బుర్రకథ చెబుతున్న కళాకారులు
విద్యలనగరం కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. సమాజంలోని రుగ్మతలను ప్రపంచానికి చాటిచెప్పేది.. సమకాలీన అంశాలను తమ ప్రదర్శనలతో ప్రజల మదిలో ముద్రించేది కళాకారులే. హాస్యభరితమైన ప్రదర్శనలతో ఓ వైపు ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సమాజాన్ని చైతన్యవంతం చేసే కళ వారి సొంతం. వేలాది ప్రదర్శనలతో జిల్లాకు పేరుతెచ్చిన కళాకారులు కరోనా మహమ్మారి వ్యాప్తితో మూడేళ్లుగా ప్రదర్శనలకు దూరమయ్యారు. విజయనగరం జిల్లాకు వన్నెతెచ్చిన బుర్రకథ కళా ప్రదర్శనలపై ప్రత్యేక కథనం
విజయనగరం టౌన్: బుర్రకథ కళకు కేరాఫ్ విజయనగరం. ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. వినుడువినుడు మా విజయగాథ అంటూ బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, సారంగధర, సీతారామ కల్యాణం వంటి ఎన్నో అద్భుతమైన పురాణ కథలు, ఇతిహాసాలు, యుద్ధవీరుల గొప్పతనాన్ని హాస్యభరితంగా వివరించిన బుర్రకథ కళాకారులకు పుట్టినిల్లు మన విద్యలనగరం. సామాజిక రుగ్మతలపై ప్రజలను జాగృతం చేస్తూనే.. కథల్లోని నీతిని బోధించి ప్రజల మన్ననలు అందుకునేవారు.
కుటుంబం మొత్తం కళల్లో ఆరితేరేందుకే ఇష్టపడేవారు. ఫలానా వంశం నుంచి వచ్చిన కళాకారుడని గొప్పలు చెప్పేవారు. ఆ కోవలోనే కుమ్మరి మాస్టారు బుర్రకథ అంటే తెలియని వారుండరు. రాఘవకుమార్, రొంగలి సత్యం వంటి వారెందరో జిల్లాలో కళలను ప్రోత్సహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన కళల్లో బుర్రకథదీ ప్రత్యేక స్థానం. నాజర్ బుర్రకథకు ఆద్యుడిగా పేరుగాంచారు. గ్రామాల్లో ఏ పండగ అయినా ఆ రోజు బుర్రకథ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు తప్పనిసరిగా ఉండేవి. కళాకారులు వేషం కట్టి స్టేజ్ ఎక్కి కథ చెబితే.. ప్రేక్షకుల చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేది.
కళపై మక్కువతో...
విజయనగరం మట్టిపై జన్మించిన వారందరికీ కళపైన మక్కువ ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి జిల్లాకు పేరుతెస్తున్నారు. పైడితల్లి అమ్మవారి పండగలో తొలేళ్ల ఉత్సవం రోజు కుమ్మరిమాస్టారి బుర్రకథ ఉండాల్సిందే. ఆయన చెప్పే హాస్య రసభరితమైన ప్రదర్శనను ప్రజలు ఆద్యంతం ఆస్వాదించాల్సిందే. ఆయన కథకోసమే ప్రజలు తొలేళ్లరోజు నాటికే జిల్లాకు తరలివచ్చేవారంటే ఆయన చెప్పే కథకు ఉన్న విశిష్టత అంతటి గొప్పది.
అలాగే, బొబ్బిలి యుద్ధంలో కథకుడిగా రాఘవకుమార్, బాలనాగమ్మ బుర్రకథలో కథకుడు రొంగలి సత్యంలు చెప్పే కథలు ప్రజల్లో చైతన్యం నింపేవి. జిల్లాకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. ఆమె అసలుపేరు రెడ్డి విజయలక్ష్మి. బుర్రకథ ప్రదర్శనలో ఆమెకు ఆమేసాటి. జానపద గీతాలను ఆలపిస్తూ తన నృత్యంతో వాటికి ఆమె వన్నెతెచ్చారు. జయమ్మ, జిన్నాం లక్ష్మణరావు వంటి ఎంతోమంది కళాకారులు బుర్రకథ కళకు తమ ప్రదర్శనలతో జీవంపోశారు.
నాడు బిజీ.. నేడు ఖాళీ..
కళను నమ్ముకుని ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు నెలకు 20 ప్రదర్శనలు ఇచ్చేవారు. కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు నెలకు కనీసం రెండు, మూడు ప్రదర్శనలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కళను బతికిద్దామన్న ఆకాంక్షకు కోవిడ్ అడ్డుతగులుతోందంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆ రోజులు మళ్లీ రావాలని...
మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. నేను గత 20 ఏళ్లుగా విజయనగరంలోనే ఉంటున్నాను. బుర్రకథ దళంలో సభ్యురాలిగా ప్రదర్శనలిచ్చేదానిని. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేదికాదు. కరోనా మా కళాకారుల జీవితాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. నాటి మంచి రోజులు మళ్లీ రావాలని
ఆశిస్తున్నాం.
– ఎం.రాజేశ్వరి, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు
కోవిడ్‌తో ఉపాధి కోల్పోయాం
గతంలో నెలరోజులకు 25కి పైగా ప్రొగ్రామ్‌లు చేసిన రోజులున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఒక్కప్రొగ్రాం కూడా ఇవ్వలేని పరిస్థితి. మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాం. ఇళ్లకే పరిమితమయ్యాం. జనంలో కళలకు ఆదరణ తగ్గిపోతోంది.
– గరివిడి లక్ష్మి, బుర్రకథ కళాకారిణి, గరివిడి
నాట్యమండలితో ఆదరణ
గతంలో జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు వివిధ ప్రొగ్రామ్‌లు కావాలని నాట్యమండలిని ఆశ్రయించేవారు. మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి కళాకారుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి కళాకారులను ఆదుకోవాలి. కళా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలి.
– నెల్లూరు సంగీత్ కుమార్, ఆర్టిస్టు, నాట్యకళామండలి ప్రతినిధి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment