అరుణోదయ వ్యవస్థాపకుడు ‘కానూరి’ కన్నుమూత
ఖమ్మం: ఓ కళా దిగ్గజం కన్నుమూసింది.. ఎమర్జన్సీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలంతో పోరాడిన యోధుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. ప్రజా కళాకారుడు, కళాదిగ్గజం, అరుణోదయ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో అనారోగ్యంతో మృతిచెందారు. 1916లో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కోడూరులో రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన భార్య దమయంతి ఇరవయ్యేళ్ల క్రితం మృతి చెందారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదర్శ కమ్యూనిస్టుగా, ప్రజా కళాకారుడిగా చివరిదాకా నిలిచిన కానూరి జీవితం ఆదర్శప్రాయం. గరికపాటి రాజారావు, సుబ్బారావు, పాణిగ్రహి కోవలో నడిచి నిలిచిన ప్రజా కళాకారుడు. అలాగే, చివరి వరకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలోనే జీవించారు.
ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుడు...
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుల్లో కానూరి ఒకరు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి రైతాంగ పోరాటాల ప్రేరణతో అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్యను స్థాపించారు. అప్పటినుంచి వ్యవస్థాపకులుగా, ప్రస్తుతం అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది క్యాంపులు నిర్వహించి వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి గోదావరిలోయ ప్రజాసాహిత్యం వరకు వ్యంగ్య రచయితగా పేరొందారు. కళ వాణిజ్య విలువలను అద్దుకుంటున్న వేళ.. ప్రజా కళాకారుడిగా కానూరి నిబద్ధతగా నిలబడ్డారు.
స్వాతంత్య్ర యోధుల పెన్షన్‌ను నిరాకరించాడు. తన జీవితాంతం ప్రజా ఉద్యమాల చెంతనే నిలిచాడు. ప్రజాకళకే అంకితమయ్యారు. కొండపల్లి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శిగా ఉండగా, 5 తాలూకాలలో సాంసృ్కతిక, బుర్రకథల దళాలుండేవి. వీటిని కానూరి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆనాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో ప్రజానాట్యమండలిలో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 1945లో 20 ఏళ్ల వయసులో సంప్రదాయ కళారంగం నుంచి ప్రజానాట్యమండలిలోకి ప్రవేశించారు. అప్పటినుంచి నేటి వరకు ఆ కళారంగమే శ్వాసగా బతికారు.