ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి
ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో నాటి ఆంధ్రానాయకత్వ స్వార్థంతోపాటు, తెలంగాణ నాయకత్వం సోయిలేనితనం కారణంగానే రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం విద్యుత్, వ్యవసాయరంగంలో తెలంగాణకు ఉద్దేశపూరితంగా చేసిన ద్రోహాలు పసిగట్టంలో విఫలమైందన్నారు.
ఆ సమయంలో తెలంగాణ సమస్యలను కవులు, కళాకారులు సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలతో ఓ వైపు వ్యాప్తి చేయడం, మరోవైపు టీఆర్‌ఎస్ రాజకీయ ప్రక్రియ.. జమిలిగా సాగిన భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కవితల పుస్తకాలు కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో సాగిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్లలో కేసీఆర్ పాలన ఆదర్శవంతంగా సాగిందని గోరటి తనదైన సాహిత్య శైలిలో వివరించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment