రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర | KTR fires on Revanth Reddy in Telangana Assembly | Sakshi
Sakshi News home page

రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర

Published Sun, Dec 22 2024 6:09 AM | Last Updated on Sun, Dec 22 2024 6:09 AM

KTR fires on Revanth Reddy in Telangana Assembly

ఉద్దేశపూర్వకంగానే రైతుబంధుపై దుష్ప్రచారం.. అసెంబ్లీలో కేటీఆర్‌ ఫైర్‌ 

ఎలాంటి ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం అందించాల్సిందే 

ఎన్ని పంటలకు భరోసా ఇస్తారు? కౌలు రైతుకు పథకం అమలు చేస్తారా? 

సర్కారు పూర్తి రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.

కేటీఆర్‌ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 

ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలి
రైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.

రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. 
‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్‌ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్‌లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించినట్టు లాక్‌బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.

నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్‌ పారీ్టపై సీఎం రేవంత్‌ చేసిన విమర్శలను కేటీఆర్‌ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్‌ తెలిపారు.

రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ 
ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందే

సాక్షి, హైదరాబాద్‌: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్‌ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

వివరాలు ఆయన మాటల్లోనే... 
‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్‌ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్‌ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నిలదీయండి 
రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్‌ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్‌ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు బంద్‌ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్‌ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. 

రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. 
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. 

రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! 
సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement