సాక్షి, మిర్యాలగూడ: మారుతీరావు ఆత్మహత్య.. అనేక కారణాలను వెతుకుతుంది. అప్పట్లో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యాడు. మిర్యాలగూడలో తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మధ్యవర్తులను సైతం ఆమె వద్దకు పంపాడు. అయినా ఒప్పుకో ని అమృత మధ్యవర్తులతో పాటు మారుతీ రావుపై కూడా కేసు పెట్టింది. దాంతో మరోసారి జైలుకు వెళ్లాడు. కాగా ఎన్ని ఇబ్బందులు పడినా తన కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అంశం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ప్రణయ్ కేసు ఈనెల నుంచి జిల్లా కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. మూడు రోజుల పాటు వరుసగా కోర్టుకు వెళ్లిన మారుతీరావు మంచి న్యాయవాదిని పెట్టుకోవాలని భావించినట్లు తెలి సింది. అయినా ప్రణయ్ హత్య సంచలనం కలగడం వల్ల తనకు శిక్ష పడితే జైలులో చనిపోయే కంటే ముందే మరణించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు.
ఆస్తి వివాదమా... మనస్తాపమా?
ప్రణయ్ హత్య అనంతరం మారుతీరావుతో ఆయన తమ్ముడు శ్రవణ్‌కు ఆస్తి వివాదాలు వచ్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్యకు ముందే తన ఆస్తిలో తన తమ్ముడు శ్రవణ్ పేరున కొంత, మిగతా ట్రస్టుకు వీలునామా రాసినట్లు సమాచారం. కాగా హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత వీలునామాను మరోసారి మార్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో సంబంధం లేకున్నా తనపై కేసులు రావడం, జైలుకు వెళ్లడంపై శ్రవణ్ తన అన్న మారుతీరావుపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా మారుతీరావు స్పందించకుండా తన పని తాను చేసుకుంటుండగా కొంత కాలంగా ఇద్దరికి వివాదం కొనసాగుతుందని సమాచారం. ఆ క్రమంలోనే ఆస్తి విషయంలో మూడు నెలల క్రితం వీలునామాను తిరగరాసినట్లు తెలిసింది. రెండోసారి తిరగరాసిన వీలునామాలో శ్రవణ్ పేరు లేకుండా తన భార్య పేరున కొంత ఆస్తి, ట్రస్టుకు కొంత రాసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆస్తి వీలునామా తన ప్రాణాల మీదికి తెచ్చిందా? తన కూతురు తన వద్దకు రాలేదనే మనస్తాపమా? హత్య కేసులో శిక్ష పడుతుందనే ఆందోళనా? ప్రణయ్‌ని హత్య చేయించిన ప్రశ్చాత్తాపమా? అనే విషయాలు తేలాల్సి ఉంది.
సుపారీ గ్యాంగ్ వేధింపులు కూడా కారణమేనా?
ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో చేతులు కలిపిన మారుతీరావును ఆ గ్యాంగ్ సభ్యులు కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు సమాచారం. మారుతీరావుతో పాటు నిందితుల్లో ముఖ్యులుగా ఉన్న అస్గర్‌అలీ, అబ్దుల్‌భారీలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, ఇంకా అదనంగా ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల్లో ఏ 1 నిందితుడిగా మారుతీరావు ఉండగా ఏ 2 గా సుభాష్‌శర్మ, ఏ 3గా అస్గర్‌అలీ, ఏ 4గా అబ్దుల్ భారీ, ఏ 5గా ఎండీ. ఖరీం, ఏ 6గా తిరునగరు శ్రవణ్, ఏ 7గా శివ, ఏ 8గా నిజాం ఉన్నారు. (ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు)
Comments
Please login to add a commentAdd a comment