Art exhibitions
-
వినుడువినుడు 'విజయ'గాథ
విద్యలనగరం కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. సమాజంలోని రుగ్మతలను ప్రపంచానికి చాటిచెప్పేది.. సమకాలీన అంశాలను తమ ప్రదర్శనలతో ప్రజల మదిలో ముద్రించేది కళాకారులే. హాస్యభరితమైన ప్రదర్శనలతో ఓ వైపు ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సమాజాన్ని చైతన్యవంతం చేసే కళ వారి సొంతం. వేలాది ప్రదర్శనలతో జిల్లాకు పేరుతెచ్చిన కళాకారులు కరోనా మహమ్మారి వ్యాప్తితో మూడేళ్లుగా ప్రదర్శనలకు దూరమయ్యారు. విజయనగరం జిల్లాకు వన్నెతెచ్చిన బుర్రకథ కళా ప్రదర్శనలపై ప్రత్యేక కథనం విజయనగరం టౌన్: బుర్రకథ కళకు కేరాఫ్ విజయనగరం. ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. వినుడువినుడు మా విజయగాథ అంటూ బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, సారంగధర, సీతారామ కల్యాణం వంటి ఎన్నో అద్భుతమైన పురాణ కథలు, ఇతిహాసాలు, యుద్ధవీరుల గొప్పతనాన్ని హాస్యభరితంగా వివరించిన బుర్రకథ కళాకారులకు పుట్టినిల్లు మన విద్యలనగరం. సామాజిక రుగ్మతలపై ప్రజలను జాగృతం చేస్తూనే.. కథల్లోని నీతిని బోధించి ప్రజల మన్ననలు అందుకునేవారు. కుటుంబం మొత్తం కళల్లో ఆరితేరేందుకే ఇష్టపడేవారు. ఫలానా వంశం నుంచి వచ్చిన కళాకారుడని గొప్పలు చెప్పేవారు. ఆ కోవలోనే కుమ్మరి మాస్టారు బుర్రకథ అంటే తెలియని వారుండరు. రాఘవకుమార్, రొంగలి సత్యం వంటి వారెందరో జిల్లాలో కళలను ప్రోత్సహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన కళల్లో బుర్రకథదీ ప్రత్యేక స్థానం. నాజర్ బుర్రకథకు ఆద్యుడిగా పేరుగాంచారు. గ్రామాల్లో ఏ పండగ అయినా ఆ రోజు బుర్రకథ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు తప్పనిసరిగా ఉండేవి. కళాకారులు వేషం కట్టి స్టేజ్ ఎక్కి కథ చెబితే.. ప్రేక్షకుల చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేది. కళపై మక్కువతో... విజయనగరం మట్టిపై జన్మించిన వారందరికీ కళపైన మక్కువ ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి జిల్లాకు పేరుతెస్తున్నారు. పైడితల్లి అమ్మవారి పండగలో తొలేళ్ల ఉత్సవం రోజు కుమ్మరిమాస్టారి బుర్రకథ ఉండాల్సిందే. ఆయన చెప్పే హాస్య రసభరితమైన ప్రదర్శనను ప్రజలు ఆద్యంతం ఆస్వాదించాల్సిందే. ఆయన కథకోసమే ప్రజలు తొలేళ్లరోజు నాటికే జిల్లాకు తరలివచ్చేవారంటే ఆయన చెప్పే కథకు ఉన్న విశిష్టత అంతటి గొప్పది. అలాగే, బొబ్బిలి యుద్ధంలో కథకుడిగా రాఘవకుమార్, బాలనాగమ్మ బుర్రకథలో కథకుడు రొంగలి సత్యంలు చెప్పే కథలు ప్రజల్లో చైతన్యం నింపేవి. జిల్లాకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. ఆమె అసలుపేరు రెడ్డి విజయలక్ష్మి. బుర్రకథ ప్రదర్శనలో ఆమెకు ఆమేసాటి. జానపద గీతాలను ఆలపిస్తూ తన నృత్యంతో వాటికి ఆమె వన్నెతెచ్చారు. జయమ్మ, జిన్నాం లక్ష్మణరావు వంటి ఎంతోమంది కళాకారులు బుర్రకథ కళకు తమ ప్రదర్శనలతో జీవంపోశారు. నాడు బిజీ.. నేడు ఖాళీ.. కళను నమ్ముకుని ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు నెలకు 20 ప్రదర్శనలు ఇచ్చేవారు. కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు నెలకు కనీసం రెండు, మూడు ప్రదర్శనలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కళను బతికిద్దామన్న ఆకాంక్షకు కోవిడ్ అడ్డుతగులుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని... మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. నేను గత 20 ఏళ్లుగా విజయనగరంలోనే ఉంటున్నాను. బుర్రకథ దళంలో సభ్యురాలిగా ప్రదర్శనలిచ్చేదానిని. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేదికాదు. కరోనా మా కళాకారుల జీవితాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. నాటి మంచి రోజులు మళ్లీ రావాలని ఆశిస్తున్నాం. – ఎం.రాజేశ్వరి, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోవిడ్‌తో ఉపాధి కోల్పోయాం గతంలో నెలరోజులకు 25కి పైగా ప్రొగ్రామ్‌లు చేసిన రోజులున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఒక్కప్రొగ్రాం కూడా ఇవ్వలేని పరిస్థితి. మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాం. ఇళ్లకే పరిమితమయ్యాం. జనంలో కళలకు ఆదరణ తగ్గిపోతోంది. – గరివిడి లక్ష్మి, బుర్రకథ కళాకారిణి, గరివిడి నాట్యమండలితో ఆదరణ గతంలో జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు వివిధ ప్రొగ్రామ్‌లు కావాలని నాట్యమండలిని ఆశ్రయించేవారు. మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి కళాకారుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి కళాకారులను ఆదుకోవాలి. కళా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలి. – నెల్లూరు సంగీత్ కుమార్, ఆర్టిస్టు, నాట్యకళామండలి ప్రతినిధి, విజయనగరం -
వైభవ కాంతులు
-
వైభవ కాంతులు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరి సాంస్కృతిక వైభవంతో మురిసింది. పంద్రాగస్టు వేడుకలో భాగంగా గోల్కొండ కోటలో కళాకారులు వివిధ ప్రదర్శనలతో సందడి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, నగర కళా పేరి–బాజా, భాంగ్రా, రాజస్థానీ, దాండియా, కథక్, ముజ్రా వంటి 22 కళారూపాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. సిటీలోని పలు వారసత్వ కట్టడాలు విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నారుల దేశభక్తి కళా ప్రదర్శనలు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
ముత్యపుపందిరిలో నందగోపాలుడు
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై నవనీతచోరుడు నందగోపాలుడి రూపంలో శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పకు జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహన సేవను చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా అశేష భక్తజన గోవింద నామాల నడుమ ముత్యాలు పందిరి గా రూపొందించిన వాహనంలో నవనీత చోరుడు నందగోపాలుడి రూపంలో స్వామి ఆశీనులయ్యారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పురవీధుల్లో వైభవంగా ఊరేగారు. వాహన సేవలో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. అంతకు ముందు ఉదయం ఆలయ వీధుల్లో మలయప్ప ధ్యానముద్రలో యోగ నృసింహ రూపంలో భక్తులను కటాక్షించారు. యోగశాస్త్రంలో సింహం శీఘ్ర గమన శక్తికి నిదర్శనంగా భావిస్తారు. భవ బంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగసాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్ర రూపం ద్వారా స్వామి తెలియజేస్తాడు. భక్తుల గోవింద నామాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేద ఘోష మధ్య సింహ వాహన సేవ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాగింది. సాయంత్రం రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయల ఊగుతూ దర్శనమిచ్చారు. అనంతరం స్వామికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించారు. వాహనసేవలో టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షులు జగదీష్చంద్రశర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఆలయంలో తిరుమంజన వేడుక బ్రహ్మోత్సవాల్లో తొలి మూడు రోజులు ఆలయంలో తిరుమంజనం నిర్వహించటం ఆలయ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తిరుమంజనం వైభవంగా సాగింది. రంగనాయక మండపాన్ని పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. పెద్ద జీయర్, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. -
అరుణోదయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఐదవ మహాసభలు పురస్కరించుకొని స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ నుంచి కళాకారులు మహా ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ నుంచి కలెక్టర్ బంగ్లారోడ్డు, చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండు మీదుగా మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా సభా వేదికైన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారులు ఉత్తేజం రేకెత్తించారు. గజ్జె కట్టడం, కోలాటం, గొంగడి నాట్యం, కాళ్లకు రింగులతో గారడీ నృత్యం, కోయ కళాకారుల విన్యాసాలు, డప్పు కళాకారులు, కాటి కాపరులు విశేషంగా ఆకట్టుకున్నారు. ముందు వరుసలో పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ రమాసుందరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ జాలన్న, ఎం. వేణు, అరుణోదయ అంజయ్య నుంచొని ఉత్సాహం నింపారు. కళా ప్రదర్శనలు భళా.. సభా వేదిక ఏర్పాటు చేసిన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లోని గాండ్ల వెంకట్రావు నగర్ (ప్రాంగణం)లో నిర్వహించిన కళాప్రదర్శనలను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు తిలకించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుబ్బారావు, పాణిగ్రాహి వారసుడు సుబ్బారావు బృందం ప్రదర్శించిన ‘జముకల కథ’ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం, మన్నేకల్లి గ్రామంలో జరిగిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలేనికి చెందిన గారడి బృందం ప్రదర్శన అలరించింది. ‘ఆడపిల్లవని బాధపడకూ’ అంటూ నేటి రోజుల్లో ఆడపిల్లల వెతలకు నృత్య రూపకం ఇచ్చారు. వరంగల్ జిల్లా కొత్తగూడెంకు చెందిన కోయ కళాకారులు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డప్పు దళం, అదే జిల్లాకు చెందినవారి కోలాటం, సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన బాలికల కోలాట ప్రదర్శనలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో’ విశేషంగా ఆకట్టుకుంది. నాటి నక్సల్బరి నుంచి నేటి గోదావరి పోరాటం వరకు జరిగిన పోరాటాల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ చేసిన ప్రదర్శన చలించేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన కళాకారుల నృత్య రూపకంలోని ‘బతుకమ్మ’ పండగలో సంధ్య కూడా జత కలిశారు. ప్రజా గాయకురాలు చైతన్య సమకాలీన అంశాలపై గీతం ఆలపించారు. సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గొరటి వెంకన్నలు ఆసక్తిగా తిలకించారు. -
కుర్రకారు జోష్