వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగార్జున, అనిల్ తదితరులు పాల్గొన్నారు.