వైభవ కాంతులు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరి సాంస్కృతిక వైభవంతో మురిసింది. పంద్రాగస్టు వేడుకలో భాగంగా గోల్కొండ కోటలో కళాకారులు వివిధ ప్రదర్శనలతో సందడి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, నగర కళా పేరి–బాజా, భాంగ్రా, రాజస్థానీ, దాండియా, కథక్, ముజ్రా వంటి 22 కళారూపాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. సిటీలోని పలు వారసత్వ కట్టడాలు విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నారుల దేశభక్తి కళా ప్రదర్శనలు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి.