‘కరిగిపోయిన కర్పూరకళిక’
ఆవిష్కరణ
కంపల్లె రవిచంద్రన్ ‘సావిత్రి’ పుస్తకావిష్కరణ సావిత్రి జయంతి సందర్భంగా రేపు గుంటూరులో జరగనుంది. అందులోంచి కొన్ని భాగాలు... (రచయిత ఫోన్: 9848720478)
సావిత్రికి తన అందం మీద విపరీతమైన నమ్మకం, గర్వం కలగగానే ఎనలేని ఆత్మవిశ్వాసమొచ్చేసింది. అందరితోనూ సరదాగా ఉండడం నేర్చుకుంది. తమాషాగా అందరినీ ‘బావగారూ!’ అని సంబోధిస్తూ ఆటపట్టించేది. ‘అరుణోదయ నాట్యమండలి’ అనే నాటక సంస్థ ప్రదర్శించదలచిన నాటకాలలో నటించే అమ్మాయిల ఎంపిక కోసమని కొంగర జగ్గయ్య, సావిత్రి వాళ్ల యింటికి వచ్చిన సందర్భంలో ఆమె అతణ్ణి ‘బావగారు’ అని సంబోధించి, ఆయన కంగారు పడేలా చేసింది.
డయానా కాంప్లెక్స్ (స్త్రీలలో అణిచి వేయబడిన వాంఛగా ఇది వుంటుంది. మాటలలోనూ, చేతలలోనూ పురుషుడై పోవాలనే కోరిక ఇది) కారణంగా పురుషులతో చనువుగా మెలిగే మధురవాణి మనస్తత్వాన్ని ‘శ్రీశ్రీ’ తన ‘మన గురజాడ’ గ్రంథంలో ‘అలస ప్రకృతి’ అని పేర్కొన్నాడు. దీనికితోడు మధురవాణి ఎక్స్ట్రావెర్టులా ప్రవర్తించే కారణాన, ఆమెకు దాపరికమనేది తెలీదు. లోకం పోకడ ఎఱుగని, తెలిసినా పట్టించుకోని భోళాతనం, మధురవాణి సొంతం. సావిత్రి కూడా మధురవాణి వలెనే వ్యక్తులతో తెగచనువుగా మెలిగేది. లౌకిక ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని తెలీని ‘అలస ప్రకృతి’ ఆమెది. విలేఖరులు ఆమెను యింటర్వ్యూ చేసేటప్పుడు, ఆమె తన గత జీవితాన్ని గురించి ఏమాత్రమూ దాపరికం లేకుండా చెప్పేది. ఈ అమాయకత్వం వల్ల, అనంతర కాలంలో సావిత్రి చాలా యిబ్బందుల్ని ఎదుర్కోవాల్సివచ్చింది కూడా.
ఏ దగా ప్రపంచాన్నయితే మరచిపోవాలని సావిత్రి మద్యానికి అలవాటుపడి ఓ ‘మత్తుప్రపంచాన్ని’ సృష్టించుకుందో, అక్కడ దగా పడింది సావిత్రి. పరిశ్రమలో వేషాలు తగ్గినవాళ్లు, సావిత్రి వెంట ఉంటే తమ జీవితానికి దిగుల్లేదు అని లోలోపల అనుకుని దీపం పురుగుల్లా ఆమె చుట్టూ చేరారు. ముఖ్యంగా ‘సురభి’ బాలసరస్వతి సావిత్రిని పూర్తిగా మద్యానికి బానిసగా మార్చేసింది. తనకు కాలక్షేపమూ అవుతుంది. ఖర్చులేని పని. తన మద్యపాన కాంక్షకు సావిత్రిని ఎరగా వేసింది. సావిత్రి ఇప్పుడు పూర్తిగా మన ప్రపంచం నుండి విడివడిపోయింది. ఇది గమనించి చాలామంది చాలా మోసాలే చేశారు.