజుల ముందునుండే బొడ్డెమ్మల పౌర్ణమి ఆరంభమవుతుంది. మా చిన్న తనంలో చెక్కపీటల మీద మట్టి ముద్దలతో వివిధ అంచెలుగా బొడ్డెమ్మలను అలంకరించి, వాటిపై పెరట్లో దొరికే రుద్రాక్ష పూలను, ఎనుగులపై దొరికే బీరపూలు తదితర పూలు అమర్చి ప్రతి సాయంకాలం బొడ్డెమ్మలు ఆడేవాళ్లం. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతు కమ్మ వరకు నవధాన్యాల్లో ఏదో ఒక పలహారాన్ని పిల్లలనుంచి పెద్దల వరకు ఇచ్చిపుచ్చుకోవడం అనేది బహుజన సమూహాల్లో గమనించినప్పుడు, ఇది నవ ధాన్యాల పండుగగా కూడా కనబడుతుంది. మేదరులు కనక బొంగుతో చేసే సిబ్బి, కంచ రులు చేసే ఇత్తడి తాంబాలం, పద్మశాలి నేసే బట్టలు, రోజూ బట్టలను ఉతికి అందించే రజకులు, పూలు ఏరి తెచ్చే అన్నాదమ్ములు, కలవారి బతుకమ్మలను పేర్చి మోసుకెళ్లే రజకులు, చిన్న బొంగు సాధనాలతో ఆటలాడే పసిపిల్లలు ఇలా బహుజనులందరి సామూ హిక వేడుక ఇది. స్త్రీలంతా పుట్టింటికి చేరి తమ కష్టా లను, జీవితానుభవాలను పురాణేతిహాస గాథలను పనిస్థలాల్లో నేర్చుకుని ఇక్కడ శ్రావ్యంగా చప్పట్లు కొడుతూ, అడుగులేస్తూ ఆలపిస్తారు. ఉత్పత్తి కులా లందరి వేడుకగా ఉన్న బతుకమ్మను దళితులు ఆడిన దాఖలాలు లేవు. బతుకమ్మ శిఖరాగ్రంలో గుమ్మడి పువ్వు అందాన్ని గౌరమ్మగా (ప్రకృతే పార్వతి) అలం కరించే స్థానంలో, దళితులు ఎద్దు బొక్కను పెట్టారనీ, అది కాకి ఎత్తుకుపోయి వారికి బతుకమ్మ లేకుండా పోయిందనే కట్టుకథను ప్రచారం చేస్తున్నారు. అందుకే ఒక సాంస్కృతిక ఉత్సవాన్ని మతాచారంగా మార్చే క్రతువును, దళితులను దూరంగా ఉంచే వివక్షను రూపుమాపి ప్రజా సంస్కృతిని ప్రజాస్వామీ కరించే ప్రక్రియలో భాగంగా వివిధ రూపాల్లో బతు కమ్మను మేము ప్రారంభించాము. ఒక వ్యాసాల సంక లనాన్ని, పాటల సీడీలను రూపొందించి అంతిమంగా బహుజన బతుకమ్మగా ప్రజల్లోకి వెళుతున్నాము. ఊరు–వాడలను కలిపే ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. భారతదేశం భిన్న జాతుల, భాషల, తెగల, సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నా.. మాతృస్వామ్యా నికి ప్రతీకగా ఉన్న బోనాలు, గ్రామ దేవతలు, బతుకమ్మలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఆదివాసీ కోయ మహిళలైన సమ్మక్క–సారలమ్మల పోరాటం వారి ఆరాధ్యంగా ప్రసిద్ధిగాంచి ఆదివాసుల సంప్రదాయాలకు భంగం కలుగకుండా కొనసాగుతు న్నది. పూల కలశం చుట్టూ 9 రోజులు దాండియా ఆడటంగానీ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు గానీ మాతృస్వామ్యానికి ప్రతీకలే. వీటిని కూడా క్రమంగా మతీకరిస్తున్నారు. మతాలకు అతీతంగా ఒక్కో ప్రాంతంలో ఉండే ఆహారపు అలవాట్లు, సంప్ర దాయాలు గమనిస్తే, మరో ప్రాంతంలోని అదే మత ప్రజలతో అవి ఎక్కడా సరిపోలవు. కావున ప్రజా సంప్రదాయాలు ఉత్తి మతాచారాలు కాదని ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానానికి, ఆచార– వ్యవ హారాలకు ప్రతీక అని గమనించవచ్చు. దీనిని జాతీ యత, దేశభక్తి పేరిట ‘ఒకే దేశం– ఒకే ప్రజ – ఒకే సంస్కృతి’ అంటూ ఆధిపత్య నియంతృత్వ భావజా లాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని కార్పొ రేట్ వ్యాపారాన్ని నిరసిస్తూ ఊరువాడలను కలిపే ఉత్సవంగా బలవన్మరణాలకు తావులేని సహజ వనరుల రక్షణోద్యమంగా, భూవనరులన్నీ ప్రజలకు చెంది అంతరాలు లేని సమాజ సాధనకు బతుకమ్మ వేదిక కావాలి. అందుకు బహుజనులు బాటలు వేయాలి. అదే నిజమైన బహుజన బతుకమ్మ. వ్యాసకర్త తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్పర్సన్ విమలక్క -
దోపిడీకి వ్యతిరేకంగా ‘టీమాస్’ పోరు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని జనగామలో టీమాస్ ఆవిర్భావ సభ హాజరైన గద్దర్, విమలక్క సాక్షి, జనగామ: పాలకులు సాగిస్తున్న దోపిడీకి వ్యతి రేకంగా టీమాస్ (తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక) ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం టీమాస్ జిల్లా ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఓ వైపు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని చెబుతున్న పాలకులు మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలతో కోర్టుల్లో కేసులు వేయించి పరీక్షలను నిలిపి వేస్తుందని ధ్వజమెత్తారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల మాదిరిగానే గురుకుల పోస్టులను ఆపివేశారని విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పెత్తనాన్ని టీమాస్ సహించదన్నారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు, ప్రజాగాయకురాలు విమలక్క మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ అంటే దళితులపై దాడి చేయడమేనా? అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ పోరాట యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలను టీమాస్ నిర్మిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్య క్రమంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జేబీ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘మద్యానికి చరమగీతం పాడుదాం’
హైదరాబాద్: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం సమాజాన్ని నాశనం చేస్తోందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో-చైర్పర్సన్ అరుణోదయ విమలక్క, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమావతి అన్నారు. మహిళలు అందరూ ముందుకొచ్చి మద్యానికి చరమ గీతం పాడాలని వారు పిలుపునిచ్చారు. బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో అమృత బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయొద్దంటూ మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న వారికి విమలక్క, హైమావతి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం నుంచి వస్తోందని, ఆదాయం కోసమని ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజలను వ్యసనాలకు బానిసలను చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా మద్యం అమ్మకాలకు అనుమతులిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నగరంలో పబ్‌లకు అనుమతులు ఇచ్చి 14 ఏళ్ల బాలికలతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తోందన్నారు. మద్య నిషేధం కోసం ముందుకొచ్చే వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విమలక్క పాటలు పాడి మహిళలను ఉత్తేజపరిచారు. -
అరుణోదయ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
ప్రభుత్వం కక్ష గట్టింది: విమలక్క హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు పోలీ సులు ఖాళీ చేయించి ఇంటి యజమానికి అప్పగించారు. అరవింద్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో విమలక్క 2009 నుంచి అరుణోదయ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 2016 డిసెంబరులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి రూరల్ పోలీసులు ఓ కేసులో భీంభరత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి న సందర్భంగా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించి నిషేధిత వస్తువులు లభించాయం టూ సీజ్ చేశారు. కాగా, యజమాని ఆర్ఎస్ శాస్త్రి తమ ఇంటిని 2009లో కరియమ్మ అనే మహిళకు అద్దెకు ఇచ్చానని, అయితే తమ ఇంట్లో అరుణోదయ సంస్థ నిర్వహిస్తున్నట్టు 4 నెలల తర్వాత తెలిసిందన్నారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయమంటూ విజ్ఞప్తి చేస్తూ నే ఉన్నామన్నారు. చివరకు గత నెల 25న కోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిం దన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు... ఇంట్లో ఉన్న వస్తువులను అరుణోదయ సమాఖ్యకు, శాస్త్రికి ఇంటిని అప్పగించారు. నాలుగు గంటల హైడ్రామా... అరుణోదయ కార్యాలయాన్ని ఇంటి యజ మానికి అప్పగించే సందర్భంగా 4 గంటల పాటు హైడ్రామా నడిచింది. మాచారెడ్డి రూరల్ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసిన సమయంలో సాక్షి సంతకం తీసుకున్న అరుణోదయ సమాఖ్య నాయకుడు మోహన్ బైరాగితో అరవింద్నగర్కు చేరుకోగా, విషయం తెలిసిన విమలక్క, ఇతర కళాకారులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఆదేశాలు తమకు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఖాళీ చేయడానికి కనీసం వారం గడువైనా ఇవ్వాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమపై కక్షతో ఇంటిని ఖాళీ చేయిస్తున్నారన్నారు. దీంతో కోర్టు ఆదేశాలను పోలీసులు విమలక్కకు అందజేశారు. విద్యావేత్త చుక్కా రామయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్దన్ తదితరులు విమలక్కను కలసి పరిస్థితి తెలుసుకున్నారు. -
తెలంగాణలో రాక్షస పాలన
రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు: విమలక్క కొడంగల్: తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని టఫ్ రాష్ట్ర కన్వీనర్ విమలక్క ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ధూం ధాంలో ఆమె మాట్లాడారు. దోపిడీ, అణచివేతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలను మించి పోయిందని మండిపడ్డారు. సకల జనులు ప్రాణాలకు తెగించి సాధించుకున్న రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం.. బలవంతపు భూసేకరణ చేస్తోం దన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ప్రసాద్ కుమార్, ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. -
'విమలక్క కార్యాలయాన్ని తెరిపించండి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యాలయాన్ని సీజ్ చేయడం సమంజసంగా లేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అరుణక్క కార్యాలయంలో నిషేధం ఉన్న ఎలాంటి సాహిత్యం దొరక్కపోయినా కార్యాలయాన్ని సీజ్ చేయడం తగదన్నారు. దానిని వెంటనే తెరిపించాలని కోరారు. -
జన గాయనిపై లక్షిత దాడి
సందర్భం ‘తెలంగాణ’ ఉద్యమకాలంలో తిండీ తిప్పలు మరచి కాళ్లకు గజ్జెలు కట్టి భుజాన గొంగడి వేసుకొని తన సాంస్కృతిక దళంతో తెలంగాణ నేలను చైతన్యపరచిన కళాకారిణి విమలక్క. ఆమె పేరు వింటే.. కోట్లాది తెలంగాణవాసుల కళ్లముందు ఆమె ఆటాపాటా తెరకడతాయి విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలు. దశాబ్దాలుగా ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను తెలియజేస్తూ, ప్రభుత్వాల విధి విధానాలను నిలదీస్తూ, పాలనను ఎండగడుతూ ఆ సంస్థ తన సాంస్కృతిక పోరును కొనసాగి స్తోంది. ‘అరుణోదయ’ తెలంగాణ ఉద్యమంలో మమేకమవడం ఓ మజిలీ. కేవలం భౌగోళిక తెలంగాణ సాధన కోసం ఈ సంస్థ పురుడు పోసుకోలేదు, అంతటితో దాని లక్ష్యాలు నెరవేరలేదు. తెలంగాణ సాధనలో ప్రజా సంఘాల, సాంస్కృతిక సంస్థల పాత్ర ఎంతో కీలకమైనవి. వీటి మద్దతు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకా వందేళ్లు తండ్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. పార్టీలు కాలానికి తగ్గట్లు పిల్లి మొగ్గలు వేస్తుంటే కోట్ల గొంతుకలను ఏకం చేసింది ఉద్యమకారులే. యువకుల, విద్యార్థుల, ఉద్యోగుల, కార్మిక కర్షకుల ఐక్య పోరాటం లేకుంటే అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అంత సెగ తగిలేది కాదు. ఆయా వర్గాలను ఉద్యమంవైపు మలిపింది మాత్రం ప్రజా కళారూపాలే. అయితే వివిధ కళా రంగాలకు ఉద్యమకాలంలో ప్రాతినిధ్యం వహించినవారు చాలావరకు ప్రభుత్వం జేబులో చొరబడ్డారు. భౌగోళిక తెలంగాణను ప్రజాస్వామ్య తెలంగాణగా మలచాలనుకొన్నవారు మాత్రం ప్రజలతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలకు బాకాగా మారకుండా ఉన్న ఈ వర్గాలు ప్రశ్నల కొడవళ్లు ఎత్తడమే ఏలుతున్నవారికి కంటగింపుగా ఉంది. ఇలా ప్రజల పక్షాన నిలబడ్డవాటిలో ప్రధానంగా తెలంగాణ జేఏసీ, అరుణోదయలను పేర్కొనవచ్చు. అరుణోదయకి సారథ్యం వహిస్తున్న విమలక్క జనం కోసం నిలబడే ప్రజాగాయని. ఇదేం తెలంగాణ అని సవాలు చేస్తోంది. కలిసి పంచుకున్న వేదికల్లోంచి ప్రజలకిచ్చిన హామీలను గుర్తు చేస్తోంది. ఆ క్రమంలో పాలకులకు పంటికింద రాయిలా, ఇంటిపోరులా తయారైతోంది. ప్రగతిశీల భావాలున్న తెలంగాణ వాగ్గేయకారులు, కళాకారులు కొందరు రెండు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, మరికొందరు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. సంపూర్ణంగా ప్రజలవైపు నిలబడింది మాత్రం విమలక్కనే. ఇచ్చేదాకా నిలబడాలిగానీ నిలదీయడం సహించని ప్రభుత్వానికి ఈ వైఖరి రుచించలేదు. నయానో, భయానో విమలక్కను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న ప్రభుత్వం పావులు కదపడం మొదలెట్టింది. మొదటి వేటుకు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో 23.3.2015 నాడు జరిగిన బీడీ కార్మికుల సమావేశం వేదిక అయ్యింది. సమావేశం శాంతియుతంగా ముగిసినా అదే నెల 26నాడు ఆరుగురిని అరెస్టు చేయడంతోపాటు పలురకాల కర్కశ చట్టాలు బిగించి విమలక్కను కట్టేయచూశారు. ఆ తర్వాత, ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో వరలక్ష్మి హత్యకేసులో నలుగురు నిందితుల్లో విమలక్కను ఒకరుగా ప్రకటించడం జరిగింది. తనకు తెలియని వరలక్ష్మితో హత్య జరిగిన రోజు ఆమెతో కారులో కలిసి ప్రయాణించినట్లు చిత్రిం చడం అన్యాయమని విమలక్క పేర్కొంది. తిరిగి, ఇదే నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ఉన్న అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాచారెడ్డి సమావేశంలో భాగంగా ఈ మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్న జనశక్తి కార్యకర్త భీంభూషణ్ చెప్పిన మాటలు ఆధారంగా అరుణోదయ ఆఫీసును సీజ్ చేయడం జరిగిందని పోలీసులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. ఇది కేవలం కక్షపూరిత చర్యగా భావించవచ్చు. ఎందుకంటే భీంభూషణ్ చెబుతున్నట్లుగా పోలీసులు భావించి, ఎంత వెదికినా అరుణోదయ ఆఫీసు నుండి విప్లవ కార్యకలాపాలు సాగుతున్నట్లు అక్కడ నిషేధిత సాహిత్యం ఉన్నట్లు ఏ ఆధారాలు దొరికినట్లు లేదు. అయినా ఆఫీసునే ఇంటిగా చేసుకొని ఉంటున్న విద్యార్థినులను బయటికి పంపి సీలు వేయడం జరిగిందని వార్తలొచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనుంది. చట్టాలను తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఉసిగొల్పడం మాత్రం ప్రభుత్వాలకు తగనిది. తెలంగాణ ఉద్యమ సమయంలో అమర్ పాటలను, విమలక్క గొంతును అద్భుతమని మెచ్చుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు అవే పాటలు, అదే గొంతుక వినడం కష్టంగా ఎందుకుందనే విమలక్క ప్రశ్నలో న్యాయముంది. మా ప్రభుత్వాలను ప్రజా కళాకారులు ఎంతగా విమర్శించినా వారి వాక్ స్వేచ్ఛను గౌరవించామంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ చర్యను నిరసిస్తున్నారు. ఒక్క గొంతుకను నొక్కేయడానికి ప్రభుత్వం పాట్లు పడుతుందంటేనే.. ఆ గొంతు సామర్థ్యం ఎంతో బయటపడుతోంది. ప్రజల పక్షాన ఉన్నామనుకొనేవారిపై దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. ఆ గొంతు ఒంటరి కాదని కోట్లాది జన సామాన్యపు వేదనలకు వాహికని గొంతుక విప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యవాదుల ముందుంది. - బి. నర్సన్ వ్యాసకర్త రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ‘ మొబైల్ : 94401 28169 -
సర్కార్‌ను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులా?
ఎమర్జెన్సీలోనూ ఇలాంటి పరిస్థితి లేదు: విమలక్క హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న గొంతులను అణగదొక్కేందుకే వారిపై రాజద్రోహం కేసులను బనాయిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. నాటి సీమాంధ్ర పాలకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే నేటి తెలంగాణ పాలకులు ప్రజాసంఘాల నాయకుల్ని, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ ‘పౌర హక్కుల ప్రజా సంఘం’(పీయూసీఎల్) రాష్ట్ర 17వ మహాసభలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో పాటలతో ఉర్రూతలూగించిన అమర్, రాజేందర్‌లపై దేశద్రోహపు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఎమర్జెన్సీ, చీకటి రోజుల్లో కూడా ప్రజాసంఘాల కార్యాలయాల్ని మూసివేయలేదని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అరుణోదయ కార్యాలయం మూసివేతను నిరసిస్తూ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులతో కుట్రపన్ని మోడీ నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల, బీసీ ఉద్యమనేత సాంబశివరావు, ప్రొఫెసర్ చక్రధరరావు, కె.ప్రతాప్‌రెడ్డి, నజీర్‌ఖాన్, జ్యోతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
టఫ్ కార్యాలయం తెరిపించండి
హోంమంత్రి, డీజీపీలకు విమలక్క విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పోలీసులు సీజ్ చేసిన ‘తెలంగాణ యునై టెడ్ ఫోరం’ (టఫ్) కార్యాలయాన్ని తిరిగి తెరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ హామీ ఇచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క తెలిపారు. మానవ హక్కుల ఫోరం (హెచ్ఆర్ఎఫ్) కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు రాము తదితరులతో కలసి మంగళవారం ఆమె డీజీపీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కూడా కలిశామన్నారు. హోంమంత్రి సూచన మేరకు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, మంగళవారం సాయంత్రంగానీ, బుధవారం ఉదయంగానీ తెరిపి స్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎలాంటి సెర్చ్ వారెంట్, నోటీసులు లేకుండానే పోలీసులు హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న టఫ్ కార్యాలయంలో తనిఖీలు జరిపి, సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక ఘటన పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి
భట్టి విక్రమార్క డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పీసీసీ నేతలు తూర్పు జగ్గారెడ్డి, బండి సుధాకర్‌తో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. రెండున్నరేళ్లలో ఎస్సీలకు, ఎస్టీలకు వినియోగించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలను కావాలని విస్మరిస్తున్నారని, అంబేడ్కర్ అడుగుజాడల్లో హక్కుల కోసం పోరాడుతా మని హెచ్చరించారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో పోరాడి, ఉద్యమించిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క కార్యాలయా న్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విమలక్కను పోలీసులతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ముమ్మాటికీ పౌరహక్కుల ఉల్లంఘన, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ నేతలు అనవసరమైన నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ భయపడుతున్నదని, టీఆర్ఎస్ను వెంటిలేటర్ పైకి పంపించే శక్తి కేవలం కాంగ్రెస్‌కే ఉందన్నారు. -
అరుణోదయ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కొడంగల్: అరుణోదయ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ విశ్వకర్మ కవులు, కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టఫ్ నాయకులు డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి విమలక్కను జైలులో పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రభుత్వం విమలక్క పాటకు భయపడి తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడి దారుల ఆస్తుల మీద విమలక్క దాడి చేసి వారి గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఇన్ని త్యాగాలు చేసిన విమలక్క మీద, తెలంగాణ గొంతకను అణచివేసేందుకు ప్రభుత్వం, పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, అరుణోదయ కార్యాలయాన్ని సీజ్ చేయడం ఎంతవరకు సమంజమంటూ వారు ప్రశ్నించారు. ఉద్యమంలో అరుణోదయ కళాకారుల ఆట-పాటలను మెచ్చుకున్న కేసీఆర్, ప్రస్తుతం అధికార మదంతో అణచివేసే ప్రయత్నాలను చేస్తుందని అన్నారు. అక్రమ కేసులకు పాల్పడితే ఉద్యమం ఎగిసిపడుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం అరుణోదయ కార్యాలయాన్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయం'
హైదరాబాద్: టీయూఎఫ్ కార్యాలయం సీజ్ పై డీఐజీ అకున్ సబర్వాల్ స్పందించారు. మాచవరం పీఎస్ పరిధిలో భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తేలిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ సాగుతోందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. -
అరుణోదయ కార్యాలయం సీజ్
హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై కామారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేశారు. సోదాలు జరిపి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఇక్కడ దోమలగూడలో జరిగింది. సోదాల సందర్భంగా ఆఫీసులోనే ఉన్న అరుణోదయ విమలక్క,, నాయకులు బైరాగి మోహన్ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కామారెడ్డి సర్కిల్ పరిధిలోని మాచారెడ్డి పోలీసు స్టేషన్లో 2015 మార్చి 26న జరిగిన కేసులో ఆరుగురిని అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నదని భీంభరత్ అనే నిందితుడిని కామారెడ్డిలో గురు వారం అరెస్టు చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, 20 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమా చారంతో పోలీసులు అరుణోదయ ఆఫీస్‌పై దాడి చేశారు. అరుణోదయ ఆఫీసు సీజ్ దుర్మార్గం: విమలక్క తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాటలతో ప్రజలను అరుణోదయ కార్యకర్తలు చైతన్యం చేశారని, అలాంటి సంస్థ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేయడం దుర్మార్గమని విమలక్క అన్నారు. పోలీసుల దాడులపై రాష్ర్ట మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఫోను ఎత్తలేదని, హోంమంత్రి నారుుని దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అంతకు ముందు విలేకరుతో విమలక్క మాట్లాడుతూ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ర్ట సహాయ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. భీంభరత్ కనిపించకుం డాపోయారని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్, రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 15 లోపు ఫిర్యాదుపై వివరాలను అందించాలని హక్కుల కమిషన్ డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు. అక్రమ కేసుల్లో అరెస్టు: భీంభరత్ భీంభరత్ విలేకరులతో మాట్లాడుతూ లంగర్‌హౌస్‌లో ఓ లాయర్‌తో మాట్లాడి వస్తుండగా గురువారం రాత్రి కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి అక్కడికి తీసుకువెళ్లారని, శుక్రవారం 3గంటల ప్రాంతంలో నగరానికి తీసుకువచ్చా రని అన్నారు. తనపై మోపిన అక్రమ కేసులను, అరుణో దయ కార్యాలయ సీజ్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాలపై అణచివేత : సీపీఐ అరుణోదయ సాంస్కృతిక సంస్థ కార్యాలయం సీజ్ చేయడాన్ని సీపీఐ ఖండించింది. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచేలా పోలీసుల చర్య ఉందని మండిపడింది. కార్యాలయంలో సాహిత్య, పాటల పుస్తకాలున్నా ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. -
విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్
హైదరాబాద్: ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టీయూఎఫ్) నాయకురాలు విమలక్కపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆమె కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. ఇంతకు ముందు కూడా విమలక్కపై అనేక కేసులు నమోదైన సంగతి తలిసిందే. -
ఐక్యంగా పోరుబాట సాగిద్దాం
ప్రజా ఉద్యమకారులకు విమలక్క పిలుపు కాకినాడలో విప్లవవీరుల సంస్మరణ సభ అలరించిన ‘అరుణోదయ’ సాంస్కృతిక ప్రదర్శనలు కాకినాడ సిటీ : అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా ఉద్యమకారులంతా ఏకమై పోరాడాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళా మందిరంలో గురువారం విప్లవ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ ఒక మందిరంలో జరిగే సమావేశానికి కూడా అనుమతి తీసుకోవాలనడం ఎక్కడా చూడలేదన్నారు. ఈ సంస్మరణ సభకు చివరి వరకూ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. భారత విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని శ్రీకాకుళం రైతాంగ మేఘగర్జన వరకూ ఎంతోమంది విప్లవ వీరులు నవంబర్ బూటకపు ఎన్కౌంటర్లలోనే నేలకొరిగారని ఆమె గుర్తుచేశారు. పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారులను అక్రమ అరెస్టులతో నిర్బంధిస్తూ, ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు చూస్తున్నాయన్నారు. మట్టి మాఫియా : కర్నాకుల ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ హోం శాఖామంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలంలో మట్టి మాఫియా పడగ విప్పిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు తెలుగు మాగాణి సమారాధన పథకంలో కేటాయించిన రామేశంపేట ఎర్రమట్టి కొండల నుంచి తెలుగు తమ్ముళ్లు, మంత్రి అనుచరులు అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మరోపక్క తొండంగి మండలంలో పర్యావరణానికి ముప్పు కలిగించే దివీస్ ఫార్మా కంపెనీకి 550 ఎకరాల భూమిని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ముందుగా సభలో విప్లవ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె.రామలింగేశ్వరరావు, బి.రమేష్ పాల్గొన్నారు. -
నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్
-
నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్ : విమలక్క
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ. 2 వేల నోటును తక్షణమే నిషేదించాలని.. అవనీతిని మరింతగా పెంచి పోషించేందుకు మోదీ ప్రభుత్వం రూ. 2 వేల నోటు తీసుకొచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. యూపీ ఎన్నికల పొలిటికల్ గేమ్‌లో భాగంగానే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని.. దీని వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. -
ఏఓబీ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలి :విమలక్క
హైదరాబాద్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ చైర్పర్సన్ విమలక్క డిమాండ్ చేశారు. మంగళవారం అరుణోదయ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఇవి రెండు ప్రభుత్వాలు జరిపిన హత్యలేనని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రోజుల మహాసభలు విజయవంతమయ్యాయని, పలు డిమాండ్లపై పోరాటానికి నిర్ణయించామని చెప్పారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్ మార్గదర్శకంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మేసే పథకంలో భాగంగా మనువాద బ్రహ్మణవాద మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందన్నారు. ఆదివాసీలకు స్వయం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ప్రాంతాల్లో వారికే సర్వాధికారానికై పోరాడాలన్నారు. తెలంగాణలో 30 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పరిచి కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రభుత్వ కుట్రలను, ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్‌రోడ్ల పేరిట లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను, వాటిపై ఆధారపడి జీవనం సాగించే గ్రామీణ ప్రజానీకాన్ని రోడ్డు పాలు చేసే ప్రభుత్వ పథకాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అరుణోదయ తెలంగాణ, ఆంధ్రా కమిటీలు మహాసభల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు తెలంగాణ, ఆంధ్ర కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌గా విమలక్క, అధ్యక్షుడుగా మోహన్ బైరాగి, ఉపాధ్యక్షులుగా నూతన్, లచ్చన్న, కార్యదర్శిగా సురేశ్, సోమయ్య, కోశాధికారిగా యాది, కార్యవర్గ సభ్యులుగా అనిల్, సారుుదా, లింగం, భాస్కర్, నాగరాజు, సాయి ఎన్నికయ్యారు. ఆంధ్రా కమిటీ అధ్యక్షుడుగా బొరుసు వెంకన్న, ఉపాధ్యక్షునిగా పీతామోహర్, ప్రధాన కార్యదర్శిగా డి. కృష్ణ, కార్యదర్శులుగా సుధాకర్, నాగన్న, కోశాధికారిగా సామ్యేలు, కార్యవర్గ సభ్యులుగా రాజు, మణి ఎన్నికయ్యారు. -
నలభై రెండు వసంతాల ‘అరుణోదయం’
సందర్భం ‘సాహిత్యానికి, కళలకూ అవసరమైన ముడి పదార్థాల గని ప్రజల జీవితమే’ అన్న చైనా విప్లవ కవి లూసన్ సూక్తి తెలుగు నేలమీద ప్రతిధ్వనిస్తోంది. అందుకే 42 వసంతాలుగా ప్రజల మధ్య జీవిస్తూ, శ్రామికుల జీవితాలతో, వారి పోరాటాలతో పెనవేసుకున్న అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 2016 అక్టోబర్ 23, 24 తేదీలలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాసభలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా అరుణోదయ పేరుతో విప్లవ సాంస్కృతిక ఉద్యమా నికి అంకురార్పణ చేసిన అపూర్వ పూర్వ సహచరులకు, సంస్థ ప్రతినిధులకు, సౌహార్ద్ర ప్రతినిధులకు, ప్రజాకవులు- కళాకారు లందరికీ మనఃపూర్వక విప్లవ స్వాగతం, సుస్వాగతం. అరుణోద యకు జవజీవాలందించిన నూతన్, రిక్కల సహదేవ్‌రెడ్డి, గుడ్డి బాబన్న, భాను, నాగన్న, కమల, బాబన్న, తోట మల్లేశం, పటాన్ చెర్వు రాములు తదితరులందరికీ విప్లవ జోహార్లు. ‘మాకొద్దీ తెల్ల దొరతనమన్న’ గరిమెళ్ల, కత్తీ కలం పట్టిన సుబ్బారావు పాణిగ్రాహి, ‘దొర ఎవడురా’ అంటూ నల్ల దొర తనాన్ని ప్రశ్నించిన గూడ అంజన్నలతో పాటూ ‘ఇదేనోయ్ నవ యుగం విప్లవ యుద్ధాల యుగం’ అంటూ పాడుతూ... 1974 మార్చి 12 (ఆదివారం) ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోని ఒక తరగతి గతి గదిలో అరుణోదయ ఆవిర్భావించింది. 1974 ఏప్రిల్ 14న జార్జిరెడ్డి వర్ధంతి సభలో అమరులు నీలం రామచంద్రయ్య, పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ప్రారంభమైన అరుణోదయ... చలపతిరావు నేతృత్వంలో పురుడు బోసుకుని నలభై ఏండ్లు కావస్తుంది. విప్లవ విద్యార్థి నాయకత్వం చొరవ, శ్రమ, కృషితో పట్టణ మధ్యతరగతి- యువకులతో ప్రారంభమై గ్రామాలను, జానపదాలను వెతు క్కుంటూ పయనం సాగించింది. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రక టించిన రోజున జరిగిన సామర్లకోట సభా కార్యక్రమం నాటికే అరుణోదయ సెంట్రల్ ట్రూపు వందల ప్రదర్శనలిచ్చింది. విశ్వ విద్యాలయాల నుండి బస్తీలకు, గ్రామాలకు సాగిన ఈ ప్రయా ణంపై రాజ్యం ఉక్కుపాదం మోపడంతో ఎమర్జెన్సీలో అరుణో దయ బాధ్యులు చలపతిరావు, ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజన్న, అరుణోదయకు బ్యానరు గీతం అందించిన కాశీపతి తదితరులు జైలుపాలయ్యారు. ప్రజా సాంస్కృతికోద్యమానికి ప్రాణం పోసిన నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లు బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారు. ఈ ఇద్దరు అమరులకు జోహార్ల గీతాలాపనతోనే నా ప్రజా సాంస్కృతికోద్యమ యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అరుదోదయ కీలక బాధ్యతలు నిర్వహించిన ప్పటికీ... రెండు వేర్వేరు రాష్ట్ర మహాసభలు నిర్వహించలేదు. అయితే నేడు ఉమ్మడి రాష్ట్ర మహా సభల్లో రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు కమిటీలకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసు కోవాలని అభిలషిస్తున్నాము. ఈ సభలకు అరుణోదయ పూర్వ సహచరులను, అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. నక్సల్బరీ వసంత మేఘ గర్జనలు విప్లవ ప్రత్యామ్నాయంగా రంగం మీదికి వచ్చి దేశ ప్రజలకు ఒక కొత్త దారిని ఆవిష్కరించిన అర్ధ శతాబ్దిలో తెలుగునేల సృష్టించిన సాహిత్యానికి, విప్లవ కళా రూపాలకు అంతు లేదనే చెప్పవచ్చును. దాదాపు వందకుపైగా దృశ్య, శ్రవణ సీడీలతో, వేల పాటలతో, వేలాది కళా ప్రదర్శనలతో వందలాది కళాకారులతో అరుణోదయ లక్షలాది ప్రజల గుండెలు తట్టింది. కోట్లాది ప్రజలపై ప్రభావం పడవేసింది. ఈ కాలంలో మూడు తరాలకు వారధిగా కానూరి వెంకటేశ్వరరావు, బుర్ర కథ కుల్లో నాజర్ వారసత్వంగా రామారావు, సీనియర్ కళాకారుడుగా సుంకులన్నను ఉద్యమం సృష్టించుకుంది. నాలాంటి ఎంతో మంది మహిళా కళాకారులను ప్రజలమధ్య సజీవంగా నిల బెట్టుకుంది. ఇదంతా విప్లవ ప్రజా ఉద్యమాల ఘనతతోపాటు అరుణోదయ కమిట్మెంట్, వందలాది జ్ఞాత-అజ్ఞాత కళాకారుల సమష్టి కృషి అన్నది మరువలేనిది. అయితే దేశంలో సాంస్కృతిక సామ్రాజ్యవాదం, బ్రాహ్మ ణీయ కులోన్మాదం విశృంఖలంగా విస్తరిస్తున్నాయి. దేశవాళీ బహుళత్వాన్ని, ఆహార వైవిధ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అణచి వేస్తూ క్రూరంగా సవాలు చేస్తున్నాయి. మానవీయ సంబంధాల్ని, మనిషికి-మనిషికి ఉన్న ప్రజాస్వామ్య సంబంధ బాంధవ్యాల్ని వ్యాపార వినిమయ సంస్కృతితో పరిహాసం చేస్తున్నాయి. దేశ భక్తిని సరిహద్దుల్లో, అభివృద్ధిని ఆకాశహర్మ్యాల్లో చూపిస్తూ మాన వాభివృద్ధిని తొక్కి పెడుతున్నాయి. అందుకే విదేశీ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, దేశభక్తిని, ఫ్యూడల్ సంప్రదాయక వాదాల్ని ఓడించే ప్రజాస్వామ్యాన్ని, పితృస్వామ్యాన్ని అంతంజేసే స్త్రీ విము క్తిని కోరుతూ, కుల నిర్మూలన వాదాన్ని, ప్రాంతీయ ప్రజాస్వా మ్యాన్ని ఎండగడుతూ అరుణోదయ గళమెత్తి పాడుతుంది. (అక్టోబర్ 23, 24 తేదీలలో జరిగే అరుణోదయ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల సంయుక్త మహాసభల సందర్భంగా) విమలక్క అధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు -
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్ మధుసూధన్‌రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్ పాల్గొన్నారు. -
ముగిసిన రాజవ్వ అంత్యక్రియలు
హాజరైన ప్రజాసంఘాల నాయకులు పాడెమోసిన టఫ్ చైర్పర్సన్ విమలక్క బోయినపల్లి : పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చిట్యాల రాజవ్వ ఉరఫ్ కొదురుపాక రాజవ్వ అంత్యక్రియలు మండలంలోని కొదురుపాకలో శనివారం నిర్వహించారు. అనారోగ్యంతో రాజవ్వ గురువారం రాత్రి మతిచెందింది. అంత్యక్రియలకు ప్రజాసంఘాల నాయకులు హాజరై మతదేహంపై ఎర్ర జెండా కప్పి లాల్‌సలాం..! అంటూ నినాదాలు చేశారు. అనంతరం అరుణోదయ కళాకారులు పాటలు పాడుతూ అంతిమ యాత్ర నిర్వహించారు. 1978 నుంచి జనశక్తి అధినేత కూర రాజన్న, అమర్, విమలక్క తదితర నేతలతో రైతుకూలీ సాయుధ పోరాటాలు చేసి భూస్వాముల గుండెల్లో రాజవ్వ నిదుర పోయిందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. సిరిసిల్ల రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన కామ్రేడ్ రాజవ్వ అంతిమ యాత్రలో టఫ్ చైర్పర్సన్ విమలక్క పాల్గొని పాడె మోశారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు బైరాగి, శ్రామిక శక్తి నాయకురాలు గొట్టె రుక్మిణి, టఫ్ జిల్లా అధ్యక్షుడు బొల్లం లింగమూర్తి, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి సాయి, లచ్చన్న పాల్గొన్నారు. -
'రాజ్య హింసలో భాగంగానే లలిత హత్య'
-
సుపారీ తీసుకొని చంపేశారు
♦ వీడిన వరలక్ష్మి హత్య మిస్టరీ ♦ కేసును తొలగిస్తామని నమ్మబలికి హత్య ♦ నిందితుల్లో ‘టఫ్’ నాయకులు..విమలక్కపై అభియోగాలు ♦ వివరాలు వెల్లడించిన డీఎస్పీ వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళా నేత వరలక్ష్మి హత్య మిస్టరీ వీడింది. కేసును తొలగించేందుకు సాయం చేస్తామన్న వ్యక్తులే ఆమెను అంతం చేశారు. ఈ హత్య కేసులో పలువురు ‘టఫ్’ నాయకుల ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల ఒకటవ తేదీన వికారాబాద్ సమీపంలో మామిళ్ల వరలక్ష్మి(37) హత్య వెలుగు చూసిన విషయం విదితమే. కేసు వివరాలను డీఎస్పీ స్వామి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాండూరు పట్టణానికి చెందిన వరలక్ష్మి వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు. ఈమెకు అదే పట్టణానికి చెందిన జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్‌తో పాత కక్షలు ఉన్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా వరలక్ష్మిపై తాండూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఈ క్రమంలో వరలక్ష్మి తనపై ఉన్న కేసును తొలగించేందుకు సహకరించాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి (టఫ్) షాబాద్ మండలం నరెడ్లగూడకు చెందిన భీంభరత్‌తో పాటు అదే గ్రామానికి చెందిన ముక్కు రవికుమార్ అలియాస్ శ్యామ్, చేవెళ్లకు చెందిన జిల్లా కార్యదర్శి నారాయణదాస్‌ను కలిసింది. టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ద్వారా అవసరమైతే సీఎం, లేదా హోంమంత్రిని కలసి కేసులు తొలగించేలా చూస్తామని వారు నమ్మబలికారు. గతనెల 31న వరలక్ష్మి పని నిమిత్తం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్లింది. వెళ్లిన పని కాలేదని వరలక్ష్మి సాయంత్రం వీరి ముగ్గురికి ఫోన్ చేసింది. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పింది. తాము మొయినాబాద్‌లో ఉన్నామని, ఇక్కడ కలుద్దామని వరలక్ష్మికి వారు సూచించారు. జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్తోపాటు భీంభరత్, నారాయణదాస్లకు గతంలో ఏఐఎస్ఎఫ్లో పనిచేసిన కాలంలో పరిచయం ఉంది. తమతో కక్షలున్న వరలక్ష్మిని హతమారిస్తే రూ.3 లక్షలిస్తామని జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి, భీంభరత్ తదితరులకు చెప్పి సుపారీ కుదుర్చుకున్నారు. సుపారీ కుదుర్చుకొని.. వరలక్ష్మి హత్యకు పథకం పన్నిన నిందితులు ఆమెను మొయినాబాద్‌లో కలిశారు. ఈ రోజు పనులు ఏమీ కాలేవు.. మూడ్ బాగాలేదని వరలక్ష్మి చెప్పింది. అనంతరం మొయినాబాద్‌లో రెండు బీర్లు, ఫాస్ట్‌ఫుడ్‌లో చికెన్, మటన్ కొనుగోలు చేశారు. తాండూరులో వదిలిపెడతామని భీంభరత్ తదితరులు వరలక్ష్మిని నమ్మించి, తమ ఇన్నోవా (ఏపీ 28డీటీ1040) వాహనంలో ఎక్కిం చుకొని బయలుదేరారు. మత్తుమందు కలిపిన బీరును వరలక్ష్మికి తాగించారు. ఇంతలో ఆమె సోదరి నిర్మల ఫోన్ చేయగా విమలక్క కారులో ఉన్నాను.. ఇంటికి రావడానికి లేట్ అవుతుందని చెప్పింది. కొద్దిసేపటికి ఆమె మత్తులోకి జారుకున్నాక.. వారు చేవెళ్లలో రెండు మీటర్ల తాడును కొనుగోలు చేశారు. చేవెళ్ల-తాండూరు దారిలో ముగ్గురు నిందితులు కారులోనే తాడుతో ఉరి బిగించి వరలక్ష్మిని చంపేశారు. ఆమె కాళ్లకు ఉన్న చెప్పులను వికారాబాద్ రైల్వేబ్రిడ్జిపై నుంచి ట్రాక్‌పై పడేశారు. ఆమె ఫోన్‌ను వేగంగా వెళ్తున్న ఓ లారీలో పడేశారు. అనంతరం ఇన్నోవాను అనంతగిరి మీదుగా కెరేళ్లి వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశం కోసం కేరెళ్లి నుంచి బుగ్గ రామలింగేశ్వరం మీదుగా వికారాబాద్ వస్తూ అనంతగిరి సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో మృతదేహాన్ని పడేసి పరారయ్యారు. మరుసటి రోజు హత్య వెలుగుచూసింది. కాల్ డేటా ఆధారంగా దొరికిన నిందితులు వరలక్ష్మి ఫోన్‌కాల్ డేటా ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో కేసు దర్యాప్తు చేసి భీంభరత్‌తో పాటు మిగతా ముగ్గురిని పట్టుకున్నారు. అయితే, తన సోదరి హత్యకు జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్, ప్రభు, విమలక్కనే కారణం అని వరలక్ష్మి సోదరి నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మిని చంపేసిన నారాయణదాసు, భీంభరత్, ముక్కు రవికుమార్‌లను అరెస్టు చేశామ ని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ స్వామి తెలిపారు. దీంతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభు, విమలక్కపై విచారణ జరుపుతామని తెలిపారు. ప్రధాన నిందితులు జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పరారీలో ఉన్నారు. -
హోంమంత్రి ని కలవనున్న విమలక్క
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సంయుక్త కార్యదర్శి భీం భరత్ అక్రమ అరెస్ట్‌కు సంబంధించిన విషయం పై చర్చించడానికి ఈ రోజు విమలక్క తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవనున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన విమలక్క మినిస్టర్ క్వాటర్స్‌లో హోంమంత్రిని కలిసి ఈ విషయం పై చర్చించనున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. -
కలసి పోరాడుదాం: ప్రొ. కోదండరాం
-చిన్నరాష్ట్రాలొచ్చినా..చిన్న కులాలకు రాజ్యాధికారం రాలేదు:గద్ధర్ హైదరాబాద్ ప్రజాస్వామిక విస్తరణ కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణను కొనసాగించాలని ప్రజాసంఘాలకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంపై వెనక్కు వెళ్లేది లేదని అన్నారు. మంగళవారం హోటల్ అశోకాలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం నూతన డైరీ-2016 ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే మున్సిపల్ విభాగంలో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. సమాజంలో మాదిరిగానే కార్యాలయాల్లోనూ వివక్షకు గురవుతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగానే చిన్న ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఉద్యోగుల పరిరక్షణ అంటే.. కేవలం ఆర్ధిక లబ్ది మాత్రమే కాదని, అందరికీ సమాన గౌరవం లభించినపుడే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాసంఘాల పాత్ర, కార్యాచరణ, సైద్ధాంతిక అంశాలపై స్పష్టత కొరవడిందని అన్నారు. రాష్ట్రం వచ్చినా.. రాజ్యాధికారం ఏదీ..? దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జనాభాలో కేవలం 0.4 శాతం ఉన్న కులం వారికి అధికారం వచ్చిందన్నారు. ప్రస్తుతం సిద్ధాంత పరమైన ఉద్యమాలకు జనం సిద్ధంగా లేరని చెప్పారు. అయితే.. ప్రజల్లో ఇప్పటికీ ఐక్యత, పోరాటపటిమ(యూనిటీ అండ్ స్ట్రగుల్) ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టీఎన్జీవో నేతలు దేవీప్రసాదరావు, రవీందర్‌రెడ్డి, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
- ఏపీ రాజధాని నిర్మాణంపై విమలక్క ఆరోపణ - బహుళజాతి కంపెనీల కోసం పంట పొలాలు నాశనం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో జరుగుతోందని ప్రజాకళామండలి ఆరోపించింది. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంకోసం మూడు పంటలు పండే పొలాలను నాశనం చేస్తున్నారని, అక్రమంగా బాక్సైట్ తవ్వకాలను చేస్తున్నారని విమర్శించింది. దీనికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి నిర్భంధిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజాకళాకారుడు కోటిని మఫ్టీలో ఉన్న పోలీసులు గత శనివారం అరెస్టు చేశారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం అరుణోదయా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ప్రజా కళామండలి అధ్యక్షుడు జాన్ మాట్లాడారు. 2005లో ఐపీఎస్ అధికారి మహేష్ లడ్డాపై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో గుంటూరులో ప్రజా కళామండలి జిల్లా కమిటీ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న కోటిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. కోటిపై అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
దోపిడీలేని తెలంగాణ కావాలి
బహుజన బతుకమ్మ వేడుకల్లో విమలక్క కోనరావుపేట: దోపిడీ లేని తెలంగాణ కావాలని, దొరల తెలంగాణ వద్దని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఆమె బతుకమ్మ ఆడారు. విమలక్క మాట్లాడుతూ పంటలపై పెట్టుబడులు రాక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో బతుకమ్మ పండుగ కోసం రూ.15 కోట్లు కేటాయించి, వృథాచేయడం సరైంది కాదన్నారు. నాడు దొరల ఆజమాయిషీ వల్ల మహిళలు బతుకమ్మకు దూరమయ్యారని, ఈనాడు కూడా ప్రభుత్వ చర్యల వల్ల మళ్లీ దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ నియంత పాలనను కొనసాగిస్తోందని, ఎన్కౌంటర్లు, రైతులు ఆత్మహత్యలు, మహిళలపై దోపిడీలు జరుగుతున్నాయన్నారు. -
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
-
హామీలను విస్మరించిన సర్కార్
రాష్ట్రం వచ్చాక ఫారెస్టు అధికారులు రైతులపై పడ్డారు.. ఎక్కడికక్కడ భూములను ధ్వంసం చేస్తున్నారు పులుమద్ది గ్రామాన్ని సందర్శించిన టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క వికారాబాద్ రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మండిపడ్డారు. ఆదివారం మండల పరిధిలోని పులుమద్ది గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో కొన్నేళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడాన్ని విమలక్క తప్పుపట్టారు. బాధిత రైతులతో మాట్లాడి ఆమె వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. మూడు తరాలుగా ఇక్కడి దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు ఈ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫారెస్టు అధికారులు రైతులపై పడి ఎక్కడికక్కడ భూములను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో లభించే రాయినిబట్టి అక్కడ మైనింగ్ జరిపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. చాలా ఏళ్లుగా గ్రామంలోని 90 కుటుంబాలు 200 ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. అప్పటి నుంచి లేని అడ్డంకులు అధికారులకు ఇప్పుడెందుకని విమలక్క ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని సాగు భూమి, ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కాలువలు, బావులే రైతుల భూమి అనేందుకు సాక్ష్యం అని పేర్కొన్నారు. చట్టాలు ఉన్నాయని ఫారెస్టు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేద ని విమలక్క హెచ్చరించారు. ఎన్నికలకు ముందుకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచిపోయిందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం, ఉచిత విద్య వంటి హామీలేమయ్యాయని ఆమె సీఎంను ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. సర్కార్ వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని విమలక్క డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం దీక్షలు, ధర్నాలు చే స్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని గిరిజనుల భూములను లాక్కుంటే ఉద్యమిస్తామన్నారు. అంతకు ముందు తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు భీం భరత్, బాధిత రైతులు మాట్లాడుతూ.. జాయింట్ కలెక్టర్ ఈ నెల 28 వరకు సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులు ఈ భూ ములకు సంబంధించి పన్నులు కూడా చెల్లించారని గుర్తు చేశారు. గతంలో భూములు సాగుచేసుకునేందుకు తహసీల్దార్ కొందరు రైతులకు పట్టాలు కూడా ఇ చ్చారని చెప్పారు. కార్యక్రమంలో టఫ్ నాయకులు నారాయణ్‌దాస్, శ్రీనివాస్ ఉన్నారు. -
ఫార్మా కంపెనీలతో పెను ముప్పు : విమలక్క
రంగారెడ్డి (కందుకూరు) : ఫార్మా కంపెనీలతో పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ సోమవారం కందుకూరులోని ముదిరాజ్ భవన్లో తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఏక పక్షంగా ఫార్మా కంపెనీల స్థాపనకు పూనుకోవడం బాధ్యతారహితమైన చర్యగా వ్యాఖ్యానించారు. బహుళ జాతి కంపెనీలకు భూముల్ని ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. చౌటుప్పల్, బొల్లారంలలో ఉన్నట్లుగా ఇక్కడా ఆ దుస్థితే తలెత్తే ప్రమాదముందని చెప్పారు. తాగునీరు, గాలి, పంట పొలాలు అన్నీ కలుషితమై జీవవైవిధ్యం దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లనుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం స్వలాభమే ధ్యేయంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
లేకుంటే సచివాలయం ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావని ఉద్యమంలో ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షలు, ఏపీలో లక్షన్నర ఉద్యోగాలకు జూన్ 2లోగా ఆయా ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే లక్షమంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలవెంకట్ అధ్యక్షతన ఆదివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని అన్నపూర్ణ కల్యాణమండపంలో సమావేశం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులనుద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంతో అనేక మంది నిరుద్యోగుల వయోపరిమితి దాటి పోయి నష్టపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నెలలోపు లక్ష, 6నెలల్లో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఏడాదైనా ఎటువంటి స్పందనలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. బతుకునిచ్చే తెలంగాణ కావాలే: విమలక్క అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి అయ్య జాగీరు కాదనీ అరుణోదయ కళామండలి అధ్యక్షురాలు, ప్రజాగాయని విమలక్క అన్నారు. మిలియనీర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయటం కాదనీ రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలు కోరుకునేది బంగారు తెలంగాణ కాదని బతుకునిచ్చే తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, శారద, దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంల కుమారుల విదేశీ పర్యటన...
కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులపై టీయుఎఫ్ కో చైర్పర్సన్ విమలక్క మండిపడ్డారు. పెట్టుబడులను ఆహ్వానించి ఇక్కడి భూములను తాకట్టు పెట్టడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కుమారుడు కె.తారక రామారావు(కేటీఆర్), ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు విదేశాలకు వెళ్లారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరించడమేనా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారని విమలక్క అన్నారు. -
కేసీఆర్ కార్పొరేట్ల తొత్తు: టఫ్
హైదరాబాద్ సిటీ: కార్పోరేట్ శక్తులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని అదే కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) విమర్శించింది. కేసీఆర్ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి సామాన్యులను నిలువునా వంచిస్తోందని దుయ్యబట్టింది. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం స్వార్థ శక్తుల చేత చిక్కిందని వారి నుంచి విడిపించి బంగారు తెలంగాణ సాధించేందుకు నవ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) ద్వితీయ వార్షికోత్సవ మహాసభలు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు, మేథావులు పాల్గొన్న ఈ సభకు టఫ్ కో చైర్పర్సన్ విమలక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక కూడా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఈ రోజు మంత్రి పదవుల్లో కూర్చున్నారని, ఉద్యమించిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పేదలకు భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. -
లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క హన్మకొండ: వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునేందుకే ఇరు రాష్ట్రాల సీఎంల కుమారులు లోకేశ్, కేటీఆర్‌లు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బయట ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని, లోలోపల ఇద్దరు ఒక్కటేనన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అధికంగా రైతు ఆత్మహత్యలు జరిగితే...వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కి పెట్టారన్నారు. -
కేటీఆర్, లోకేశ్..ఇద్దరూ ఒక్కటే!
వరంగల్ (హన్మకొండ) : వ్యాపార లావాదేవీలపై మాట్లాడుకునేందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క ఆరోపించారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చూడడానికే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని, లోలోపల ఇద్దరూ ఒక్కటేనన్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికలు ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై కుట్ర కేసులు పెడుతున్నారని, ఎవరూ మాట్లాడుకుండా చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన కలిసి పోరాడేందుకు పౌరసమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశానికి వెన్నెముక రైతులని చెబుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలను పాలకులు కనీసం పరామర్శించడం లేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగితే..అవి వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కిపెట్టారన్నారు. -
ముచ్చర్లలో ఫార్మాసిటీ వ్యతిరేక సమావేశం
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ యూనైటడ్ ఫ్రంట్ కో- చైర్మన్ విమలక్క ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఫార్మా సిటీ ఏర్పాటుతో కలిగే నష్టాలను ముచ్చర్ల చుట్టుపక్కల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. -
'వారిద్దరివి..మైండ్ ఫిక్సింగ్ పాలిటిక్స్'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమ, అహంకార పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మధుయాష్కీ మాట్లాడుతూ తెలంగాణలో గ్రామగ్రామన వసూళ్ల రాజ్యం నడుస్తోందని అన్నారు. అవినీతికి పాల్పడనని కేసీఆర్ ఎక్కడా ప్రమాణం చేయలేదన్నారు. రాష్ట్రంలో అహంకారపూరిత దొర పాలన సాగుతోందని మధుయాష్కీ అన్నారు. ప్రజలను రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విమలక్కపై కుట్ర కేసు కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని మధుయాష్కీ విమర్శించారు. -
నవ తెలంగాణ నిర్మాణానికి ఏకం కావాలి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షరాలు విమలక్క సామ్రాజ్యవాద పాలనకు స్వస్తి చెప్పాలి : పాశం యాదగిరి బైరాన్‌పల్లి(మద్దూరు) : బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తిగా పోరాడి సాధించుకున్న తెలంగాణాను నవతెలంగాణగా నిర్మించుకోవడానికి అందరూ ఏకం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. మద్దూరు మం డలం బైరాన్‌పల్లిలో శనివారం బురుజుపై విమలక్క సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, త మ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మధుయాష్కి, సినీ హీరో మాదాల రవి, మల్లు స్వరాజ్యం ఎర్రజెండాను ఆవిష్కరించారు. బురుజు వద్ద కొవ్వొత్తులను వెలిగించి అమరులకు నివాళలర్పించారు. అనంతరం సామ్రాజ్యవాద వ్యతిరేక సాంస్కృతిక శౌర్యయాత్ర సభ గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అ ద్యక్షతన జరిగిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం ,పేదల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీర బైరాన్‌పల్లి అమరుల చరిత్ర మరువలేనిదన్నారు. బహుజనులు తెలంగాణ కోసం ఎర్ర జెండాలన్ని ఏకమై పోరాడాల న్నారు. అమరుల త్యాగాల సాక్షిగా ముందుకు సాగాలని ప్రజలను కోరారు. కవులు, కళాకారుల కృషితోనే తెలంగాణ సాధించుకున్నామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేఖ విధానాల కు పాల్పడుతున్నాడన్నారు. తెలంగాణ ఆకాంక్షను తీర్చింది సోనియూగాంధీ అని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయూష్కీ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆసన్నం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కూలీల రా జ్యం వచ్చేంత వరకు పోరాడాలన్నారు. సామ్రాజ్యవాద దోపిడీని కూలగొట్టాలి పాశం యాదగిరి పిలుపునిచ్చారు. కాగా, కళాకారు లు ఆటాపాటతో ప్రజల ను అలరించారు. ఈ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం, మాజీ ఎమ్మెల్యే జీహెచ్ రాజారెడ్డి, జనగామ డివిజన్ ఇన్చార్జి ఆముదాల మల్లారెడ్డి, దాసరి కళావతి, మద్దూరు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు ఆలేటి యాదగిరి, అశోక్, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు. -
చవితి పందిళ్లలో గీతాల దరువు
విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పచ్చని చెట్లు... కలుషితం లేని హృదయాలు... ఏ ఇంటికెళ్లినా ఆప్యాయత... ఎవరిని కదిలించినా మమత... విభిన్న సంస్కృతుల వేదికై... భిన్నత్వంలోనూ ఏకమై... నిఖార్సయిన మానవ విలువలకు నిలువెత్తు రూపం నాటి నగరం. చిన్ననాడే విప్లవమార్గం పట్టి... ఉద్యమ గీతికలను వంటబట్టించుకుని... ప్రజా పోరాటాల వారధిగా మారిన ‘అరుణోదయ’ విమలక్కది ఈ భాగ్యనగరితో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం. ఆ ‘జ్ఞాపకం’ సిటీ ప్లస్‌కు ప్రత్యేకం... అది 1970... మా ఊరు నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి అమ్మతో కలసి హైదరాబాద్ వచ్చా. ఉప్పల్‌లో దిగి... అక్కడి నుంచి నడుచుకుంటూ చంచల్‌గూడ జైలుకు వెళ్లాం. నాన్న బండ్రు నర్సింహయ్యను కలిసేందుకు. నగరానికి రావడం అదే తొలిసారి. అంతా చెట్లు, చేమలు... అడవిలా ఉండేది. ఇక్కడికి మా ఊరు దాదాపు 75 కిలోమీటర్లు. అక్కడి నుంచి రైలు లేదంటే కట్టెల లారీల్లో ప్రయాణం. రైలేతే నో టికెట్. నాన్న కోసం వచ్చిపోతుండేవాళ్లం. తరువాత ముషీరాబాద్ జైలుకు వెళ్లేవాళ్లం. నగరం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. ఉప్పల్‌లో ఇరానీ హోటల్ ఉండేది. అందులో చాయ్ తాగుతుంటే... ఆ రుచే వేరు. అక్కడ ఆ పేరుతోనే బస్టాప్... ‘ఇరానీ చాయ్’. చార్మినార్ మట్టి గాజులు సిటీకి ఎప్పుడు వచ్చినా అంబర్‌పేట్‌లోని చిన్నాన్న ఇంట్లోనే బస. వారం పదిరోజులు ఉండేవాళ్లం. బేగంపేటలో షాపింగ్. చార్మినార్‌లో మట్టి గాజులు కొనుక్కునేదాన్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంగమ్’ థియేటర్లో సినిమాలు చూసేవాళ్లం. రామంతపూర్, పార్శీగుట్ట, రాంనగర్ బస్తీలే నా ప్రపంచం. ఓయూతో అనుబంధం... నా పదకొండో ఏట నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో ఎంతో అనుబంధం. నాకు ఇంతకంటే అద్భుతమైన, అందమైన విశ్వవిద్యాలయం కనిపించలేదు. అప్పట్లో నన్ను పిలిచి పాటలు పాడించుకొనేవారు. 1974లో ఓయూలోనే అరుణోదయ పురుడు పోసుకుంది. రామసత్తయ్య నాకు పాటలు నేర్పారు. బుర్రకథ నేర్చుకోవడానికి కానూరి వెంకటేశ్వరరావు తాతయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఇక వినాయక చవితి పందిళ్లను విప్లవగీతాలకు వేదికగా చేసుకొని గళం వినిపించేవాళ్లం. నాటి పీడీఎస్‌యూ నాయకురాలు, ప్రొఫెసర్ లక్ష్మి రూమ్‌లో మకాం. దట్టమైన చింత చెట్లు. వాటి మధ్య నుంచి రాకపోకలు. ఎంత తిరిగినా అప్పట్లో భయమన్నది లేదు. ఇప్పుడు..! రోజుకు లెక్కలేనన్ని దారుణాలు, మహిళలపై అఘాయిత్యాలు. క్యాంపస్‌లో ఓ బడ్డీ ఉండేది. అందులో చాయ్, సమోసా, బాదం పాలు స్పెషల్. ముచ్చట్లకూ సెంటర్ అదే. క్యాంపస్ పార్కులో కూర్చుంటే ఎంతో ఆహ్లాదం. బస్తీలే ప్రపంచం... ఆలేరులో నా క్లాస్‌మేట్స్‌లో కొంతమంది ఇక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడూ కలుస్తుంటాం. నచ్చే ఫుడ్ అంటే... ఎక్కువగా బస్తీల్లోనే ఉండటం వల్ల అక్కడ వారు పెట్టిందే తినడం. ఎప్పుడన్నా హోటల్‌కు వెళితే బిర్యానీ ఆర్డర్ చేసేవాళ్లం. కానీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లో ఇప్పుడా టేస్ట్ లేదు. ఇప్పుడెక్కడున్నాయి..! నాటి మానవ సంబంధాలు కోల్పోని జనారణ్యం తెలుసు. కల్మషం లేని చిరునవ్వులు, ఆప్యాయత, అనుబంధాలూ చూశా. ఎవరింటికి వెళ్లినా ఎన్ని రోజులైనా ఉండగలిగే పరిస్థితి. సహజమైన, స్వచ్ఛమైన ప్రేమ, మమకారం. నేడు... నగరీకరణ నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న వందల గ్రామాలు, పల్లెలు, బస్తీలు విధ్వంసం అయ్యాయి. ప్రపంచీకరణ పేరుతో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఎవరింటికన్నా వెళితే... ఎప్పుడు పోతావని చూస్తున్నారు. నగరాన్ని పట్టిన కాలుష్యంలా... మనసులూ కలుషితమయ్యాయి. లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్నా... విశాలమైన భవనాల్లో ఉంటున్నా... మనసులు ఇరుకైపోయాయి. నాడు ఇరుకు గదుల్లో బతికినా హృదయాలు విశాలం. చావు- పుట్టుకలు సహజం. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న సమయంలో మనమేం చేస్తున్నామన్నది ముఖ్యం. పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోం. పోయేటప్పుడూ ఏమీ తీసుకుపోం. ఎప్పటికీ మిగిలేది మంచితనం, మానవత్వం. నేను కోరుకునేది ఒక్కటే... నాటి మమకారాలు, ప్రేమలు మళ్లీ ఈ మహానగరంలో చిగురించాలని. -
వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగారు ్జన, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లు లేని తెలంగాణకావాలి..
శ్రీరాంపూర్ : నెత్తురు పారని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని అడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. శ్రీరాంపూర్ కృష్ణాకాలనీలోని గౌరిసుత గణేశ్ మండలి మైదానంలో బహుజన బతుకమ్మ సంబరా లు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆ డారు. జిల్లాలో ప్రజల జీవనంపై విధ్వంసం పెరిగిం దన్నారు. టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను అడవికి దూరం చేసి అందులోని సంపదను బహుళజాతి సం స్థలకు అప్పగించడానికి పాలక వర్గం కుట్ర చేస్తుంద ని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొ గ్గు ఇక్కడ నుంచి అందిస్తున్న ఇక్కడ జల్ జంగల్ జ మీన్ కోసం పోరాడిన కొమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకొని పోరాడాలన్నారు. చాలా కాలం బతుకమ్మను దళితులకు దూరం చేశారని అందుకు బహుజన బతుకమ్మ పేరుతో బతుకమ్మను బహుజనులకు దగ్గర చేస్తున్నామన్నారు. ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు ముందుగా బతుకమ్మలతో భారి ఊరేగింపు నిర్వహిం చారు ఒగ్గు కళాకారుడు ఐలయ్య బృందం, ధూంధాం కళాకారుడు డప్పు సమ్మయ్య బృందం డప్పు చప్పుళ్లతో బారి ఊరేగింపు జరిగింది. వేదికపై అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారులు పాడిన పాటలు డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. స్వరమాదురి కళానిలయం వ్యవస్థాపకులు, ధూంధాం కళాకారుడు అంతడప్పుల నాగరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పెద్దయెత్తున మహిళలు బతుకమ్మ సం బరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎఫ్ నిర్వాహకులు బైరాగి మోహన్, తిరుపతిరెడ్డి, ఏఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల పోశమల్లు, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, పీఓడబ్ల్యూ నాయకులు కరుణ, రమా, కళాకారులు డప్పు సమ్మయ్య, రేగుం ట చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పత్తి గట్టయ్య, టీడీజీ మండల ప్రధాన కార్యదర్శి జక్కుల కుమార్, ఎంపీటీసీ ఉడుత రాజమౌళీ, ఉప సర్పంచ్ మోతె కనుకయ్య, బీజేపీ మండల నాయకులు అగల్‌డ్యూటీ రాజు, కాసెట్టి నాగేశ్వర్‌రావులు పాల్గొన్నారు. -
‘ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలి’
హైదరాబాద్: ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టాలని ఆచార్య జయధీర్ తిరుమలరావు, అరుణోదయ విమలక్క డిమాండ్ చేశారు. అక్టోబరు 7, 8 తేదీలలో జోడే ఘాట్‌లో కొమురం భీం 74వ వ ర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ కొమురం భీం వర్ధంతి కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వీరు ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా దోమలగూడలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొమురం భీం చిత్రాన్ని పార్లమెంటులో పెట్టాలని, ఉట్నూరులో ఆదివాసీ వర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. జోడే ఘాట్‌లోనే కొమురం భీం వర్ధంతిని నిర్వహించాలని కోరారు. రూ. 200 కోట్లతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని, ఆయన పేరిట ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొము రం భీం మనవడు కొమురం సోనేరావు, వర్ధంతి కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. -
నవ తెలంగాణ కోసం పోరాడాలి
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క షాబాద్ : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మలో ఆమె పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణచివేయబడ్డాయని విమర్శించారు. రోజురోజుకూ ఆదరణ కోల్పోయిన ఈ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. నవ తెలంగాణ కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదు లక్షల ఎకరాల భూములను పారిశ్రామికులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ముందుగా మైనింగ్ మాఫియా భూములను రద్దు చేయాలని హితవుపలికారు. ఫిరంగినాలాకు మరమ్మతులు చేపట్టాలని గతంలో చందనవెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సాగునీటి వనరులపై చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు భీంభరత్, జిల్లా కార్యదర్శి నారాయణదాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్బైరాగి, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచ్‌లు రాములుగౌడ్, లక్ష్మమ్మ, సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోచయ్య, సత్యనారాయణ, నాయకులు విశ్వ నాథం, శ్రీను, మహేశ్ పాల్గొన్నారు. -
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
టీయూఎఫ్ కో-చైర్పర్సన్ విమలక్క జవహర్‌నగర్: తెలంగాణలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీయూఎఫ్(తెలంగాణ యుైనెటైడ్ ఫ్రంట్) కో-చైర్ పర్సన్ విమలక్క పిలుపునచ్చారు. శుక్రవారం జవహర్‌నగర్‌లోని కేవీఆర్ బెసిలైన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సభకు ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పర్మనెంట్ ఉద్యోగమనేది లేకుండా అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్లడం శోచనీయమన్నారు. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్‌లో రాంకీ సంస్థ మహిళా కార్మికులతో రాత్రి వేళల్లో కూడా పనిచేయించడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ఏఐఎఫ్టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు మాట్లాడుతూ.. ప్రస్తు పరిస్థితుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. పోరాటాలతో కార్మికుల హక్కులు సాధించుకుంటామని చెప్పారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆటాపాట ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేవీఆర్ బెసిలైన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మరియమ్మ, వర్కింగ్ అధ్యక్షుడు మల్లేష్, సభ్యులు బిచ్చయ్య, డి.తిమ్మమ్మ, పి.లక్ష్మి, సి.లక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రెటరీ మాధవి, ఏఐఎఫ్టీయూ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ తెలంగాణ నిర్మాణానికి లడాయి తప్పదు
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కోచైర్మన్ విమలక్క గోదావరిఖని:ఆగమైపోయిన బతుకులు బాగుపడినప్పుడే అసలైన తెలంగాణ వచ్చినట్టు అవుతుందని, ఇందుకోసం ప్రజలు లడాయి చేయక తప్పదని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్మన్ విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు పల్లె లింగయ్య రూపొందించిన ‘తల్లిరుణం’ పాటల సీడీ, ‘ఎర్ర సాల్లు’ అనే పాటల పుస్తకాన్ని గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం విమలక్క మాట్లాడుతూ గుట్టలను మాయం చేస్తున్న వారు, ఇసుకను తరలించుకుపోతున్న వారు, ఆదివాసీలను ముప్పు తిప్పలు పెడుతున్న వారు మాఫియాలుగా మారి వారే పునర్నిర్మాణం అంటున్నారని, వారి నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, కళాకారులు నవ తెలంగాణ నిర్మాణంలో కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. తెలంగాణ జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజు, అరుణోదయ రాష్ట్ర నాయకుడు మోహన్, టఫ్ జిల్లా కన్వీనర్ బొల్లం లింగమూర్తి పాల్గొన్నారు. -
నల్లమల ఎన్కౌంటర్లో సిరిసినగండ్ల కవిత?
కొండపాక : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలోని మురారి కురవ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టు సభ్యుల్లో ఒక మహిళ కొండపాక మండలం సిరిసినగండ్ల పంచాయతీ పల్లెచింతలు గ్రామానికి చెందిన పడిగె కవిత అలియాస్ విమలక్క (26)గా పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ప్రకాశం జిల్లా పోలీసులు తొగుట పోలీసులకు వివరాలు అందించారు. దీంతో ఎస్ఐ జార్జ్ శుక్రవారం కవిత తల్లిదండ్రులు పడిగె మల్లయ్య, శంభవ్వలకు విషయం తెలిపి కానిస్టేబుల్‌ను తోడుగా ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గుర్తించడానికి ప్రత్యేక వాహనంలో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. చదువుకోని కవిత.. అక్షర జ్ఞానం లేని కవిత వ్యవసాయ పనులు, పశువులను కాస్తూ తల్లిదండ్రులు మల్లయ్య, శంభవ్వ దంపతులకు సహాయంగా ఉండేది. మల్లయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు కాగా నాలుగో కుమార్తె పడిగె కవిత అలియాస్ విమలక్క. మొదటి నుంచి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన గిరాయిపల్లి కూడా సిర్సినగండ్ల మదిర గ్రామమే. ఈ క్రమంలో 2004లో మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితురాలైన కవిత గిరాయిపల్లి దళంలో చేరింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉంది. కాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కవిత అలియాస్ విమలక్క మృతి చెందిందన్న వార్తతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మల్లయ్య, శంభవ్వలు కన్నీటి పర్యంతమయ్యారు -
రామోజీ ఫిల్మ్‌సిటీ భూముల స్వాధీనమేమైంది?: విమలక్క
దౌల్తాబాద్/గజ్వేల్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ వాగ్దానం ఏమైందని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కోకన్వీనర్ విమలక్క శనివారం ప్రశ్నించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో మొట్టమొదటగా తానే నాగలి కడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీయూఎఫ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీఓడబ్ల్యూ, పీడీఎస్యా(విజృంభణ), శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర మెదక్ జిల్లా దౌల్తాబాద్, గజ్వేల్ మండలాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. -
‘బిల్లు’పై చర్చ ప్రజల మధ్య జరగాలి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుతమున్న అసెంబ్లీని సమైక్యవాదుల అసెంబ్లీగా తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కో కన్వీనర్ విమలక్క అభివర్ణించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో టఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ సభలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, కొట్టుకోవడమే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందనివ్వరన్నారు. అసెంబ్లీ వెలుపల ఉన్న ఫతే మైదాన్‌లో ఎమ్మెల్యేలు సమావేశమై ప్రజల సమక్షంలో తెలంగాణ బిల్లుపై చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూసుకుంటారని విమలక్క పేర్కొన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ దళారులతో కుమ్మక్కై తెలంగాణ రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ల్యాండ్, గ్రానైట్, మైన్స్ మాఫియాలంతా కూడా తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా కాజేసిన తమ భూములను కాపాడుకోవడానికే సీమాంధ్ర నాయకులు నానా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల భూములను లాక్కొని తెలంగాణ రైతులు నాగళ్లతో దున్నడం ఖాయమన్నారు. జిల్లాలో ఉన్న భూములు నేడు సీమాంధ్రుల కబ్జాలో ఉన్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం మీదుగా వెళుతున్న కృష్ణా నీటి పైపులను పగులగొట్టి ఇక్కడి పెద్ద చెరువును నింపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో టఫ్ రాష్ట్ర నాయకులు భీం భరత్, నారాయణదాసు, అరుణోదయ నాయకులు బైరాగీ, రాజు, సీపీఐ నాయకులు కావలి నర్సింహ, ఎంఎస్ఎఫ్ నాయకులు కొండ్రు ప్రవీణ్, బీజేపీ నాయకులు మొగిలి గణేశ్, గుండ్ల దానయ్యగౌడ్, టఫ్ నాయకులు రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి
పరిగి, న్యూస్‌లైన్: బహుజనుల తెలంగాణ కోసం ఉద్యమించాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యార్థి జేఏసీ పరిగి నియోజకవర్గ చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన కేఎన్ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విద్యార్థి రణభేరి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ ఆపేందుకు సీఎం కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, అవసరమైతే మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిగిలో వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, పాలమూరు ఎత్తిపోతల వెంటనే చేపట్టాలని, వికారాబాద్ నుంచి పరిగి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. మన భూములు, నీళ్లు, ఉద్యోగాలు కొల్లగొట్టిన వారిని తరిమికొట్టేందుకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. సీమాంధ్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓట్లడగటానికి వచ్చేవారిని గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కుళ్లుపట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చించకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ నాడు పరిగిలో చంద్రబాబును అడ్డుకున్న విద్యార్థులపై దాడులు చేసిన టీడీపీ నాయకులే నేడు తెలంగాణ సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. టీజీఓల సంఘం జిల్లా కార్యదర్శి హరిశ్చందర్ మాట్లాడుతూ అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేని రాజకీయాలతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మనం కోరుకోవాల్సింది ఇదేనని అన్నారు. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చెర్క సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య కోసం పోరాడుతామన్నారు. జిల్లా అభివృద్ధికి అవరోధంగా మారిన 111 జీఓను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బహుజనుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. జేఏసీ జిల్లా నాయకుడు ముజీబ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్‌మహ్మద్, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మునీర్, కో కన్వీనర్ సాయిరాంజీ, ఆయా నియోజకవర్గాల విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రణభేరి సభలో ఆరుణోదయ కళాకారులు ఉద్యమ గీతాల ఆటపాటలతో సభికులను ఉత్తేజపరిచారు. -
బహుజనుల తెలంగాణ కోసం మరో ఉద్యమం
పరిగి, న్యూస్‌లైన్: దొరల నీడపడని బహుజనుల తెలంగాణ సాధనకోసం మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టఫ్) కో చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ను దోచుకున్న వారే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, వారికి సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఆంక్షలు లేని తెలంగాణ ను సాధించుకోవటమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు, కొందరు నాయకులు తమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, కళాకారులు, బహుజనుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. కొన్ని పార్టీలు ఇక్కడోమాట ఆంధ్రాలో ఓ మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్చి నిర్మిస్తే అభ్యంతరంలేదని అన్నారు. ఇదే సమయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో సీమాంధ్రులు దోచుకున్న భూములు వదులుకునేది లేదని, అవసరమైతే నాగళ్లుకట్టి దున్ని తీరుతామని అన్నారు. ఈ నెల 8న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ, పీడీఎస్‌యూ, విద్యార్థి జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నారాయణ్‌రావు, సంతోష్, లక్ష్మి, రవీందర్, విజయల క్ష్మి, సర్దార్, రవికుమార్, వెంకటరాములు, విజయ్‌రావు, ముజీ బ్, మునీర్, పీర్‌మహ్మద్, సాయిరాంజీ, పాండు, రవి, బందయ్య, గోవింద్, వెంకట్ పాల్గొన్నారు. -
అడవి మాదే.. హక్కు మాదే
రాముడిపై భక్తితో కాదు.. హుండీపై మోజుతోనే భద్రాద్రిపై కన్ను సీమాంధ్రులు గద్దల్లా ఎత్తుకెళితే ఊరుకోం: విమలక్క భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఖనిజ సంపదను, పాపికొండలను, గోదావరి జలాలను గద్దల్లా ఎత్తుకెళ్లడానికే సీమాంధ్రులు భద్రాచలం ప్రజలపై, ఆదివాసీలపై కపట ప్రేమను చూపిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ధ్వజమెత్తారు. కానీ, ఈ అడవి మాదే, దానిపై హక్కు మాదేనని ఆమె నినదించారు. భద్రాచలాన్ని సీమాం ధ్రలో కలపవద్దంటూ జరుగుతున్న దీక్షా శిబిరాలను శని వారం విమలక్క సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడిపై భక్తితో సీమాంధ్రులు భద్రాచలాన్ని అడగటం లేదని, రాముడి హుండీపై మోజుతోనే కావాలంటున్నారని విమర్శిం చారు. అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, ఆంధ్రా భూములను సస్యశ్యామలం చేయటానికే భద్రాద్రిని కలుపుకోవాలని సీమాంధ్ర నాయకులు గుంటనక్కల్లా తొంగి చూస్తున్నారన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే అంగీకరిస్తామని, హైదరాబాద్, భద్రాచలం జోలికి వస్తే సహించేదిలేదని, వాటిని కావాలన్నవారిని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కిరణ్ కల్లు తాగిన కోతిలా.. సీమాం ధ్రులకు తొత్తుగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేలా.. గంటకో మాట, పూటకోమాట మాట్లాడుతున్న సీఎంకు మతిభ్రమించిందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాంనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్, భద్రాచలం లేకుంటే తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏనుగు తిన్న వెలగపండులా ఉంటుంద న్నారు. తెలంగాణ విద్యార్థుల ‘భద్రాద్రి గర్జన’ భద్రాచలం పరిరక్షణ కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుభం ఫంక్షన్ హాల్లో ‘భద్రాద్రి గర్జన’ జరి గింది. విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపితే.. ఆదివాసీ విద్యార్థుల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు.భద్రాచలంపై సీమాంధ్రుల చూపు పడితే, ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే ప్రజల ఆకాంక్షను 26లోగా జాతీయస్థాయిలో తెలియచెబుతామని గాంధీ పథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. ఒప్పుకో కుంటే పోరు ఉధృతమవుతుందని హెచ్చరించారు.