చవితి పందిళ్లలో గీతాల దరువు
విమలక్క
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
పచ్చని చెట్లు... కలుషితం లేని హృదయాలు...
ఏ ఇంటికెళ్లినా ఆప్యాయత... ఎవరిని కదిలించినా మమత...
విభిన్న సంస్కృతుల వేదికై... భిన్నత్వంలోనూ ఏకమై...
నిఖార్సయిన మానవ విలువలకు నిలువెత్తు రూపం నాటి నగరం.
చిన్ననాడే విప్లవమార్గం పట్టి... ఉద్యమ గీతికలను వంటబట్టించుకుని... ప్రజా పోరాటాల వారధిగా మారిన ‘అరుణోదయ’ విమలక్కది
ఈ భాగ్యనగరితో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం. ఆ ‘జ్ఞాపకం’ సిటీ ప్లస్‌కు ప్రత్యేకం...
అది 1970... మా ఊరు నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి అమ్మతో కలసి హైదరాబాద్ వచ్చా. ఉప్పల్‌లో దిగి... అక్కడి నుంచి నడుచుకుంటూ చంచల్‌గూడ జైలుకు వెళ్లాం. నాన్న బండ్రు నర్సింహయ్యను కలిసేందుకు. నగరానికి రావడం అదే తొలిసారి. అంతా చెట్లు, చేమలు... అడవిలా ఉండేది. ఇక్కడికి మా ఊరు దాదాపు 75 కిలోమీటర్లు. అక్కడి నుంచి రైలు లేదంటే కట్టెల లారీల్లో ప్రయాణం. రైలేతే నో టికెట్. నాన్న కోసం వచ్చిపోతుండేవాళ్లం. తరువాత ముషీరాబాద్ జైలుకు వెళ్లేవాళ్లం. నగరం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. ఉప్పల్‌లో ఇరానీ హోటల్ ఉండేది. అందులో చాయ్ తాగుతుంటే... ఆ రుచే వేరు. అక్కడ ఆ పేరుతోనే బస్టాప్... ‘ఇరానీ చాయ్’.
చార్మినార్ మట్టి గాజులు
సిటీకి ఎప్పుడు వచ్చినా అంబర్‌పేట్‌లోని చిన్నాన్న ఇంట్లోనే బస. వారం పదిరోజులు ఉండేవాళ్లం. బేగంపేటలో షాపింగ్. చార్మినార్‌లో మట్టి గాజులు కొనుక్కునేదాన్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంగమ్’ థియేటర్‌లో సినిమాలు చూసేవాళ్లం. రామంతపూర్, పార్శీగుట్ట, రాంనగర్ బస్తీలే
నా ప్రపంచం. ఓయూతో అనుబంధం...
నా పదకొండో ఏట నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో ఎంతో అనుబంధం. నాకు ఇంతకంటే అద్భుతమైన, అందమైన విశ్వవిద్యాలయం కనిపించలేదు. అప్పట్లో నన్ను పిలిచి పాటలు పాడించుకొనేవారు. 1974లో ఓయూలోనే అరుణోదయ పురుడు పోసుకుంది. రామసత్తయ్య నాకు పాటలు నేర్పారు. బుర్రకథ నేర్చుకోవడానికి కానూరి వెంకటేశ్వరరావు తాతయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఇక వినాయక చవితి పందిళ్లను విప్లవగీతాలకు వేదికగా చేసుకొని గళం వినిపించేవాళ్లం.
నాటి పీడీఎస్‌యూ నాయకురాలు, ప్రొఫెసర్ లక్ష్మి రూమ్‌లో మకాం. దట్టమైన చింత చెట్లు. వాటి మధ్య నుంచి రాకపోకలు. ఎంత తిరిగినా అప్పట్లో భయమన్నది లేదు. ఇప్పుడు..! రోజుకు లెక్కలేనన్ని దారుణాలు, మహిళలపై అఘాయిత్యాలు. క్యాంపస్‌లో ఓ బడ్డీ ఉండేది. అందులో చాయ్, సమోసా, బాదం పాలు స్పెషల్. ముచ్చట్లకూ సెంటర్ అదే. క్యాంపస్ పార్కులో కూర్చుంటే ఎంతో ఆహ్లాదం.
బస్తీలే ప్రపంచం...
ఆలేరులో నా క్లాస్‌మేట్స్‌లో కొంతమంది ఇక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడూ కలుస్తుంటాం. నచ్చే ఫుడ్ అంటే... ఎక్కువగా బస్తీల్లోనే ఉండటం వల్ల అక్కడ వారు పెట్టిందే తినడం. ఎప్పుడన్నా హోటల్‌కు వెళితే బిర్యానీ ఆర్డర్ చేసేవాళ్లం. కానీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లో ఇప్పుడా టేస్ట్ లేదు.
ఇప్పుడెక్కడున్నాయి..!
నాటి మానవ సంబంధాలు కోల్పోని జనారణ్యం తెలుసు. కల్మషం లేని చిరునవ్వులు, ఆప్యాయత, అనుబంధాలూ చూశా. ఎవరింటికి వెళ్లినా ఎన్ని రోజులైనా ఉండగలిగే పరిస్థితి. సహజమైన, స్వచ్ఛమైన ప్రేమ, మమకారం. నేడు... నగరీకరణ నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న వందల గ్రామాలు, పల్లెలు, బస్తీలు విధ్వంసం అయ్యాయి. ప్రపంచీకరణ పేరుతో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఎవరింటికన్నా వెళితే... ఎప్పుడు పోతావని చూస్తున్నారు. నగరాన్ని పట్టిన కాలుష్యంలా... మనసులూ కలుషితమయ్యాయి. లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్నా... విశాలమైన భవనాల్లో ఉంటున్నా... మనసులు ఇరుకైపోయాయి. నాడు ఇరుకు గదుల్లో బతికినా హృదయాలు విశాలం. చావు- పుట్టుకలు సహజం. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న సమయంలో మనమేం చేస్తున్నామన్నది ముఖ్యం. పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోం. పోయేటప్పుడూ ఏమీ తీసుకుపోం. ఎప్పటికీ మిగిలేది మంచితనం, మానవత్వం. నేను కోరుకునేది ఒక్కటే... నాటి మమకారాలు, ప్రేమలు మళ్లీ ఈ మహానగరంలో చిగురించాలని.