నలభై రెండు వసంతాల ‘అరుణోదయం’
సందర్భం
‘సాహిత్యానికి, కళలకూ అవసరమైన ముడి పదార్థాల గని ప్రజల జీవితమే’ అన్న చైనా విప్లవ కవి లూసన్ సూక్తి తెలుగు నేలమీద ప్రతిధ్వనిస్తోంది. అందుకే 42 వసంతాలుగా ప్రజల మధ్య జీవిస్తూ, శ్రామికుల జీవితాలతో, వారి పోరాటాలతో పెనవేసుకున్న అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 2016 అక్టోబర్ 23, 24 తేదీలలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాసభలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా అరుణోదయ పేరుతో విప్లవ సాంస్కృతిక ఉద్యమా నికి అంకురార్పణ చేసిన అపూర్వ పూర్వ సహచరులకు, సంస్థ ప్రతినిధులకు, సౌహార్ద్ర ప్రతినిధులకు, ప్రజాకవులు- కళాకారు లందరికీ మనఃపూర్వక విప్లవ స్వాగతం, సుస్వాగతం. అరుణోద యకు జవజీవాలందించిన నూతన్, రిక్కల సహదేవ్‌రెడ్డి, గుడ్డి బాబన్న, భాను, నాగన్న, కమల, బాబన్న, తోట మల్లేశం, పటాన్ చెర్వు రాములు తదితరులందరికీ విప్లవ జోహార్లు.
‘మాకొద్దీ తెల్ల దొరతనమన్న’ గరిమెళ్ల, కత్తీ కలం పట్టిన సుబ్బారావు పాణిగ్రాహి, ‘దొర ఎవడురా’ అంటూ నల్ల దొర తనాన్ని ప్రశ్నించిన గూడ అంజన్నలతో పాటూ ‘ఇదేనోయ్ నవ యుగం విప్లవ యుద్ధాల యుగం’ అంటూ పాడుతూ... 1974 మార్చి 12 (ఆదివారం) ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోని ఒక తరగతి గతి గదిలో అరుణోదయ ఆవిర్భావించింది.
1974 ఏప్రిల్ 14న జార్జిరెడ్డి వర్ధంతి సభలో అమరులు నీలం రామచంద్రయ్య, పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ప్రారంభమైన అరుణోదయ... చలపతిరావు నేతృత్వంలో పురుడు బోసుకుని నలభై ఏండ్లు కావస్తుంది. విప్లవ విద్యార్థి నాయకత్వం చొరవ, శ్రమ, కృషితో పట్టణ మధ్యతరగతి- యువకులతో ప్రారంభమై గ్రామాలను, జానపదాలను వెతు క్కుంటూ పయనం సాగించింది. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రక టించిన రోజున జరిగిన సామర్లకోట సభా కార్యక్రమం నాటికే అరుణోదయ సెంట్రల్ ట్రూపు వందల ప్రదర్శనలిచ్చింది. విశ్వ విద్యాలయాల నుండి బస్తీలకు, గ్రామాలకు సాగిన ఈ ప్రయా ణంపై రాజ్యం ఉక్కుపాదం మోపడంతో ఎమర్జెన్సీలో అరుణో దయ బాధ్యులు చలపతిరావు, ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజన్న, అరుణోదయకు బ్యానరు గీతం అందించిన కాశీపతి తదితరులు జైలుపాలయ్యారు. ప్రజా సాంస్కృతికోద్యమానికి ప్రాణం పోసిన నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లు బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు.
ఈ ఇద్దరు అమరులకు జోహార్ల గీతాలాపనతోనే నా ప్రజా సాంస్కృతికోద్యమ యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అరుదోదయ కీలక బాధ్యతలు నిర్వహించిన ప్పటికీ... రెండు వేర్వేరు రాష్ట్ర మహాసభలు నిర్వహించలేదు. అయితే నేడు ఉమ్మడి రాష్ట్ర మహా సభల్లో రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు కమిటీలకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసు కోవాలని అభిలషిస్తున్నాము. ఈ సభలకు అరుణోదయ పూర్వ సహచరులను, అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము.
నక్సల్బరీ వసంత మేఘ గర్జనలు విప్లవ ప్రత్యామ్నాయంగా రంగం మీదికి వచ్చి దేశ ప్రజలకు ఒక కొత్త దారిని ఆవిష్కరించిన అర్ధ శతాబ్దిలో తెలుగునేల సృష్టించిన సాహిత్యానికి, విప్లవ కళా రూపాలకు అంతు లేదనే చెప్పవచ్చును. దాదాపు వందకుపైగా దృశ్య, శ్రవణ సీడీలతో, వేల పాటలతో, వేలాది కళా ప్రదర్శనలతో వందలాది కళాకారులతో అరుణోదయ లక్షలాది ప్రజల గుండెలు తట్టింది. కోట్లాది ప్రజలపై ప్రభావం పడవేసింది. ఈ కాలంలో మూడు తరాలకు వారధిగా కానూరి వెంకటేశ్వరరావు, బుర్ర కథ కుల్లో నాజర్ వారసత్వంగా రామారావు, సీనియర్ కళాకారుడుగా సుంకులన్నను ఉద్యమం సృష్టించుకుంది. నాలాంటి ఎంతో మంది మహిళా కళాకారులను ప్రజలమధ్య సజీవంగా నిల బెట్టుకుంది. ఇదంతా విప్లవ ప్రజా ఉద్యమాల ఘనతతోపాటు అరుణోదయ కమిట్‌మెంట్, వందలాది జ్ఞాత-అజ్ఞాత కళాకారుల సమష్టి కృషి అన్నది మరువలేనిది.
అయితే దేశంలో సాంస్కృతిక సామ్రాజ్యవాదం, బ్రాహ్మ ణీయ కులోన్మాదం విశృంఖలంగా విస్తరిస్తున్నాయి. దేశవాళీ బహుళత్వాన్ని, ఆహార వైవిధ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అణచి వేస్తూ క్రూరంగా సవాలు చేస్తున్నాయి. మానవీయ సంబంధాల్ని, మనిషికి-మనిషికి ఉన్న ప్రజాస్వామ్య సంబంధ బాంధవ్యాల్ని వ్యాపార వినిమయ సంస్కృతితో పరిహాసం చేస్తున్నాయి. దేశ భక్తిని సరిహద్దుల్లో, అభివృద్ధిని ఆకాశహర్మ్యాల్లో చూపిస్తూ మాన వాభివృద్ధిని తొక్కి పెడుతున్నాయి. అందుకే విదేశీ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, దేశభక్తిని, ఫ్యూడల్ సంప్రదాయక వాదాల్ని ఓడించే ప్రజాస్వామ్యాన్ని, పితృస్వామ్యాన్ని అంతంజేసే స్త్రీ విము క్తిని కోరుతూ, కుల నిర్మూలన వాదాన్ని, ప్రాంతీయ ప్రజాస్వా మ్యాన్ని ఎండగడుతూ అరుణోదయ గళమెత్తి పాడుతుంది.
(అక్టోబర్ 23, 24 తేదీలలో జరిగే అరుణోదయ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల సంయుక్త మహాసభల సందర్భంగా)
విమలక్క
అధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు