
టఫ్ కార్యాలయం తెరిపించండి
హోంమంత్రి, డీజీపీలకు విమలక్క విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పోలీసులు సీజ్ చేసిన ‘తెలంగాణ యునై టెడ్ ఫోరం’ (టఫ్) కార్యాలయాన్ని తిరిగి తెరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ హామీ ఇచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క తెలిపారు. మానవ హక్కుల ఫోరం (హెచ్‌ఆర్‌ఎఫ్) కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు రాము తదితరులతో కలసి మంగళవారం ఆమె డీజీపీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కూడా కలిశామన్నారు. హోంమంత్రి సూచన మేరకు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించామని చెప్పారు.
తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, మంగళవారం సాయంత్రంగానీ, బుధవారం ఉదయంగానీ తెరిపి స్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎలాంటి సెర్చ్ వారెంట్, నోటీసులు లేకుండానే పోలీసులు హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న టఫ్ కార్యాలయంలో తనిఖీలు జరిపి, సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక ఘటన పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.