
ఫార్మా కంపెనీలతో పెను ముప్పు : విమలక్క
రంగారెడ్డి (కందుకూరు) : ఫార్మా కంపెనీలతో పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ సోమవారం కందుకూరులోని ముదిరాజ్ భవన్‌లో తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఏక పక్షంగా ఫార్మా కంపెనీల స్థాపనకు పూనుకోవడం బాధ్యతారహితమైన చర్యగా వ్యాఖ్యానించారు. బహుళ జాతి కంపెనీలకు భూముల్ని ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. చౌటుప్పల్, బొల్లారంలలో ఉన్నట్లుగా ఇక్కడా ఆ దుస్థితే తలెత్తే ప్రమాదముందని చెప్పారు. తాగునీరు, గాలి, పంట పొలాలు అన్నీ కలుషితమై జీవవైవిధ్యం దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లనుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం స్వలాభమే ధ్యేయంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.