Cultural Association
-
ఎడిసన్ లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం
-
ప్రతి ఏటా ఆస్కా అవార్డు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) తరపున ఇకపై ప్రతిఏటా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ కే సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులకు ఉగాది సంబరాల సమయంలో ఈ ఆస్కా అవార్డులు ప్రదానం చే స్తామని ఆయన చెప్పారు. ఆస్కా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆస్కా ఆవిర్భివించిన తరువాత అవార్డులను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమమని అన్నారు. తెలుగు, తమిళ ఉగాది వేడుకలను ఆస్కా హాలులో సంయుక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అవార్డుల ప్రదానోత్సవాలను రెండురోజులపాటు జరుపుతామని తెలిపారు. ఆస్కా అవార్డుల కార్యక్రమాలకు తమిళనాడులోని ముఖ్యంగా చెన్నై నగరంలోని అన్ని తెలుగు సంఘాలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఆస్కా వేరే సంస్థ కావచ్చు తెలుగువారంతా ఒక్కటేననే భావనతో అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నామని తెలిపారు. ఆస్కా అవార్డును ఒక ప్రతిష్టాత్మక అవార్డుగా తీర్చిదిద్దడంతోపాటు కమిటీలో ఎవరున్నా అవార్డుల ప్రదానం కొనసాగాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. రూము చార్జీలు భారీగా తగ్గింపు: ఆస్కా కొత్త పాలకవర్గం ఏర్పడి రెండున్నర మాసాలు పూర్తికాగా నెలరోజులు వర్షాలు, వరదలతోనే గడిచిపోయిందని తెలిపారు. అయితే ఆ లోటును భర్తీ చేసేలా కమిటీ సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్కాలోని రూము చార్జీల రేట్లను భారీగా తగ్గించాలని, రూములో దిగిన అతిథులకు మెరుగైన వసతులు కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు. ఆస్కా సభ్యుల కోసం డీలక్స్ రూము రూ.3వేల నుంచి రూ.2వేలు, ప్రెసిడెంట్ సూటు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గించామని తెలిపారు. అలాగే స్టాండర్డ్ రూము రూ.1200గా నిర్ణయించామని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి తగ్గించిన చార్జీలు అమల్లోకి వస్తాయని అన్నారు. వినోద, విహార, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన షిరిడీ పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక యాత్రకు నిర్ణయించామని తెలిపారు. ఆస్కా పనితీరును మరింత మెరుగుపరిచేలా అనేక విభాగాల్లో టెస్ట్న్ ్రసాగుతోందని తెలిపారు. ‘వచ్చేసింది మకర సంక్రాంతి-పోయింది వరదల భయభ్రాంతి-తెచ్చింది ఆనందాల క్రాంతి-జీవితాల్లో విరిసెనిక ప్రశాంతి’అంటూ ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి ఆసుకవిత్వాన్ని వినిపించారు. తెలుగు ప్రజలకు, ఆస్కా సభ్యులకు అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు రవీంద్రన్, సాంస్కృతిక కార్యదర్శి సాలూరు వాసూరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
రాజీకి ఆస్కారం
ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆస్కా పెద్దలు శనివారం నాటికి ఓ మోస్తరు చల్లబడ్డారు. పరస్పర అవగాహనతో అధ్యక్ష, కార్యదర్శులు రాజీపడే ఆస్కారం ఉన్నట్లు రాత్రి 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం తెలిసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)లో వారసత్వ కోటా కింద అనర్హులైన వ్యక్తులు ఆస్కా సభ్యులుగా చేరిపోయారనే ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ పద్ధతిలో సభ్యులుగా చేరిన వారిలో 139 మందిని కార్యదర్శి వీరయ్య అనర్హులుగా తేల్చి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపారు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య అగ్గిరాజేసింది. గురు, శుక్రవారాల నాటికి పరస్పరం నోటీసులు, హెచ్చరికల స్థాయికి చేరుకుంది. శని, ఆదివారాల్లో ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు అధ్యక్షులు ఆదిశేషయ్య సిద్దమయ్యారు. ఆస్కాలో ఉద్రిక్తత: ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు అధ్యక్షులు ఆదిశేషయ్య శనివారం సమావేశం కాబోతున్నట్లు ప్రచారం కావడంతో ఆస్కా ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో సభ్యులు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి సైతం కొందరు సభ్యులు వచ్చి ఘర్షణలకు, భౌతిక దాడులకు సిద్ధమయ్యారు. దీంతో ఆస్కా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిశేషయ్య తన మద్దతుదారులతో ఆస్కా కమిటీ చాంబర్లో సమావేశమయ్యారు. ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రద్దు ప్రతిపాదనను విరమించుకుని సామరస్య ధోరణిలో సమస్యను పరిష్కరించాలని కొందరిచ్చిన సలహాపై ప్రారంభించిన చర్చలు రాత్రి వరకు సాగదీశారు. తొలగింపు జాబితాలో చేరిన 139 మంది సభ్యులకు, అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తూ జారీచేసిన నోటీసులను కార్యదర్శి వీరయ్య ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. తనకిచ్చిన నోటీసును 24 గంటల్లోగా నోటీసును ఉపసంహరించకుంటే ఆస్కా పాలకవర్గాన్ని రద్దుచేస్తానని ఇచ్చిన నోటీసును అధ్యక్షులు ఉపసంహరించాలని ప్రతిపాదన వచ్చింది. ఇరువర్గాలు పట్టుదలకు పోకుండా సామరస్య ధోరణితో వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా కార్యదర్శి వీరయ్య వర్గం సభ్యులు ఆస్కా వైపు వెళ్లలేదు. ఘంటసాల రత్నకుమార్‌పై దాడి: ఆస్కా గొడవల నేపధ్యంలో ఆస్కా సాంస్కృతిక కా ర్యదర్శి ఘంటసాల రత్నకుమార్‌పై శని వారం స్వల్పంగా దాడి జరిగినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఆదిశేషయ్య బృందం కమిటీ చాంబర్లో చర్చలు జరుపుతున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు. అర్హత లేని వారంతా కమిటీ చాంబర్లో కూర్చోవడం ఏమిటని ఘంటసాల నిలదీశారు. వీరయ్య వర్గంగా భావిస్తున్న ఘంటసాలపై అధ్యక్షుని మద్దతు దారులు విరుచుకుపడ్డారు. తామంతా ఓటేస్తేనే కార్యదర్శిహోదా లభించిందని వ్యాఖ్యానిస్తూ చేయిపట్టుకుని తోసివే సినట్లు తెలిసింది. పరిస్థితి అదుపుతప్పేలోగా ఘంటసాల ఆస్కా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. -
చవితి పందిళ్లలో గీతాల దరువు
విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పచ్చని చెట్లు... కలుషితం లేని హృదయాలు... ఏ ఇంటికెళ్లినా ఆప్యాయత... ఎవరిని కదిలించినా మమత... విభిన్న సంస్కృతుల వేదికై... భిన్నత్వంలోనూ ఏకమై... నిఖార్సయిన మానవ విలువలకు నిలువెత్తు రూపం నాటి నగరం. చిన్ననాడే విప్లవమార్గం పట్టి... ఉద్యమ గీతికలను వంటబట్టించుకుని... ప్రజా పోరాటాల వారధిగా మారిన ‘అరుణోదయ’ విమలక్కది ఈ భాగ్యనగరితో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం. ఆ ‘జ్ఞాపకం’ సిటీ ప్లస్‌కు ప్రత్యేకం... అది 1970... మా ఊరు నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి అమ్మతో కలసి హైదరాబాద్ వచ్చా. ఉప్పల్‌లో దిగి... అక్కడి నుంచి నడుచుకుంటూ చంచల్‌గూడ జైలుకు వెళ్లాం. నాన్న బండ్రు నర్సింహయ్యను కలిసేందుకు. నగరానికి రావడం అదే తొలిసారి. అంతా చెట్లు, చేమలు... అడవిలా ఉండేది. ఇక్కడికి మా ఊరు దాదాపు 75 కిలోమీటర్లు. అక్కడి నుంచి రైలు లేదంటే కట్టెల లారీల్లో ప్రయాణం. రైలేతే నో టికెట్. నాన్న కోసం వచ్చిపోతుండేవాళ్లం. తరువాత ముషీరాబాద్ జైలుకు వెళ్లేవాళ్లం. నగరం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. ఉప్పల్‌లో ఇరానీ హోటల్ ఉండేది. అందులో చాయ్ తాగుతుంటే... ఆ రుచే వేరు. అక్కడ ఆ పేరుతోనే బస్టాప్... ‘ఇరానీ చాయ్’. చార్మినార్ మట్టి గాజులు సిటీకి ఎప్పుడు వచ్చినా అంబర్‌పేట్‌లోని చిన్నాన్న ఇంట్లోనే బస. వారం పదిరోజులు ఉండేవాళ్లం. బేగంపేటలో షాపింగ్. చార్మినార్‌లో మట్టి గాజులు కొనుక్కునేదాన్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంగమ్’ థియేటర్లో సినిమాలు చూసేవాళ్లం. రామంతపూర్, పార్శీగుట్ట, రాంనగర్ బస్తీలే నా ప్రపంచం. ఓయూతో అనుబంధం... నా పదకొండో ఏట నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో ఎంతో అనుబంధం. నాకు ఇంతకంటే అద్భుతమైన, అందమైన విశ్వవిద్యాలయం కనిపించలేదు. అప్పట్లో నన్ను పిలిచి పాటలు పాడించుకొనేవారు. 1974లో ఓయూలోనే అరుణోదయ పురుడు పోసుకుంది. రామసత్తయ్య నాకు పాటలు నేర్పారు. బుర్రకథ నేర్చుకోవడానికి కానూరి వెంకటేశ్వరరావు తాతయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఇక వినాయక చవితి పందిళ్లను విప్లవగీతాలకు వేదికగా చేసుకొని గళం వినిపించేవాళ్లం. నాటి పీడీఎస్‌యూ నాయకురాలు, ప్రొఫెసర్ లక్ష్మి రూమ్‌లో మకాం. దట్టమైన చింత చెట్లు. వాటి మధ్య నుంచి రాకపోకలు. ఎంత తిరిగినా అప్పట్లో భయమన్నది లేదు. ఇప్పుడు..! రోజుకు లెక్కలేనన్ని దారుణాలు, మహిళలపై అఘాయిత్యాలు. క్యాంపస్‌లో ఓ బడ్డీ ఉండేది. అందులో చాయ్, సమోసా, బాదం పాలు స్పెషల్. ముచ్చట్లకూ సెంటర్ అదే. క్యాంపస్ పార్కులో కూర్చుంటే ఎంతో ఆహ్లాదం. బస్తీలే ప్రపంచం... ఆలేరులో నా క్లాస్‌మేట్స్‌లో కొంతమంది ఇక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడూ కలుస్తుంటాం. నచ్చే ఫుడ్ అంటే... ఎక్కువగా బస్తీల్లోనే ఉండటం వల్ల అక్కడ వారు పెట్టిందే తినడం. ఎప్పుడన్నా హోటల్‌కు వెళితే బిర్యానీ ఆర్డర్ చేసేవాళ్లం. కానీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లో ఇప్పుడా టేస్ట్ లేదు. ఇప్పుడెక్కడున్నాయి..! నాటి మానవ సంబంధాలు కోల్పోని జనారణ్యం తెలుసు. కల్మషం లేని చిరునవ్వులు, ఆప్యాయత, అనుబంధాలూ చూశా. ఎవరింటికి వెళ్లినా ఎన్ని రోజులైనా ఉండగలిగే పరిస్థితి. సహజమైన, స్వచ్ఛమైన ప్రేమ, మమకారం. నేడు... నగరీకరణ నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న వందల గ్రామాలు, పల్లెలు, బస్తీలు విధ్వంసం అయ్యాయి. ప్రపంచీకరణ పేరుతో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఎవరింటికన్నా వెళితే... ఎప్పుడు పోతావని చూస్తున్నారు. నగరాన్ని పట్టిన కాలుష్యంలా... మనసులూ కలుషితమయ్యాయి. లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్నా... విశాలమైన భవనాల్లో ఉంటున్నా... మనసులు ఇరుకైపోయాయి. నాడు ఇరుకు గదుల్లో బతికినా హృదయాలు విశాలం. చావు- పుట్టుకలు సహజం. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న సమయంలో మనమేం చేస్తున్నామన్నది ముఖ్యం. పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోం. పోయేటప్పుడూ ఏమీ తీసుకుపోం. ఎప్పటికీ మిగిలేది మంచితనం, మానవత్వం. నేను కోరుకునేది ఒక్కటే... నాటి మమకారాలు, ప్రేమలు మళ్లీ ఈ మహానగరంలో చిగురించాలని.