ప్రసవం చేసిన నర్సుకు ఏడాది ఉచిత ప్రయాణం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి స్టాఫ్‌నర్సు సహాయంతో కండక్టర్ సుఖ ప్రసవం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న ఈ చిన్నారికి జీవితకాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
గద్వాల మండలంలోని కొండపల్లికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం రాఖీ పండుగ కోసం ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో మార్గమధ్యలోనే కండక్టర్ భారతి స్టాఫ్‌నర్సు అలివేలు సహాయంతో సుఖ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కండక్టర్ భారతి, స్టాఫ్‌నర్సు అలివేలు, బస్సు డ్రైవర్ అంజిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళకు ప్రసవం చేసేందుకు సహకరించిన స్టాఫ్‌నర్సు అలివేలుకు ఏడాదిపాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, సిబ్బంది మునిశేఖర్, కృష్ణకాంత్, శ్రీదేవి, జ్యోతి, గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment