హామీలను విస్మరించిన సర్కార్
రాష్ట్రం వచ్చాక ఫారెస్టు అధికారులు రైతులపై పడ్డారు..
ఎక్కడికక్కడ భూములను ధ్వంసం చేస్తున్నారు
పులుమద్ది గ్రామాన్ని సందర్శించిన టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క
వికారాబాద్ రూరల్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మండిపడ్డారు. ఆదివారం మండల పరిధిలోని పులుమద్ది గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో కొన్నేళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడాన్ని విమలక్క తప్పుపట్టారు. బాధిత రైతులతో మాట్లాడి ఆమె వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. మూడు తరాలుగా ఇక్కడి దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు ఈ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫారెస్టు అధికారులు రైతులపై పడి ఎక్కడికక్కడ భూములను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో లభించే రాయినిబట్టి అక్కడ మైనింగ్ జరిపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. చాలా ఏళ్లుగా గ్రామంలోని 90 కుటుంబాలు 200 ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. అప్పటి నుంచి లేని అడ్డంకులు అధికారులకు ఇప్పుడెందుకని విమలక్క ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని సాగు భూమి, ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కాలువలు, బావులే రైతుల భూమి అనేందుకు సాక్ష్యం అని పేర్కొన్నారు.
చట్టాలు ఉన్నాయని ఫారెస్టు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేద ని విమలక్క హెచ్చరించారు. ఎన్నికలకు ముందుకు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచిపోయిందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం, ఉచిత విద్య వంటి హామీలేమయ్యాయని ఆమె సీఎంను ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. సర్కార్ వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని విమలక్క డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం దీక్షలు, ధర్నాలు చే స్తామని హెచ్చరించారు.
ఈ ప్రాంతంలోని గిరిజనుల భూములను లాక్కుంటే ఉద్యమిస్తామన్నారు. అంతకు ముందు తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు భీం భరత్, బాధిత రైతులు మాట్లాడుతూ.. జాయింట్ కలెక్టర్ ఈ నెల 28 వరకు సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులు ఈ భూ ములకు సంబంధించి పన్నులు కూడా చెల్లించారని గుర్తు చేశారు. గతంలో భూములు సాగుచేసుకునేందుకు తహసీల్దార్ కొందరు రైతులకు పట్టాలు కూడా ఇ చ్చారని చెప్పారు. కార్యక్రమంలో టఫ్ నాయకులు నారాయణ్‌దాస్, శ్రీనివాస్ ఉన్నారు.