అరుణోదయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఐదవ మహాసభలు పురస్కరించుకొని స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ నుంచి కళాకారులు మహా ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ నుంచి కలెక్టర్ బంగ్లారోడ్డు, చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండు మీదుగా మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా సభా వేదికైన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారులు ఉత్తేజం రేకెత్తించారు.
గజ్జె కట్టడం, కోలాటం, గొంగడి నాట్యం, కాళ్లకు రింగులతో గారడీ నృత్యం, కోయ కళాకారుల విన్యాసాలు, డప్పు కళాకారులు, కాటి కాపరులు విశేషంగా ఆకట్టుకున్నారు. ముందు వరుసలో పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ రమాసుందరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ జాలన్న, ఎం. వేణు, అరుణోదయ అంజయ్య నుంచొని ఉత్సాహం నింపారు.
కళా ప్రదర్శనలు భళా..
సభా వేదిక ఏర్పాటు చేసిన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లోని గాండ్ల వెంకట్రావు నగర్ (ప్రాంగణం)లో నిర్వహించిన కళాప్రదర్శనలను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు తిలకించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుబ్బారావు, పాణిగ్రాహి వారసుడు సుబ్బారావు బృందం ప్రదర్శించిన ‘జముకల కథ’ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం, మన్నేకల్లి గ్రామంలో జరిగిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలేనికి చెందిన గారడి బృందం ప్రదర్శన అలరించింది.
‘ఆడపిల్లవని బాధపడకూ’ అంటూ నేటి రోజుల్లో ఆడపిల్లల వెతలకు నృత్య రూపకం ఇచ్చారు. వరంగల్ జిల్లా కొత్తగూడెంకు చెందిన కోయ కళాకారులు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డప్పు దళం, అదే జిల్లాకు చెందినవారి కోలాటం, సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన బాలికల కోలాట ప్రదర్శనలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో’ విశేషంగా ఆకట్టుకుంది.
నాటి నక్సల్‌బరి నుంచి నేటి గోదావరి పోరాటం వరకు జరిగిన పోరాటాల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ చేసిన ప్రదర్శన చలించేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన కళాకారుల నృత్య రూపకంలోని ‘బతుకమ్మ’ పండగలో సంధ్య కూడా జత కలిశారు. ప్రజా గాయకురాలు చైతన్య సమకాలీన అంశాలపై గీతం ఆలపించారు. సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గొరటి వెంకన్నలు ఆసక్తిగా తిలకించారు.