పరిగి, న్యూస్‌లైన్: బహుజనుల తెలంగాణ కోసం ఉద్యమించాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ కో చైర్‌పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యార్థి జేఏసీ పరిగి నియోజకవర్గ చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విద్యార్థి రణభేరి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ ఆపేందుకు సీఎం కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, అవసరమైతే మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిగిలో వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, పాలమూరు ఎత్తిపోతల వెంటనే చేపట్టాలని, వికారాబాద్ నుంచి పరిగి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు.
మన భూములు, నీళ్లు, ఉద్యోగాలు కొల్లగొట్టిన వారిని తరిమికొట్టేందుకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. సీమాంధ్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓట్లడగటానికి వచ్చేవారిని గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కుళ్లుపట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చించకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ నాడు పరిగిలో చంద్రబాబును అడ్డుకున్న విద్యార్థులపై దాడులు చేసిన టీడీపీ నాయకులే నేడు తెలంగాణ సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. టీజీఓల సంఘం జిల్లా కార్యదర్శి హరిశ్చందర్ మాట్లాడుతూ అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేని రాజకీయాలతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మనం కోరుకోవాల్సింది ఇదేనని అన్నారు.
తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చెర్క సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య కోసం పోరాడుతామన్నారు. జిల్లా అభివృద్ధికి అవరోధంగా మారిన 111 జీఓను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బహుజనుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. జేఏసీ జిల్లా నాయకుడు ముజీబ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్‌మహ్మద్, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మునీర్, కో కన్వీనర్ సాయిరాంజీ, ఆయా నియోజకవర్గాల విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రణభేరి సభలో ఆరుణోదయ కళాకారులు ఉద్యమ గీతాల ఆటపాటలతో సభికులను ఉత్తేజపరిచారు.
పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి
Published Fri, Jan 3 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement