
నవ తెలంగాణ నిర్మాణానికి లడాయి తప్పదు
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కోచైర్మన్ విమలక్క
గోదావరిఖని:ఆగమైపోయిన బతుకులు బాగుపడినప్పుడే అసలైన తెలంగాణ వచ్చినట్టు అవుతుందని, ఇందుకోసం ప్రజలు లడాయి చేయక తప్పదని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్మన్ విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు పల్లె లింగయ్య రూపొందించిన ‘తల్లిరుణం’ పాటల సీడీ, ‘ఎర్ర సాల్లు’ అనే పాటల పుస్తకాన్ని గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆవిష్కరించారు.
అనంతరం విమలక్క మాట్లాడుతూ గుట్టలను మాయం చేస్తున్న వారు, ఇసుకను తరలించుకుపోతున్న వారు, ఆదివాసీలను ముప్పు తిప్పలు పెడుతున్న వారు మాఫియాలుగా మారి వారే పునర్నిర్మాణం అంటున్నారని, వారి నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కవులు, కళాకారులు నవ తెలంగాణ నిర్మాణంలో కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. తెలంగాణ జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజు, అరుణోదయ రాష్ట్ర నాయకుడు మోహన్, టఫ్ జిల్లా కన్వీనర్ బొల్లం లింగమూర్తి పాల్గొన్నారు.