దోపిడీకి వ్యతిరేకంగా ‘టీమాస్’ పోరు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
జనగామలో టీమాస్ ఆవిర్భావ సభ
హాజరైన గద్దర్, విమలక్క
సాక్షి, జనగామ: పాలకులు సాగిస్తున్న దోపిడీకి వ్యతి రేకంగా టీమాస్ (తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక) ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం టీమాస్ జిల్లా ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
ఓ వైపు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని చెబుతున్న పాలకులు మరోవైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కోర్టుల్లో కేసులు వేయించి పరీక్షలను నిలిపి వేస్తుందని ధ్వజమెత్తారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల మాదిరిగానే గురుకుల పోస్టులను ఆపివేశారని విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పెత్తనాన్ని టీమాస్ సహించదన్నారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు, ప్రజాగాయకురాలు విమలక్క మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ అంటే దళితులపై దాడి చేయడమేనా? అని ప్రశ్నించారు.
ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ పోరాట యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలను టీమాస్ నిర్మిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్య క్రమంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జేబీ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.