‘‘స్వచ్ఛభారత్ కాదు.. స్వేచ్ఛాభారత్ కావాలి’’
* అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
* అలరించిన కళాకారుల ప్రదర్శన
* భారీ ర్యాలీలో పాల్గొన్న రైతు కూలీలు, సీపీఐ(ఎంఎల్) సానుభూతిపరులు
పెద్దాపురం : స్వచ్ఛభారత్ కాదు.. ప్రజలు స్వేచ్ఛాభారత్‌ను కోరుకుంటున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమానికి ఆమె నాయకత్వం వహించారు. అంతకు ముందు ఆమె ముప్పన రామారావు కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన మార్కు జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తెలంగాణాలో నవతెలంగాణా కోసం ప్రజా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం నిర్బంధ రాజ్యం నడుస్తోందన్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురానికి ఒక అభివృద్ధి పనికూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పెద్దాపురం పరిసరప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారి, చంద్రబాబు సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలన్నారు.
ఎరుపెక్కిన పెద్దాపురం
భారత విప్లవోద్యమ చరిత్రలో అసువులుబాసిన అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా పెద్దాపురం పట్ణణంలో ఎర్రదండు కదిలింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన రైతుకూలీలు, సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతి పరులతో పెద్దాపురం నిండిపోయింది. తొలుత ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు నాయకత్వం వహించారు. కొత్తపేటలో బహిరంగ సభ నిర్వహించారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. విప్లవోద్యమంలో అసువులు బాసిన సుమారు 6000 మందికిపైగా అమరులకు నివాళులర్పించారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ప్రజలను ఏవిధంగా వంచిస్తున్నాయో అరుణోదయ కళాకారులు పాటలరూపంలో ఆలపించారు. ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజ్, మానవహక్కుల ఉద్యమనేత ముప్పాళ్ల సుబ్బారావు, కర్నాకుల వీరాంజనేయులు, పి.రమేష్ ప్రసంగించారు.