సాక్షి, భూపాలపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందని, మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా ఉండేవి కానీ నేడు వాటిని గొప్పగా కీర్తించిన వ్యక్తి మోదీ అని తెలిపారు.
70 ఏళ్లుగా రైతుల పేరుతో ఓట్లు దండుకున్నారని, బీజేపీ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే, బీజేపీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభాలు వచ్చేలా చేసిందని తెలిపారు.
శ్రీరాముడుపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వంరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వం తన శాఖల పనితీరుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందిచాలని కోరారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment