సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
విమలక్క పరామర్శ
ప్రణయ్ భార్య అమృతను, అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం కంటే గుణం గొప్పదన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనినైనా శాంతితో జయించాలి తప్ప ద్వేషంతో కాదని హితవు పలికారు. ప్రణయ్ కుటుంబానికి సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమికులను విడదీసి చంపే హక్కు ఎవరికి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment