నవ తెలంగాణ కోసం పోరాడాలి
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క
షాబాద్ : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మలో ఆమె పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణచివేయబడ్డాయని విమర్శించారు.
రోజురోజుకూ ఆదరణ కోల్పోయిన ఈ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. నవ తెలంగాణ కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదు లక్షల ఎకరాల భూములను పారిశ్రామికులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ముందుగా మైనింగ్ మాఫియా భూములను రద్దు చేయాలని హితవుపలికారు. ఫిరంగినాలాకు మరమ్మతులు చేపట్టాలని గతంలో చందనవెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సాగునీటి వనరులపై చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు భీంభరత్, జిల్లా కార్యదర్శి నారాయణదాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌బైరాగి, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచ్‌లు రాములుగౌడ్, లక్ష్మమ్మ, సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోచయ్య, సత్యనారాయణ, నాయకులు విశ్వ నాథం, శ్రీను, మహేశ్ పాల్గొన్నారు.