సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు నిన్నఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా)
గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు. మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున‍్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!)
కాగా సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటులో ఉన్న చేతి రాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వైపు ప్రణయ్ హత్యకేసు ట్రయల్‌కు రావడంతో మారుతీరావు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా కుటుంబంలో గొడవల కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. )
Comments
Please login to add a commentAdd a comment