నాన్న బండ్రు నర్సింహులుతో వ్యాసకర్త
బిడ్డల్ని భుజాన కూర్చోబెట్టుకుని జాతరలకు తీసుకుపోయి వారికి ప్రపంచాన్ని పరిచయం చేసే తండ్రులకు ఇక్కడ కొదవ లేదు! కానీ పసితనం నుండి వేలు పట్టుకుని విప్లవ ప్రపంచాన్ని చూపించి, నా గొంతులో విప్లవ గానాన్ని పదు నెక్కించి నడిపించిన మా తండ్రి కామ్రేడ్ బండ్రు నర్సింహులు 22 జనవరి 2022న భౌతిక జీవితం నుండి నిష్క్రమించాడు.
ఆయన కళ్ళతో విప్లవ విజయాన్ని, కనీసం నిజమైన కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతను చూడాలని కాంక్షించి, ఆత్రంగా ఎదురు చూశాడు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట సైనికుడిగా, పన్నెండేళ్ళు జైలు జీవితపు రాజకీయ ఖైదీగా, భూస్వాముల– గూండాల భౌతిక దాడులను ఎదిరించిన వీరుడిగా, వారి గుండెల్లో సింహ స్వప్నమైన నాయకుడిగా తన నూరేళ్ళపై బడ్డ జీవితంలో గర్వంగా తలెత్తుకుని అదే స్ఫూర్తితో వెళ్ళిపోయాడు. ప్రజల కోసం జీవించా లని ఆయన చెప్పిన మాటలే నాకు శాసనాల య్యాయి. సాహసంతో జీవించాలని బోధించిన నాన్నకు ప్రేమతో ప్రణమిల్లుతూ విప్లవాంజలి.
నూరేళ్ళుపై బడిన ఒక నిరక్షరాస్య కాపరిని ఒక వీరుడిగానే కాదు, గొప్ప చదువరిగా మార్చింది తెలంగాణ నేలతల్లి. ఐదుగురు సంతానం గల మా ఇంట్లో అందరికంటే చిన్న దాన్నయిన నాకు, ప్రజా కార్యకర్త అయిన మా నాన్నకు ఇంటి బాధ్యతలు ఏమీ లేవని చెప్ప వచ్చు. తమ విప్లవ వారసత్వం, కష్టాలు– కడగండ్లు తమ పిల్లలకు రావద్దన్న చాలా మంది ఆలోచనలకు భిన్నంగా నన్ను, మా చిన్నన్న భాస్కర్‌ను మా నాన్న ప్రజా ఉద్యమాల్లో పని చేయాలని ప్రోత్సహించాడు. ఆలేరు ప్రాంత ఉద్య మాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్న ఆలోచనతో మా అన్నయ్య ఉండేవాడు. ఆయన ద్వారానే నాకు కామ్రేడ్ అమర్ మొట్టమొదట పరోక్షంగా పరిచయ మయ్యాడు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న మా పెద్ద బావ కె.నిమ్మయ్య 1973 విద్యార్థి దశలోనే మా పెద్దక్క అరుణను ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే ఆహ్వనించాడు. మా చిన్నక్కయ్య పెళ్లి చేసుకుని తన కుటుంబాన్నే ఉద్యమ సానుభూతిపరులుగా మార్చుకుని 1997 మే 6న కేన్సర్‌తో కన్నుమూసింది. మా కుటుంబ సభ్యుల కారాగార వాసం, అంతకు మించిన రహస్య జీవితం, నిత్య పోరాట కార్యక్రమాలతో మా ఇళ్ళు విప్లవ కార్యాలయంగా మారినా... మా అమ్మ నర్సమ్మ – వదిన ఆండాళమ్మ ఇరువురు ఎంతో ఓపికతో కుటుంబాన్ని నడిపారు.
ఒంటరి మహిళ అయిన మా నానమ్మ కొమ రమ్మ అప్పు పేరిట భూమి కాజేయాలన్న షాహు కారు నారాయణ మోసానికి వ్యతిరేకంగా పోరా టం చేసి విజయం సాధించడమే మా నాన్నకు బాల్యంలో అందిన ప్రేరణ. నా బాల్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి ముషీరా బాద్ జైలువరకు మా అమ్మతో కల్సి చిన్నన్న నేను కాలినడకన పోతూ ములాఖత్ కల్సిరావడం కామ్రేడ్స్ వరవరరావు, కాశీపతి తదితరులు జైలులో పాటలు పాడించు కోవడం లాంటి అనుభూతులు నాతో కోకొల్లలుగా ఉన్నాయి. జైలు మా కుటుంబ జీవితంలో భాగ మైంది. మనం ఇతరులకు బోధించడం కాదు, ఉద్యమాన్నే మార్గంగా స్వీకరించాలని కుటుంబ సభ్యులను మా నాన్న ప్రోత్సహించాడు. వెనుక డుగు వేస్తే కూడా సహించేవాడు కాదు.
మా అమ్మను కూడా తనతో పాటు పని చేయమని దాదాపు బలవంత పెట్టినంత పని చేశాడని తన ఆత్మకథలో రాసి ఉంది. కుల–వర్గ దోపిడీ వ్యవస్థను అన్ని కోణాల నుండి తిప్పి కొట్టడానికి నన్నూ, మా అన్నయ్య భాస్కర్‌లను ప్రోత్సహిం చాడు. చివరికి కులాలు–సంప్రదాయాలు బద్దలు కొడ్తూ నేను అమర్‌ను, మా అన్నయ్య శోభారాణిని ఉద్యమంలోనే జీవిత సహచరులుగా ఎంచు కున్నాం. మా పిల్లలను కుల – మత అంతరాలు లేని హేతువాదులుగానే పెంచాం. శతాధిక వృద్ధుడిగా బండ్రు నిష్క్రమణ వేడుకనే గానీ, వేదన కాదనే మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. కానీ తండ్రిగా వేలు పట్టుకొని నడిపించడమేగాదు, పొరపాట్లేమైనా ఉంటే సుతిమెత్తగా విమర్శించి, సవరించే తండ్రి లేడన్న ఒకింత బాధ తప్ప!
– విమలక్క ‘ మొబైల్: 88868 41280
Comments
Please login to add a commentAdd a comment