సాక్షి, జనగామ: వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు పూర్తైందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉమ్మడి రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రజల సంక్షేమం అని భావించి వ్యవసాయానికి లాభం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు.
అత్యంత పొడవైన సొరంగ మార్గం గల శ్రీశైలం పాజెక్టును 30 సంవత్సరాలలో పూర్తి చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. సింగరేణికి 22 కిలోమీటర్ల భూసేకరణ చేసి విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం రాకుండా చేశామని తెలిపారు. అయినా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది పథకాల మీద కానీ ప్రచారం మీద కాదన్నారు.
రైతులకు లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ హామీయిచ్చి మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి, రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు పంట నష్టపోయారని, ఇంతవరకు నష్టపోయిన పంటలను మీ అధికారులైనా.. రైతు సమితి సభ్యులైనా సందర్శించారా అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పండిన పంటకు మద్దతు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధరపైన బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. కౌలు రైతులు, దేవాదాయ భూములు చేసే రైతులు మీ కళ్లకు కనిపించడం లేదా? వారికి కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment