రామేశం మెట్టలో రాకాసి కోరలు
మైనింగ్ మాఫియా అడ్డగోలు వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు అడుగులు పడుతున్నాయి. ‘అనుమతి గోరంత.. తవ్వేది కొండంత’ చందంగా టీడీపీ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టేశారు. సంబంధితాధికారులు కూడా ప్రేక్షకపాత్ర వహించడంతో ఇష్టారాజ్యంగా కొండలు, గుట్టలు తవ్వేశారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొనేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ఇది మైనింగ్ మాఫియాకు మింగుడుపడడం లేదు. జిల్లా కలెక్టర్ మురళీ ధర్‌రెడ్డి గురువారం తీసుకున్న నిర్ణయాలు ఆ వర్గంలో భయం పుట్టిస్తోంది.
సాక్షి, కాకినాడ : జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మైనింగ్ శాఖ ఆదేశాల మేరకు తవ్వకాలు సాగించాల్సి ఉన్నా..నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఈ తంతు గత టీడీపీ ప్రభుత్వంలో ‘మూడు ట్రాక్టర్లు..ఆరు టిప్పర్లు’ రీతిలో యథేచ్ఛగా సాగిపోయింది. రామేశంమెట్టపై సర్వే నంబర్ 19లో 1983 నుంచి 1995 మధ్య 717 ఎకరాలను 534 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు ఎకరా 32 సెంట్ల వంతున అసైన్ చేశారు. అప్పట్లో ఈ భూములు జీడిమామిడి, మామిడి తోటలతో కళకళలాడేవి. అటువంటి కొండపై గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనింగ్ మాఫియా కన్నుపడింది. అంతే ఐదేళ్లపాటు నిట్టనిలువునా కొండను తవ్వేసి కోట్లు కొల్లగొట్టేశారు. చంద్రబాబు పాలనలో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నిమ్మకాయల చినరాజప్ప బినామీలు చెలరేగిపోయి కొండను పిండేశారు.
ఎస్సీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అప్పటి మంత్రి చినరాజప్ప అనుచరులు ఎకరానికి రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టి అదే ఎకరంలో గ్రావెల్ తవ్వేసి రూ.పాతిక లక్షల వరకూ వెనుకేసుకున్నారు. భూముల సాగుకు అనువుగా తీసుకువస్తామని నమ్మించిన ‘పచ్చ’ నేతలు ఎక్కడికక్కడ ఎర్రకొండలను కొల్లగొట్టి రెండు తాడిచెట్ల లోతున తవ్వేశారు. ఇదంతా మూడు నెలల కిందట ‘పచ్చ’ నేతల ఏలుబడిలో ఉన్నప్పటి మాట. ఇప్పుడు ప్రభుత్వం మారింది. జిల్లా అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా మారింది. ఈ తరహా అక్రమాలపై కొరడా ఝుళిపించడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
ఇందులో భాగంగా పెద్దాపురం మండలం రామేశంమెట్టలో జరుగుతున్న అక్రమాల తంతు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దృష్టికి రావడంతో హుటాహుటిన వెళ్లి పరిశీలించారు. అడ్డంగా తవ్వేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్న తీరును కళ్లారా చూసి ... అక్కడికక్కడే తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు. రామేశంమెట్టను సాగుభూమిగా మలిచేందుకు నడుంబిగించారు. తొలి ప్రయత్నంలో మెట్టలో మైనింగ్ తవ్వేసిన ప్రాంతంలో జీడిమామిడి, మామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ లక్ష్మీశతో కలిసి శ్రీకారం చుట్టారు. మైనింగ్, ఉద్యానవన, డ్రిప్ ఇరిగేషన్ తదితర శాఖలను సమన్వయంతో రామేశంమెట్టలో రాగల ఐదేళ్లలో పచ్చటి తివాచీ పరచాలనే ఆలోచనతో తొలి అడుగువేశారు.
సాగుకు యోగ్యంగా చేయాల్సిందే
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూమిలో ఇకపై మైనింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సిందేనంటూ కలెక్టర్ హుకుం జారీ చేశారు. లబ్ధిదారుడి అంగీకారంతోనే గ్రావెల్, మట్టి ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని, అందుకు ప్రతిఫలంగా భూ యజమానికి ఆ భూమిని సాగుకు యోగ్యంగా రూపుదిద్ది తిరిగి అప్పగించాలని, దాంతోపాటు ఆ భూమిలో పంటలు, పండ్ల తోటల సాగు నిమిత్తం ఉచితంగా బోరు, విద్యుత్తు సదుపాయం కల్పించాలని, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మైనింగ్‌కు అనుమతి ఇచ్చేది లేదని కలెక్టర్ నిబంధనలు విధించారు. ఐదెకరాలు ఒక యూనిట్‌గా రూ.2 లక్షలు వ్యయంతో బోర్ వేయించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇలా బోర్లు వేశాక వాటి నిర్వహణ, పంటల సాగు విషయంలో లబ్థిదారులతోపాటు మైనింగ్ చేసిన కంపెనీ కూడా సమాన బాధ్యత వహించేలా ప్రణాళికలకు మెరుగులు దిద్దుతున్నారు.
ఎకరాకు రూ.1.25 లక్షల ఈఎండీ...
ఎస్సీ, ఎస్టీ భూముల్లో మైనింగ్‌కు సిద్ధమయ్యే కంపెనీలు ఎకరానికి రూ.1.25 లక్షల ఈఎండీ ముందుగా చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించకపోతే మైనింగ్ అనుమతులు ఇవ్వరు. నిర్దేశించిన మొత్తం చెల్లించి, మట్టి తరలించడం పూర్తయిన అనంతరం భూమి సాగుకు యోగ్యంగా తయారు చేయకుండా వెళ్లిపోతే ఈఎండీ వెనక్కు ఇవ్వరు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మైనింగ్ కంపెనీ నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ బనాయించడానికి కూడా వెనుకాడేది లేదని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. తమ పని అయిపోందికదా? వెళ్లి పోదాం? ఏమీ కాదులే? అన్న ధోరణిలో ఉన్న వారికి కూడా ముకుతాడు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీల భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తరలించారని కేసును సుమోటోగా స్వీకరించడం ద్వారా ఆ కంపెనీ యజమానులు ఈ అంశంపై కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా చేయాలనే యోచనలో కసరత్తు చేస్తున్నారు.