
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
- ఏపీ రాజధాని నిర్మాణంపై విమలక్క ఆరోపణ
- బహుళజాతి కంపెనీల కోసం పంట పొలాలు నాశనం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో జరుగుతోందని ప్రజాకళామండలి ఆరోపించింది. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంకోసం మూడు పంటలు పండే పొలాలను నాశనం చేస్తున్నారని, అక్రమంగా బాక్సైట్ తవ్వకాలను చేస్తున్నారని విమర్శించింది. దీనికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి నిర్భంధిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజాకళాకారుడు కోటిని మఫ్టీలో ఉన్న పోలీసులు గత శనివారం అరెస్టు చేశారన్నారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం అరుణోదయా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ప్రజా కళామండలి అధ్యక్షుడు జాన్ మాట్లాడారు. 2005లో ఐపీఎస్ అధికారి మహేష్ లడ్డాపై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో గుంటూరులో ప్రజా కళామండలి జిల్లా కమిటీ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న కోటిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. కోటిపై అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.