‘కలెనేత’ ఆత్మకథ రచయిత్రి బల్ల సరస్వతమ్మ కన్నతల్లి ఊరూ, మా అమ్మమ్మ ఊరూ లద్దునూరే అని ఈ పుస్తకంతోనే తెలిసింది. ఆడవాళ్లుగా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలైనా వారి తల్లి ఊరి పేరు విన్నా, కన్నా చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ తమ మూలాలను గుర్తెరిగి ‘‘అమ్మా మనిద్దరి మాయిముంత లద్దునూర’’ని మాట్లాడుతుంటే సొంత అన్న లాగే మనసు పులకరించి పోయి వర్గ సంబంధాలు మరింత బలపడ్తుం టాయి. ఇప్పుడా మాయిముంత బల్ల సరస్వతమ్మను, నన్ను చుట్టేసి ఒకే కూరాడు దగ్గరకు చేర్చినట్లయింది.
తెలంగాణలో కూరాడు ఆడబిడ్డలకు చిహ్నం. మాతృస్వామ్య అవశేషాలకు చిహ్నంగా తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కుతున్న గౌరవ హోదా ఒకింత వర్గ సంబంధాలకు అతీతంగా కనబడ్తుంది. ఎక్కడా లేని విధంగా బతుకమ్మతో మన ఆత్మగౌరవం ఇనుమడింపజేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడబిడ్డల కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్నీ, సంస్కృతినీ ఏదో మేరకు తెలంగాణ పల్లె సీమలు నేటికీ ప్రతిబింబిస్తున్నాయి. వీటన్నిటి కలబోతగా ‘కలెనేత’కు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వత మ్మకు వేనవేల శణార్థులు. తమ విలువైన ముందుమాటలో ప్రముఖ రచయిత, నవలా కారుడు అల్లం రాజయ్య అన్నట్లు ‘‘అక్షర రూపం ఇస్తే తెలంగాణ సాయుధ పోరాట గ్రామాల్లో కొంచెం అటు ఇటుగా ప్రతి ఇంట్లోనూ ఇదే కథ పునరావృతమవుతుంది.’’
ఇటీవలే ఒకరోజు ప్రజా ఉద్యమాల్లో చిరకాల మిత్రులైన న్యాయవాద దంపతులు బల్ల రవీంద్రనాథ్, కోళ్ళ సావిత్రిలు ‘అరుణోదయ’ కార్యాలయానికి వచ్చి ‘కలెనేత’ పుస్తకావిష్కరణ సభకు నన్ను సాదరంగా ఆహ్వానించారు. బల్ల రవీందర్ తమ తల్లి ఊరు (అమ్మమ్మగారి ఊరు) లద్దునూరని చెప్పారు. ఇదే విషయం చెప్పి సరస్వతమ్మ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఏడుతరాల వాస్తవ జీవిత గాథకు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వతమ్మ నా దృష్టిలో ధన్యురాలు. చరిత్రను పాఠ్య గ్రంథాలకు అందకుండా సిలబస్ నుండే అంతర్థానం చేయాలన్న పంతం కొనసాగుతున్న కాలంలో జీవితగాథను చరిత్రగా, సహజ వైరుధ్యాల కలబోతగా అందించడం చాలా మందికి ప్రేరణ కలిగించి తీరుతుంది. 585 పేజీల సుదీర్ఘ గ్రంథం ఇది.
బల్ల రవీందర్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం... లద్దునూరులో మా అమ్మమ్మ బెడద సిద్ధమ్మ ఇల్లు, సరస్వతమ్మ తల్లిదండ్రులు పాశికంటి లక్ష్మమ్మ–రామదాసుల ఇల్లు దరిదాపుల్లోనే ఉండేవి. వారు బట్టలు నేసే పద్మశాలీలైతే, మా అమ్మమ్మ వాళ్లు గొంగళ్లు నేసేవారు.
అలనాటి జ్ఞాపకాలన్నింటినీ తట్టి లేపుతున్న సరస్వతమ్మ ‘కలెనేత’తో పెద్ద యజ్ఞమే చేసింది. కష్టాలు – కన్నీళ్ళ కలబోతగా, ఉద్యమాల తలబోతగా, అనుబంధాలు–అనుభవాల నెమరు వేతగా ‘కలెనేత’ ప్రాచుర్యం పొంది ప్రజల ఆదరణను చూర గొంటుందని నా గట్టి నమ్మకం.
గడిచిపోయిన 150 ఏళ్లలో జీవించిన ఏడు తరాలను తడిమిన ‘కలెనేత’ కల్పితం కాదు, వాస్తవ చరిత్ర. ‘కలెనేత’ లోకి తలదూర్చగానే మా అమ్మమ్మ ఇంట్లోని లోతు గిన్నెల్లో మీగడ పెరుగుతో గటక తిన్న అనుభూతి కలిగింది. ఇది తప్పక స్త్రీల సమాన హక్కుల పోరాటానికి తోడ్పాటునిస్తుందనీ, మానవ విలువలను ప్రజాస్వామీకరించడానికి దోహదపడ్తుందనీ ఆశిద్దాం. అటు సమాజంలోని, ఇటు కుటుంబంలోని అంతర్లీన ఆర్థిక–సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి ‘కలెనేత’ ఒక విస్తృత పాఠ్యగ్రంథంగా ఉపయోగపడి తీరుతుంది.
చిన్నతనంలో బలపాలు పోగొట్టుకోవడం నుండి, ప్రధానో పాధ్యాయులుగా బాధ్యతలు నిలబెట్టుకున్న బల్ల సరస్వతమ్మ జీవితం తల్లులకు... ముఖ్యంగా తెలంగాణ తల్లులకు ప్రతి బింబమై అట్టడుగున పడి ఉన్న మగువల చరిత్రను తట్టిలేపు తుంది.
విమలక్క
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త
(నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
బల్ల సరస్వతమ్మ ఆత్మకథ ‘కలెనేత’ ఆవిష్కరణ సందర్భంగా.)
Comments
Please login to add a commentAdd a comment