Arunodaya Cultural Wing - CPI(ML-New Democracy)
-
వేయి గొంతుకల విమలక్క
ఒక గొంతుక అనేక గొంతుకలై నాలుగు దశాబ్దాలుగా ప్రజలపక్షం నిలవడం అపురూపం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసు కున్న పదేళ్ల తరువాత, విప్లవ కుటుం బంలో పుట్టిన విమల 1964లో అరుణ గానవనంలోకి ప్రవేశించింది. నలభై ఏళ్లుగా ఆగకుండా సాగుతున్న విప్లవ సాంస్కృతిక రంగంలో అజేయంగా నిలిచింది. కళాకారిణిగా ఉంటూ అరుణోదయ (ఏసీఎఫ్)కి నాయకత్వం వహిం చింది. జాతీయ స్థాయిలో తెలుగువారి చేవ చూపించిన మహి ళల్లో విమలక్క ఒక్కరే. దేశంలో వివిధ భాషా రాష్ట్రా లలో తన గళం వినిపించిన ఘనత ఆమెదే. రెండు దశాబ్దాలుగా తెలంగాణ కోసం తన పంచేంద్రియా లను ఆట, మాట, పాట, సంగీతం ఆహార్యంగా చేసింది. తనకి సంకెళ్లు వేసిననాడు గుండె చెదరలేదు. కార్యా లయాన్ని పోలీసులు ఆక్రమించి రోడ్డు మీద పడేసిననాడు వెరవలేదు. పాటలచెట్టుని నరికేశామనుకున్నారు. తాను, తన కళాకారులు రోజుకొక్క చోట తలదాచుకున్నారు. నిర్బంధా లలో సైతం అనేక రాగాలవేడి కాపు కుని చలికాచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అరెస్టు, నిర్బంధం అరుణోదయ విమలపైనే! కడుపులో బాధ ఎలా కాలి పోతుందో, విషాదాన్ని ఏ పేగు మూలన కుక్కి పెడుతుందో తెలి యదు. కానీ చిరునవ్వు ఆమె పెదా లని విడిచిపోలేని నేస్తం. మహిళా కళా కారిణులలో దేశం గర్వించే స్థాయి ఆమెది. సగం ఆకాశం కాదు. ఒకే ఒక్క విమలక్క. జనం చప్పట్లే ఆమెకు జేజేలు. విప్లవ సాంస్కృతికోద్య మంలో సుదీర్ఘంగా, నిలి చిన పాటల కొండకి అభి నందనలు. 16 సెప్టెంబర్ 2018 (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నలభై ఐదేళ్ల అరు ణోదయంలో విమలక్క విప్లవ ప్రస్థాన గానసభ’ కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో గద్దర్, అల్లం నారాయణ, జయధీర్ తిరుమలరావు, కె. రామ చంద్రమూర్తి, కె. శ్రీనివాస్, ప్రొ‘‘ ఎ. వినాయక్‌రెడ్డి తదితరులు పాల్గొం టారు. అందరికీ ఆహ్వానం. జయధీర్ తిరుమలరావు మొబైల్ : 99519 42242 -
అరుణోదయ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
ప్రభుత్వం కక్ష గట్టింది: విమలక్క హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని కోర్టు ఆదేశాల మేరకు పోలీ సులు ఖాళీ చేయించి ఇంటి యజమానికి అప్పగించారు. అరవింద్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో విమలక్క 2009 నుంచి అరుణోదయ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 2016 డిసెంబరులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి రూరల్ పోలీసులు ఓ కేసులో భీంభరత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి న సందర్భంగా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించి నిషేధిత వస్తువులు లభించాయం టూ సీజ్ చేశారు. కాగా, యజమాని ఆర్ఎస్ శాస్త్రి తమ ఇంటిని 2009లో కరియమ్మ అనే మహిళకు అద్దెకు ఇచ్చానని, అయితే తమ ఇంట్లో అరుణోదయ సంస్థ నిర్వహిస్తున్నట్టు 4 నెలల తర్వాత తెలిసిందన్నారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయమంటూ విజ్ఞప్తి చేస్తూ నే ఉన్నామన్నారు. చివరకు గత నెల 25న కోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిం దన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు... ఇంట్లో ఉన్న వస్తువులను అరుణోదయ సమాఖ్యకు, శాస్త్రికి ఇంటిని అప్పగించారు. నాలుగు గంటల హైడ్రామా... అరుణోదయ కార్యాలయాన్ని ఇంటి యజ మానికి అప్పగించే సందర్భంగా 4 గంటల పాటు హైడ్రామా నడిచింది. మాచారెడ్డి రూరల్ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసిన సమయంలో సాక్షి సంతకం తీసుకున్న అరుణోదయ సమాఖ్య నాయకుడు మోహన్ బైరాగితో అరవింద్నగర్కు చేరుకోగా, విషయం తెలిసిన విమలక్క, ఇతర కళాకారులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఆదేశాలు తమకు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఖాళీ చేయడానికి కనీసం వారం గడువైనా ఇవ్వాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమపై కక్షతో ఇంటిని ఖాళీ చేయిస్తున్నారన్నారు. దీంతో కోర్టు ఆదేశాలను పోలీసులు విమలక్కకు అందజేశారు. విద్యావేత్త చుక్కా రామయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్దన్ తదితరులు విమలక్కను కలసి పరిస్థితి తెలుసుకున్నారు. -
విమలక్క కేసు వాయిదా
హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేసు వాయిదా పడింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యాలయాన్ని ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా పోలీసులు సీజ్ చేయడాన్ని, తనపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందంటూ హైకోర్టులో విమలక్క పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. -
అరుణోదయ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కొడంగల్: అరుణోదయ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ విశ్వకర్మ కవులు, కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టఫ్ నాయకులు డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి విమలక్కను జైలులో పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రభుత్వం విమలక్క పాటకు భయపడి తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడి దారుల ఆస్తుల మీద విమలక్క దాడి చేసి వారి గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఇన్ని త్యాగాలు చేసిన విమలక్క మీద, తెలంగాణ గొంతకను అణచివేసేందుకు ప్రభుత్వం, పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, అరుణోదయ కార్యాలయాన్ని సీజ్ చేయడం ఎంతవరకు సమంజమంటూ వారు ప్రశ్నించారు. ఉద్యమంలో అరుణోదయ కళాకారుల ఆట-పాటలను మెచ్చుకున్న కేసీఆర్, ప్రస్తుతం అధికార మదంతో అణచివేసే ప్రయత్నాలను చేస్తుందని అన్నారు. అక్రమ కేసులకు పాల్పడితే ఉద్యమం ఎగిసిపడుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం అరుణోదయ కార్యాలయాన్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నలభై రెండు వసంతాల ‘అరుణోదయం’
సందర్భం ‘సాహిత్యానికి, కళలకూ అవసరమైన ముడి పదార్థాల గని ప్రజల జీవితమే’ అన్న చైనా విప్లవ కవి లూసన్ సూక్తి తెలుగు నేలమీద ప్రతిధ్వనిస్తోంది. అందుకే 42 వసంతాలుగా ప్రజల మధ్య జీవిస్తూ, శ్రామికుల జీవితాలతో, వారి పోరాటాలతో పెనవేసుకున్న అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 2016 అక్టోబర్ 23, 24 తేదీలలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాసభలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా అరుణోదయ పేరుతో విప్లవ సాంస్కృతిక ఉద్యమా నికి అంకురార్పణ చేసిన అపూర్వ పూర్వ సహచరులకు, సంస్థ ప్రతినిధులకు, సౌహార్ద్ర ప్రతినిధులకు, ప్రజాకవులు- కళాకారు లందరికీ మనఃపూర్వక విప్లవ స్వాగతం, సుస్వాగతం. అరుణోద యకు జవజీవాలందించిన నూతన్, రిక్కల సహదేవ్‌రెడ్డి, గుడ్డి బాబన్న, భాను, నాగన్న, కమల, బాబన్న, తోట మల్లేశం, పటాన్ చెర్వు రాములు తదితరులందరికీ విప్లవ జోహార్లు. ‘మాకొద్దీ తెల్ల దొరతనమన్న’ గరిమెళ్ల, కత్తీ కలం పట్టిన సుబ్బారావు పాణిగ్రాహి, ‘దొర ఎవడురా’ అంటూ నల్ల దొర తనాన్ని ప్రశ్నించిన గూడ అంజన్నలతో పాటూ ‘ఇదేనోయ్ నవ యుగం విప్లవ యుద్ధాల యుగం’ అంటూ పాడుతూ... 1974 మార్చి 12 (ఆదివారం) ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోని ఒక తరగతి గతి గదిలో అరుణోదయ ఆవిర్భావించింది. 1974 ఏప్రిల్ 14న జార్జిరెడ్డి వర్ధంతి సభలో అమరులు నీలం రామచంద్రయ్య, పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ప్రారంభమైన అరుణోదయ... చలపతిరావు నేతృత్వంలో పురుడు బోసుకుని నలభై ఏండ్లు కావస్తుంది. విప్లవ విద్యార్థి నాయకత్వం చొరవ, శ్రమ, కృషితో పట్టణ మధ్యతరగతి- యువకులతో ప్రారంభమై గ్రామాలను, జానపదాలను వెతు క్కుంటూ పయనం సాగించింది. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రక టించిన రోజున జరిగిన సామర్లకోట సభా కార్యక్రమం నాటికే అరుణోదయ సెంట్రల్ ట్రూపు వందల ప్రదర్శనలిచ్చింది. విశ్వ విద్యాలయాల నుండి బస్తీలకు, గ్రామాలకు సాగిన ఈ ప్రయా ణంపై రాజ్యం ఉక్కుపాదం మోపడంతో ఎమర్జెన్సీలో అరుణో దయ బాధ్యులు చలపతిరావు, ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజన్న, అరుణోదయకు బ్యానరు గీతం అందించిన కాశీపతి తదితరులు జైలుపాలయ్యారు. ప్రజా సాంస్కృతికోద్యమానికి ప్రాణం పోసిన నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లు బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారు. ఈ ఇద్దరు అమరులకు జోహార్ల గీతాలాపనతోనే నా ప్రజా సాంస్కృతికోద్యమ యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అరుదోదయ కీలక బాధ్యతలు నిర్వహించిన ప్పటికీ... రెండు వేర్వేరు రాష్ట్ర మహాసభలు నిర్వహించలేదు. అయితే నేడు ఉమ్మడి రాష్ట్ర మహా సభల్లో రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు కమిటీలకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసు కోవాలని అభిలషిస్తున్నాము. ఈ సభలకు అరుణోదయ పూర్వ సహచరులను, అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. నక్సల్బరీ వసంత మేఘ గర్జనలు విప్లవ ప్రత్యామ్నాయంగా రంగం మీదికి వచ్చి దేశ ప్రజలకు ఒక కొత్త దారిని ఆవిష్కరించిన అర్ధ శతాబ్దిలో తెలుగునేల సృష్టించిన సాహిత్యానికి, విప్లవ కళా రూపాలకు అంతు లేదనే చెప్పవచ్చును. దాదాపు వందకుపైగా దృశ్య, శ్రవణ సీడీలతో, వేల పాటలతో, వేలాది కళా ప్రదర్శనలతో వందలాది కళాకారులతో అరుణోదయ లక్షలాది ప్రజల గుండెలు తట్టింది. కోట్లాది ప్రజలపై ప్రభావం పడవేసింది. ఈ కాలంలో మూడు తరాలకు వారధిగా కానూరి వెంకటేశ్వరరావు, బుర్ర కథ కుల్లో నాజర్ వారసత్వంగా రామారావు, సీనియర్ కళాకారుడుగా సుంకులన్నను ఉద్యమం సృష్టించుకుంది. నాలాంటి ఎంతో మంది మహిళా కళాకారులను ప్రజలమధ్య సజీవంగా నిల బెట్టుకుంది. ఇదంతా విప్లవ ప్రజా ఉద్యమాల ఘనతతోపాటు అరుణోదయ కమిట్మెంట్, వందలాది జ్ఞాత-అజ్ఞాత కళాకారుల సమష్టి కృషి అన్నది మరువలేనిది. అయితే దేశంలో సాంస్కృతిక సామ్రాజ్యవాదం, బ్రాహ్మ ణీయ కులోన్మాదం విశృంఖలంగా విస్తరిస్తున్నాయి. దేశవాళీ బహుళత్వాన్ని, ఆహార వైవిధ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అణచి వేస్తూ క్రూరంగా సవాలు చేస్తున్నాయి. మానవీయ సంబంధాల్ని, మనిషికి-మనిషికి ఉన్న ప్రజాస్వామ్య సంబంధ బాంధవ్యాల్ని వ్యాపార వినిమయ సంస్కృతితో పరిహాసం చేస్తున్నాయి. దేశ భక్తిని సరిహద్దుల్లో, అభివృద్ధిని ఆకాశహర్మ్యాల్లో చూపిస్తూ మాన వాభివృద్ధిని తొక్కి పెడుతున్నాయి. అందుకే విదేశీ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, దేశభక్తిని, ఫ్యూడల్ సంప్రదాయక వాదాల్ని ఓడించే ప్రజాస్వామ్యాన్ని, పితృస్వామ్యాన్ని అంతంజేసే స్త్రీ విము క్తిని కోరుతూ, కుల నిర్మూలన వాదాన్ని, ప్రాంతీయ ప్రజాస్వా మ్యాన్ని ఎండగడుతూ అరుణోదయ గళమెత్తి పాడుతుంది. (అక్టోబర్ 23, 24 తేదీలలో జరిగే అరుణోదయ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల సంయుక్త మహాసభల సందర్భంగా) విమలక్క అధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు -
సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి
నల్లగొండ టౌన్ : చైనా అక్టోబర్ సాంస్కృతిక విప్లవానికి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, కళాప్రదర్శనలు నిర్వహించి భారత సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలని అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు పరకాల నాగన్న పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శ్రామిక భవన్లో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికవర్గ సాహిత్య, సాంస్కృతిక విప్లవంతో పాటు పల్లె సంస్కృతిని జానపద కళారూపాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయిక్రిష్ణ మాట్లాడుతూ సామ్రాజ్యవాద, ఫ్యూడల్ సాంస్కృతిక వ్యతిరేకంగా చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో అక్టోబర్ 1 నుంచి 7 వరకు సాంస్కృతిక పోరాటం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.గంగన్న, కె.సుబ్బారావు, చంద్రన్న, కోటకొండ కృష్ణ, ఉదయ్గిరి క్రిష్ణ, వెంకన్న, నిమ్మల రాంబాబు, చందు తదితరులు పాల్గొన్నారు. -
మూగవోయిన అంజన్న గళం
నివాళి కడు పేదరికంలో ఉన్నా గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అది తీవ్రమైన ఎండల కాలం. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీ ఎస్‌యూ) మొదటి మహాసభ తర్వాత అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మునుగోడ తాలుకా పల్లివెల గ్రామానికి నడచి వెళుతున్నాము. కాలినడ కన తిరగడం వల్ల అప్పటికే చాలామంది కళాకా రుల ఆరోగ్యం దెబ్బతింది. అయినా మొదటి అరు ణోదయ నాయకుడు పి. చలపతి రావు ఆధ్వ ర్యంలో, పట్టుదలతో కార్యక్రమాలు ఇస్తూ వెళు తున్నాం. ఇంతలో అల్లంత దూరాన మోరం కొడుతున్న ఒక రైతు, ‘‘ఊరు మనదిరా, వాడ మన దిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా..’’ ఇలా పాడుతు న్నంతట్లో గూడ అంజయ్య మమ్మల్నందరినీ ఆపి మకుటం ఉన్నదున్నట్లుగా తీసుకుని ‘‘దొర ఏందిరో, వాని జులుం ఏందిరో, నడుమ జాలిం కౌన్‌రే, ఇస్క్ జులుం క్యాహైరే’’ అని రాసి మిగతా భాగం పూర్తి చేసి ఆ రోజు రాత్రి పల్లివెల గ్రామంలో పాడితే వేలాది జనం ఆ పాటను వింటూ ఉర్రూతలూగారు. విప్లవ సాంస్కతికోద్యమంలో వచ్చిన మొదటి పాట అది. ఆ పాట ఇప్పటికీ, ఎప్పటికీ జనం గుండెల్లో మారుమోగుతూనే ఉంది. అనేక మంది ప్రజా కళాకారులకు జవం జీవం ఆ పాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలాది గ్రామాల్లో వేలాది సందర్భాల్లో ఆ పాట ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణలో అయితే ఆ పాట వినని, స్పందించని, ఆవేశం ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. మా సాంస్కృతిక ప్రస్థానంలో భాగంగా జూన్ 24, 1975న తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో కార్యక్రమం ఇచ్చాము. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో పీడీఎస్‌యూ నాయకుడు జంపాల ప్రసాద్, కె. లలిత, అనూరాధ, అంబిక, స్వర్ణలత, రామసత్తయ్య, ప్రసాదు, బీఏవీ శాండిల్య తదితరులు ఉన్నారు. జూన్ 25వ తేదీ కాకినాడ పట్టణంలో సినిమావీధిలో కార్యక్రమం. దోమాచారి, జనార్ధనరావు, కాశీపతి ఆ సభలో ఉపన్యాసకులు. అదే సమయంలో జోరున వర్షం కురుస్తోంది. తడుస్తున్న జనం ఒక్కరొక్కరుగా లేస్తున్నారు. ఆ సందర్భంలో గూడ అంజయ్య ఊరు మనదిరా అనే పాటను, నేను ఓ అమర కళా వేత్తలారా.. అనే పాటను గళమెత్తిపాడితే జనం అంత వర్షంలో కూడా కిక్కురుమనకుండా నిలబడి పాటలు విన్నారు. ఆనాటి విప్లవ పరిస్థితి, దానికి అనుగుణంగా పుట్టిన పాటలు జనాన్ని ఎంతగా చైతన్యం చేసి కదిలించాయో ఈ ఘటన తెలుపు తుంది. ఆ రోజు శివసాగర్ రాసిన ‘చెల్లీ చెంద్రమ్మా’ నృత్య రూపకాన్ని కూడా ప్రదర్శిం చాము. సీనియర్ కళాకారుడు, కవి గాయకులు కానూరి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రగతి’ కూచి పూడి యక్ష గానం తదితర కళా రూపాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. కాకినాడలో ప్రదర్శన 25 రాత్రి ముగిసింది. కళాకారులందరం ఒక విద్యార్థి నాయకుని రూంలో పడుకోబోతున్నాం. సరిగ్గా 12 గంటలకు జంపాల ప్రసాద్ వచ్చి ‘‘కామ్రేడ్స్! దేశంలో ఇప్పుడే ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ. ప్రతిపక్షాలను, విప్లవకారులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేస్తున్నారు. కామ్రేడ్ సోమచారిగారిని ఇప్పుడే అరెస్టు చేశారు. ఇక అరుణోదయ కార్యక్రమాలన్నీ వాయిదా పడినట్లే. కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తారు. జాగ్రత్తగా వెళ్లండి, తర్వాత కలుద్దాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో కాశీపతి, గూడ అంజయ్య, నేను తదితరులం రైల్లో హైదరాబాద్ బయల్దేరాం. దారిలోనే గూడ అంజయ్యను అరెస్టు చేసింది ప్రభుత్వం. కాశీపతి అనంతపూర్ వెళుతూ అరెస్ట య్యాడు. మిగతావాళ్లం తప్పించు కున్నాం. కామ్రేడ్ గూడ అంజయ్య జైల్లో ఉంటూనే అనేక పాటలు రాశాడు. ఉదాహరణకు ‘‘ఇగ ఎగబడుదామురో ఎములడ రాజన్న’’, ‘‘చుక్కలాంటి చుక్కా లో లక్షలాది చుక్కల్లో, ఏ చుక్క లున్నా వయ్యా శ్రీపాద శ్రీహరి’’, ‘‘నల్లగొండ జిల్ల ఇది విప్లవాల ఖిల్లా, ఎర్రై జండా, ఎగరాలి మల్లి మల్లి’’ లాంటి అనేక పాటలు రాశాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అరుణోదయ, పీడీఎస్‌యూలో కొనసా గాడు. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వ ఉద్యో గిగా మారాడు. అయినా తన కలానికి రాపిడి పెడుతూ నిన్నటి తెలంగాణ ఉద్యమంలో అంజన్న నిర్వహించిన పాత్ర మరువలేనిది. ‘‘అవ్వోనివా, నువ్వు అయ్యోనియా’’ లాంటి పాటలు రాసి, పాడి నూతన రాష్ట్ర ఆవిర్భావంలో తనవంతు బాధ్యత నిర్వర్తించాడు. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతం లోని దళిత కుటుంబంలో పుట్టిన అంజన్న ప్రపంచం గుర్తింపు కలిగిన కవి, గాయకుడిగా ఎది గిన తీరు ఎంతో ఆదర్శవంతమైనది. ఊరు మన దిరా, ఈ వాడ మనదిరా వంటి గొప్ప పాటలతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు విప్లవ సాహి త్యం అదించారు. పుడితే ఒక్కటి, చస్తే రెండు, రాజిగో ఓరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగో ఓరి రాజిగా అంటూ తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు నడిపించారు. కవిగా, రచ యితగా సాంస్కృతిక రంగ నాయకుడిగా జీవిత కాలం నిబద్ధతతో ప్రజాపక్షాన నిలిచిన అంజన్న జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయి. కుటుంబం మొత్తం కడు పేదరికంలో ఉన్నా, గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. మంచాన పడేవరకు కళాకారుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాడు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. గళానికి నా వందనం. తెలంగాణ ప్రజాగాయకుడు అంజన్నకు ఒక ప్రియ మిత్రు డుగా, అరుణోదయ కళాకారునిగా అశ్రు నయనా లతో జోహార్లు అర్పిస్తూ, అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అరుణోదయ రామారావు వ్యాసకర్త అరుణోదయ సాంస్కృతిక సంస్థ నాయకుడు మొబైల్ : 94907 58845 -
‘కరిగిపోయిన కర్పూరకళిక’
ఆవిష్కరణ కంపల్లె రవిచంద్రన్ ‘సావిత్రి’ పుస్తకావిష్కరణ సావిత్రి జయంతి సందర్భంగా రేపు గుంటూరులో జరగనుంది. అందులోంచి కొన్ని భాగాలు... (రచయిత ఫోన్: 9848720478) సావిత్రికి తన అందం మీద విపరీతమైన నమ్మకం, గర్వం కలగగానే ఎనలేని ఆత్మవిశ్వాసమొచ్చేసింది. అందరితోనూ సరదాగా ఉండడం నేర్చుకుంది. తమాషాగా అందరినీ ‘బావగారూ!’ అని సంబోధిస్తూ ఆటపట్టించేది. ‘అరుణోదయ నాట్యమండలి’ అనే నాటక సంస్థ ప్రదర్శించదలచిన నాటకాలలో నటించే అమ్మాయిల ఎంపిక కోసమని కొంగర జగ్గయ్య, సావిత్రి వాళ్ల యింటికి వచ్చిన సందర్భంలో ఆమె అతణ్ణి ‘బావగారు’ అని సంబోధించి, ఆయన కంగారు పడేలా చేసింది. డయానా కాంప్లెక్స్ (స్త్రీలలో అణిచి వేయబడిన వాంఛగా ఇది వుంటుంది. మాటలలోనూ, చేతలలోనూ పురుషుడై పోవాలనే కోరిక ఇది) కారణంగా పురుషులతో చనువుగా మెలిగే మధురవాణి మనస్తత్వాన్ని ‘శ్రీశ్రీ’ తన ‘మన గురజాడ’ గ్రంథంలో ‘అలస ప్రకృతి’ అని పేర్కొన్నాడు. దీనికితోడు మధురవాణి ఎక్స్ట్రావెర్టులా ప్రవర్తించే కారణాన, ఆమెకు దాపరికమనేది తెలీదు. లోకం పోకడ ఎఱుగని, తెలిసినా పట్టించుకోని భోళాతనం, మధురవాణి సొంతం. సావిత్రి కూడా మధురవాణి వలెనే వ్యక్తులతో తెగచనువుగా మెలిగేది. లౌకిక ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని తెలీని ‘అలస ప్రకృతి’ ఆమెది. విలేఖరులు ఆమెను యింటర్వ్యూ చేసేటప్పుడు, ఆమె తన గత జీవితాన్ని గురించి ఏమాత్రమూ దాపరికం లేకుండా చెప్పేది. ఈ అమాయకత్వం వల్ల, అనంతర కాలంలో సావిత్రి చాలా యిబ్బందుల్ని ఎదుర్కోవాల్సివచ్చింది కూడా. ఏ దగా ప్రపంచాన్నయితే మరచిపోవాలని సావిత్రి మద్యానికి అలవాటుపడి ఓ ‘మత్తుప్రపంచాన్ని’ సృష్టించుకుందో, అక్కడ దగా పడింది సావిత్రి. పరిశ్రమలో వేషాలు తగ్గినవాళ్లు, సావిత్రి వెంట ఉంటే తమ జీవితానికి దిగుల్లేదు అని లోలోపల అనుకుని దీపం పురుగుల్లా ఆమె చుట్టూ చేరారు. ముఖ్యంగా ‘సురభి’ బాలసరస్వతి సావిత్రిని పూర్తిగా మద్యానికి బానిసగా మార్చేసింది. తనకు కాలక్షేపమూ అవుతుంది. ఖర్చులేని పని. తన మద్యపాన కాంక్షకు సావిత్రిని ఎరగా వేసింది. సావిత్రి ఇప్పుడు పూర్తిగా మన ప్రపంచం నుండి విడివడిపోయింది. ఇది గమనించి చాలామంది చాలా మోసాలే చేశారు. -
అరుణోదయ వ్యవస్థాపకుడు ‘కానూరి’ కన్నుమూత
ఖమ్మం: ఓ కళా దిగ్గజం కన్నుమూసింది.. ఎమర్జన్సీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలంతో పోరాడిన యోధుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. ప్రజా కళాకారుడు, కళాదిగ్గజం, అరుణోదయ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో అనారోగ్యంతో మృతిచెందారు. 1916లో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కోడూరులో రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన భార్య దమయంతి ఇరవయ్యేళ్ల క్రితం మృతి చెందారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదర్శ కమ్యూనిస్టుగా, ప్రజా కళాకారుడిగా చివరిదాకా నిలిచిన కానూరి జీవితం ఆదర్శప్రాయం. గరికపాటి రాజారావు, సుబ్బారావు, పాణిగ్రహి కోవలో నడిచి నిలిచిన ప్రజా కళాకారుడు. అలాగే, చివరి వరకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలోనే జీవించారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుడు... తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుల్లో కానూరి ఒకరు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి రైతాంగ పోరాటాల ప్రేరణతో అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్యను స్థాపించారు. అప్పటినుంచి వ్యవస్థాపకులుగా, ప్రస్తుతం అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది క్యాంపులు నిర్వహించి వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి గోదావరిలోయ ప్రజాసాహిత్యం వరకు వ్యంగ్య రచయితగా పేరొందారు. కళ వాణిజ్య విలువలను అద్దుకుంటున్న వేళ.. ప్రజా కళాకారుడిగా కానూరి నిబద్ధతగా నిలబడ్డారు. స్వాతంత్య్ర యోధుల పెన్షన్‌ను నిరాకరించాడు. తన జీవితాంతం ప్రజా ఉద్యమాల చెంతనే నిలిచాడు. ప్రజాకళకే అంకితమయ్యారు. కొండపల్లి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శిగా ఉండగా, 5 తాలూకాలలో సాంసృ్కతిక, బుర్రకథల దళాలుండేవి. వీటిని కానూరి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆనాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో ప్రజానాట్యమండలిలో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 1945లో 20 ఏళ్ల వయసులో సంప్రదాయ కళారంగం నుంచి ప్రజానాట్యమండలిలోకి ప్రవేశించారు. అప్పటినుంచి నేటి వరకు ఆ కళారంగమే శ్వాసగా బతికారు. -
'అరుణోదయ సంస్థ' కానూరి కన్నుమూత
ఖమ్మం : తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కానూరి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు ఖమ్మంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘‘స్వచ్ఛభారత్ కాదు.. స్వేచ్ఛాభారత్ కావాలి’’
* అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క * అలరించిన కళాకారుల ప్రదర్శన * భారీ ర్యాలీలో పాల్గొన్న రైతు కూలీలు, సీపీఐ(ఎంఎల్) సానుభూతిపరులు పెద్దాపురం : స్వచ్ఛభారత్ కాదు.. ప్రజలు స్వేచ్ఛాభారత్‌ను కోరుకుంటున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమానికి ఆమె నాయకత్వం వహించారు. అంతకు ముందు ఆమె ముప్పన రామారావు కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన మార్కు జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణాలో నవతెలంగాణా కోసం ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం నిర్బంధ రాజ్యం నడుస్తోందన్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురానికి ఒక అభివృద్ధి పనికూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పెద్దాపురం పరిసరప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారి, చంద్రబాబు సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలన్నారు. ఎరుపెక్కిన పెద్దాపురం భారత విప్లవోద్యమ చరిత్రలో అసువులుబాసిన అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా పెద్దాపురం పట్ణణంలో ఎర్రదండు కదిలింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన రైతుకూలీలు, సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతి పరులతో పెద్దాపురం నిండిపోయింది. తొలుత ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు నాయకత్వం వహించారు. కొత్తపేటలో బహిరంగ సభ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. విప్లవోద్యమంలో అసువులు బాసిన సుమారు 6000 మందికిపైగా అమరులకు నివాళులర్పించారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ప్రజలను ఏవిధంగా వంచిస్తున్నాయో అరుణోదయ కళాకారులు పాటలరూపంలో ఆలపించారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజ్, మానవహక్కుల ఉద్యమనేత ముప్పాళ్ల సుబ్బారావు, కర్నాకుల వీరాంజనేయులు, పి.రమేష్ ప్రసంగించారు. -
వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగార్జున, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడు
అరుణోదయ మహాసభల్లో సతీష్‌చందర్ ఒంగోలు: ప్రజా సమస్యలను కళల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించి వారిని చైతన్యపరచడంలో కళాకారుడు కీలకపాత్ర పోషిస్తాడని సంపాదకుడు సతీష్‌చందర్ పేర్కొన్నారు. అలాంటి కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్లో జరిగిన ప్రతినిధుల సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. పది శాతం యువత సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ‘నమో’ జపం చేస్తుంటే దాని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తప్పితే పేద, శ్రామిక వర్గాల స్థితిగతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘ప్రజాకళలు-సాహిత్యం’ అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. రెండు రాష్ట్రాల కార్యవర్గాల ఎన్నిక: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణ కార్యవర్గాలను ఆదివారం ఒంగోలులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సిహెచ్.జాలన్న (ప్రకాశం), ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య (ప్రకాశం), ఉపాధ్యక్షుడిగా రామన్న (పశ్చిమగోదావరి), సహాయ కార్యదర్శిగా భీమశంకర్ (తూర్పుగోదావరి), కోశాధికారిగా ఎన్.సామ్రాజ్యం (గుంటూరు), మరో పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వేణు (హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా ఎ.నిర్మల (ఖమ్మం), సహాయ కార్యదర్శిగా వెంకన్న (నల్లగొండ), కోశాధికారిగా అశోక్ (కరీంనగర్), మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మరికొందరిని ఎన్నుకోవలసి ఉంది. -
అరుణోదయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఐదవ మహాసభలు పురస్కరించుకొని స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ నుంచి కళాకారులు మహా ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ నుంచి కలెక్టర్ బంగ్లారోడ్డు, చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండు మీదుగా మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా సభా వేదికైన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారులు ఉత్తేజం రేకెత్తించారు. గజ్జె కట్టడం, కోలాటం, గొంగడి నాట్యం, కాళ్లకు రింగులతో గారడీ నృత్యం, కోయ కళాకారుల విన్యాసాలు, డప్పు కళాకారులు, కాటి కాపరులు విశేషంగా ఆకట్టుకున్నారు. ముందు వరుసలో పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ రమాసుందరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ జాలన్న, ఎం. వేణు, అరుణోదయ అంజయ్య నుంచొని ఉత్సాహం నింపారు. కళా ప్రదర్శనలు భళా.. సభా వేదిక ఏర్పాటు చేసిన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లోని గాండ్ల వెంకట్రావు నగర్ (ప్రాంగణం)లో నిర్వహించిన కళాప్రదర్శనలను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు తిలకించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుబ్బారావు, పాణిగ్రాహి వారసుడు సుబ్బారావు బృందం ప్రదర్శించిన ‘జముకల కథ’ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం, మన్నేకల్లి గ్రామంలో జరిగిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలేనికి చెందిన గారడి బృందం ప్రదర్శన అలరించింది. ‘ఆడపిల్లవని బాధపడకూ’ అంటూ నేటి రోజుల్లో ఆడపిల్లల వెతలకు నృత్య రూపకం ఇచ్చారు. వరంగల్ జిల్లా కొత్తగూడెంకు చెందిన కోయ కళాకారులు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డప్పు దళం, అదే జిల్లాకు చెందినవారి కోలాటం, సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన బాలికల కోలాట ప్రదర్శనలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో’ విశేషంగా ఆకట్టుకుంది. నాటి నక్సల్బరి నుంచి నేటి గోదావరి పోరాటం వరకు జరిగిన పోరాటాల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ చేసిన ప్రదర్శన చలించేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన కళాకారుల నృత్య రూపకంలోని ‘బతుకమ్మ’ పండగలో సంధ్య కూడా జత కలిశారు. ప్రజా గాయకురాలు చైతన్య సమకాలీన అంశాలపై గీతం ఆలపించారు. సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గొరటి వెంకన్నలు ఆసక్తిగా తిలకించారు. -
‘అరుణోదయ’ మహాసభలకు సర్వం సిద్ధం
ప్రజాపోరాట, విప్లవ కళా సంస్కృతిని పాదుకొల్పే లక్ష్యంతో పురుడు పోసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు నగరం ముస్తాబైంది. 1980లో ఒంగోలులో మొదటి మహాసభలు నిర్వహించగా సరిగ్గా 34 ఏళ్ల తరువాత శనివారం మళ్లీ ఆ కళా వైభవం సాక్షాత్కరించనుంది. వెయ్యి మంది కళాకారులు గజ్జకట్టి ఆడి, గళమెత్తి పాడి తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. ఒంగోలు టౌన్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. 34 ఏళ్ల తర్వాత మరోసారి మహాసభలకు జిల్లా కేంద్రం వేదికైంది. శని, ఆదివారాల్లో మహాసభలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది కళాకారులు హాజరు కానున్నారు. మహాసభలను విజయవంతం చేసేందుకు కొన్ని రోజుల నుంచి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. విప్లవ కళా సంస్కృతులతో పురుడు బూర్జువా, భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతిని ధ్వంసం చేసి ప్రజాపోరాట సంస్కృతిని, విప్లవ కళా సంస్కృతులను నెలకొల్పాలనే లక్ష్యంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా పోరాటాలు పెల్లుబుకుతున్న 70వ దశకంలో ఉస్మానియా ఇంజినీరింగ్ విద్యార్థి జంపాల చంద్రశేఖరరావు చొరవతో 1974లో అరుణోదయ మొగ్గ తొడిగింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన సంస్థ కార్యకలాపాలు క్రమేణా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. 1980లో ఒంగోలులో ప్రథమ మహాసభ జరుపుకొని రాష్ట్ర స్థాయి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొంది. దేశంలో, రాష్ట్రంలో అనేక కళా సంస్థలు ఉన్నా చారిత్రక అవసరాల రీత్యా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. ప్రపంచ పురోగతి.. శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఉందని నమ్మింది. సకల సంపదలే కాకుండా సమస్త కళలు, సంస్కృతి శ్రమ నుంచే పుట్టాయని ఎరిగింది. ప్రజాకళారూపాలైన బుర్రకథ, హరికథ, జముకుల కథ, ఒగ్గుకథ, వీధి భాగోతం, నాటిక, నాటకం, నృత్యరూపకం తదితర ప్రజాకళారూపాలను ఆయుధంగా మలచుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వస్తోంది. గజ్జతో ఆడటం.. గళంతో పాడటం.. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గజ్జ కట్టి ఆడటం.. గళం విప్పి పాడటం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. కళ.. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కళల్ని ప్రజాపథం చేసిన గరికపాటి రాజారావు మొదలు, తన పెన్నూ గన్నూ పీడిత ప్రజల కోసం అంకితం చేసిన సుబ్బారావు పాణిగ్రాహి వరకు అనేక మంది కవులు, కళాకారులు చేసిన పోరాటాలు, త్యాగాలను కళారూపాల ద్వారా ప్రదర్శించి వారి ఆశయాలు, భవిష్యత్ పోరాటాలను మరింత పట్టుదలగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు తీసుకెళ్తోంది. నేడు కళాకారుల మహా ప్రదర్శన : తొలిరోజైన శనివారం ఒంగోలులో కళాకారుల మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. స్థానిక ఏబీఎం కాలేజీ నుంచి హెచ్‌సీఎం కాలేజీ వరకు మహా ప్రదర్శన జరగనుంది. అనంతరం హెచ్‌సీఎం కాలేజీ గ్రౌండ్‌లోని డాక్టర్ గాండ్ల వెంకట్రావు నగర్లో బహిరంగ సభ జరగనుంది. సభలో సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గోరేటి వెంకన్న, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు ప్రతినిధుల సభ స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్లో ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది. ప్రముఖ సంపాదకులు సతీష్‌చందర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచీకరణ, సాంస్కృతికోద్యమం గురించి ప్రముఖ కళాకారుడు, రచయిత శక్తి ప్రసంగించనున్నారు. విప్లవ సాంస్కృతికోద్యమంపై ప్రజా రచయిత, కవి ఎన్.తిర్మల్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల నూతన కా ర్యవర్గాలను ఎన్నుకోనున్నారు. -
30న ‘అరుణోదయ’ జిల్లా సదస్సు
నకిరేకల్, న్యూస్‌లైన్: ఈ నెల 30న నల్లగొండలోని టౌన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలం సంతోష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పల్స నిర్మల తెలిపారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం నకిరేకల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 30వ తేదీన ఉదయం 11 గంటలకు టౌన్‌హల్‌లో జిల్లా సదస్సు, సాయంత్రం 6 గంటలకు క్లాక్‌టవర్ తెలంగాణ చౌక్ వద్ద బహిరంగా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు జిల్లాలోని వివిధ రంగాల కళాకారులు 200 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర , జిల్లా కమిటీల నియామకం, భవిష్యత్ లక్ష్యా ల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విమలక్క, కవి,పరిశోధకుడు జయధీర్, తెలంగాణ జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మకంటి కొమరయ్య, పీడీఎస్‌యూ జిల్లా కన్వీనర్ ఆవుల నాగరాజు, జిల్లా నాయకులు యానాల లింగారెడ్డి, పల్సగిరి, బోడ్డు శంకర్, మిట్టా నర్సిరెడ్డి, రంగన్న, రామలింగయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.