
సర్కార్‌ను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులా?
ఎమర్జెన్సీలోనూ ఇలాంటి పరిస్థితి లేదు: విమలక్క
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న గొంతులను అణగదొక్కేందుకే వారిపై రాజద్రోహం కేసులను బనాయిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. నాటి సీమాంధ్ర పాలకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే నేటి తెలంగాణ పాలకులు ప్రజాసంఘాల నాయకుల్ని, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ ‘పౌర హక్కుల ప్రజా సంఘం’(పీయూసీఎల్) రాష్ట్ర 17వ మహాసభలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో పాటలతో ఉర్రూతలూగించిన అమర్, రాజేందర్‌లపై దేశద్రోహపు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఎమర్జెన్సీ, చీకటి రోజుల్లో కూడా ప్రజాసంఘాల కార్యాలయాల్ని మూసివేయలేదని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అరుణోదయ కార్యాలయం మూసివేతను నిరసిస్తూ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులతో కుట్రపన్ని మోడీ నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల, బీసీ ఉద్యమనేత సాంబశివరావు, ప్రొఫెసర్ చక్రధరరావు, కె.ప్రతాప్‌రెడ్డి, నజీర్‌ఖాన్, జ్యోతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.