వికారాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్న విమలక్క, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు
వికారాబాద్ అర్బన్ : రైతుబంధు పథకం పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని భూస్వాములకు దోచి పెడుతోందని యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. వ్యవసాయ సంక్షోభాన్ని అడ్డుకోవాలని, హిందుత్వ హింసను అరికట్టాలనే డిమాండ్లతో టీయూఎఫ్, ప్రజాసంఘాల ఆధ్వర్యాన వికారాబాద్ నుంచి రాజ్‌వభవన్ వరకు చేపట్టిన పాదయాత్రను బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం ధనికులు, భూ స్వాములకు వరంగా మారిందన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ఈ మచ్చను తుడిపేసుకునేందుకే రైతుబంధు పథకాన్ని తెచ్చారని మండిపడ్డారు. దీని ద్వారా 50 నుంచి 500 ఎకరాలు ఉన్న భూస్వాములే లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు.
పేద రైతులకు ఆర్థి క సహకారం అందించడం మంచి కార్యక్రమమే అయినప్పటికీ దీనిద్వారా వారికి వచ్చిందేమీ లేదన్నారు. రెండెకరాల భూమి ఉన్న అసలైన రైతుకు రూ.8 వేలు వస్తే, 50 ఎకరాలు ఉన్న భూ స్వామికి రూ.2 లక్షలు వస్తున్నాయని చెప్పారు. ఇలా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక చేయూత ఎవరికి లాభం చేకూరుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఎవరూ మెచ్చుకోవడం లేదని, కేవలం ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఆ పార్టీ నాయకులు వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
వందల ఎకరాలున్న భూ స్వాములు గ్రామాల్లో ఉన్న పేదలకు భూములను కౌలుకు ఇచ్చి పట్టణాల్లో ఎక్కడో ఉంటున్నారని వివరించారు. వీరి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న కౌలు రైతులు పంటలు సాగు చేసి నష్టపోతున్నారన్నారు. గతంలో ఇలాంటి వారికి కనీసం బ్యాంకులు రుణాలు ఇచ్చేవని తెలిపారు. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. భూస్వాములైన యజమానులకు నేరుగా డబ్బులు ఇస్తూ కౌలు రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
దళితులపై దాడులు..
కేంద్రంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రమైనట్లు విమలక్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ వంటి సంఘాల కార్యకర్తలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం హిందుత్వ ఎజెండా అమ లుకోసం హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. నక్సల్స్ ఎజెండానే తన ఎజెండా అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి దొరల పాలన చేస్తున్నారని ఆరోపించారు.
కొత్త రకం దోపిడీ..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేకి అని తెలిపారు. రైతుబంధు పథకం అమ లు తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుం దని చెప్పారు. మట్టి ముట్టుకోని భూస్వాములు, బడాబాబులకు లక్షలాది రూపాయల పెట్టుబడి సాయం అందించడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వాలు కల్లబొల్లి పథకాలతో రైతులను ముంచేస్తున్నాయని తెలిపారు.
రైతుబంధు పథకంతో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులే ఎక్కుగా లాభ పడ్డారన్నారు. అన్నదాతల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేద రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనికుల ఫాంహౌస్‌లకు లక్షల రూపాయలు ఇవ్వడంకంటే నిజమైన సాగు భూమికి సాయం అందించాలని కోరారు. రైతుబంధు పథకాన్ని భూ స్వాములకు, దొరలకు కాకుండా వ్యవసాయం చేసేవారికి వర్తింపజేయాలన్నారు.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో దోచిపెట్టింది కాకుండా, ఇప్పుడు కొత్త రకం దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీ మాస్ రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ, టీయూఎఫ్ దాసు, భీంభరత్, టీమాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సాధు సత్యానంద్, కేవీపీఎస్ నాయకులు మహిపాల్, మల్లేశం, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సీపీఐ నాయకులు గోపాల్‌రెడ్డి, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment