ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆస్కా పెద్దలు
శనివారం నాటికి ఓ మోస్తరు చల్లబడ్డారు.
పరస్పర అవగాహనతో అధ్యక్ష, కార్యదర్శులు
రాజీపడే ఆస్కారం ఉన్నట్లు రాత్రి 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం తెలిసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)లో వారసత్వ కోటా కింద అనర్హులైన వ్యక్తులు ఆస్కా సభ్యులుగా చేరిపోయారనే ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ పద్ధతిలో సభ్యులుగా చేరిన వారిలో 139 మందిని కార్యదర్శి వీరయ్య అనర్హులుగా తేల్చి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపారు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య అగ్గిరాజేసింది. గురు, శుక్రవారాల నాటికి పరస్పరం నోటీసులు, హెచ్చరికల స్థాయికి చేరుకుంది. శని, ఆదివారాల్లో ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు అధ్యక్షులు ఆదిశేషయ్య సిద్దమయ్యారు.
ఆస్కాలో ఉద్రిక్తత:
ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు అధ్యక్షులు ఆదిశేషయ్య శనివారం సమావేశం కాబోతున్నట్లు ప్రచారం కావడంతో ఆస్కా ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో సభ్యులు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి సైతం కొందరు సభ్యులు వచ్చి ఘర్షణలకు, భౌతిక దాడులకు సిద్ధమయ్యారు. దీంతో ఆస్కా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిశేషయ్య తన మద్దతుదారులతో ఆస్కా కమిటీ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఆస్కా పాలకవర్గాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రద్దు ప్రతిపాదనను విరమించుకుని సామరస్య ధోరణిలో సమస్యను పరిష్కరించాలని కొందరిచ్చిన సలహాపై ప్రారంభించిన చర్చలు రాత్రి వరకు సాగదీశారు. తొలగింపు జాబితాలో చేరిన 139 మంది సభ్యులకు, అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తూ జారీచేసిన నోటీసులను కార్యదర్శి వీరయ్య ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. తనకిచ్చిన నోటీసును 24 గంటల్లోగా నోటీసును ఉపసంహరించకుంటే ఆస్కా పాలకవర్గాన్ని రద్దుచేస్తానని ఇచ్చిన నోటీసును అధ్యక్షులు ఉపసంహరించాలని ప్రతిపాదన వచ్చింది. ఇరువర్గాలు పట్టుదలకు పోకుండా సామరస్య ధోరణితో వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా కార్యదర్శి వీరయ్య వర్గం సభ్యులు ఆస్కా వైపు వెళ్లలేదు.
ఘంటసాల రత్నకుమార్‌పై దాడి: ఆస్కా గొడవల నేపధ్యంలో ఆస్కా సాంస్కృతిక కా ర్యదర్శి ఘంటసాల రత్నకుమార్‌పై శని వారం స్వల్పంగా దాడి జరిగినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఆదిశేషయ్య బృందం కమిటీ చాంబర్‌లో చర్చలు జరుపుతున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు. అర్హత లేని వారంతా కమిటీ చాంబర్‌లో కూర్చోవడం ఏమిటని ఘంటసాల నిలదీశారు. వీరయ్య వర్గంగా భావిస్తున్న ఘంటసాలపై అధ్యక్షుని మద్దతు దారులు విరుచుకుపడ్డారు. తామంతా ఓటేస్తేనే కార్యదర్శిహోదా లభించిందని వ్యాఖ్యానిస్తూ చేయిపట్టుకుని తోసివే సినట్లు తెలిసింది. పరిస్థితి అదుపుతప్పేలోగా ఘంటసాల ఆస్కా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.
రాజీకి ఆస్కారం
Published Sun, Sep 13 2015 2:02 AM | Last Updated on Sat, Jun 2 2018 5:18 PM
Advertisement