చెన్నై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై చేరిన వర్షపు నీరు
చెన్నై/అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : కుండపోత వానలతో చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. నదులు, వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. 50కి పైగా జలాశయాలు, వందలాది చెరువుల నుంచి వరద నీటిని విడుదల చేశారు. నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రిజర్వాయర్ల నుంచి భారీ పరిమాణంలో నీరు విడుదలవుతుండటంతో 2015 నాటి భయానక అనుభవాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. (చెంబరం బాక్కం నుంచి నీళ్లు హఠాత్తుగా విడుదల చేయడం వల్ల ఆరేళ్ల క్రితం చెన్నై నగరం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది.) శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైకి తాగునీరు అందించే చెంబరం బాక్కం, పూండి, పుళల్ రిజర్వాయర్ల నుంచి వరద నీటి విడుదలతో రవాణా సౌకర్యాలు స్తంభించాయి. రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉత్తర, దక్షిణ చెన్నై పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెన్నైలోని సబర్బన్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకు 23 సెం.మీ వర్షం కురవడంతో నగరంలో రహదారులు చెరువులుగా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. వరద ముప్పు ఉందన్న హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఇరాయి అంబు, ఇతర అధికారులతో కలిసి వరద ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సహాయ కార్యక్రమాలు అందించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. స్టాలిన్ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కూడా రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చెన్నైతో పాటు తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడు, పాండిచ్చేరిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. తూర్పు మండలాల్లో 75 శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 25 శాతం చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్ హరినారాయణన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లి – కాళంగి మధ్య కాలువ గట్టు కొట్టుకుపోవడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పిచ్చాటూరు మండలం ఆరణీయార్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కేవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్‌కు అంచనాకు మించి భారీగా వరద నీరు చేరడంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.
తిరుమలకు తప్పిన నీటి కష్టాలు
తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం డ్యాంలు పూర్తి స్థాయిలో నిండటంతో నీటిని కిందికి విడిచిపెట్టారు. ఆకాశగంగ, కుమారధార ప్రాజెక్టులు కూడా నిండాయి. తద్వారా ఏడాది పాటు తిరుమలకు నీటి కష్టాలు ఉండవు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని మల్లిమడుగు, సదాశికోన రిజర్వాయర్‌కు వరద నీరు చేరుతోంది. చంద్రగిరి పరిధిలోని కళ్యాణీ డ్యాం పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 11 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. నిమ్మనపల్లి పరిధిలోని బహుదా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. పలమనేరు పరిధిలోని కౌడిన్య, కైగల్, ఎరిగేరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువపల్లి సమీపంలోని వైఎస్సార్ జలాశయం పూర్తిగా నిండింది.
నెల్లూరును ముంచెత్తిన వర్షాలు
నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయయ్యాయి. దీంతో అధికారులు రెయిన్ అలెర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయానికి 62.7 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా తడలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూళ్లూరుపేట సమీపంలో కోటపోలూరు పుచ్చకాల్వపై ఇసుక తీసుకు వెళ్తున్న ఎద్దులబండి వరద నీటిలో కొట్టుకుపోయింది. కాడికి ఎద్దులు కట్టి ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేకపోయాయి. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, రామలింగాపురం అండర్ బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. మన్సూర్‌నగర్, జనార్ధన్‌రెడ్డి కాలనీ, కళ్యాణ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేట సామగ్రిని భధ్ర పరుచుకొన్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి.
అల్లకల్లోలంగా పాలకాయతిప్ప బీచ్
కోడూరు (అవనిగడ్డ): కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాలకాయతిప్ప బీచ్ వద్ద తీవ్ర అలజడి నెలకొంది. సాగరంలో సుడిగుండాల ప్రభావం అధికంగా ఉండడంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ముందుకు చొచ్చుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్రపు నీరు పాలకాయతిప్ప కరకట్టను తాకడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య పోటుకు అల్పపీడనం తోడవ్వడంతో అలల ఉధృతి అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అలల ధాటికి సముద్ర రహదారి భారీగా కోతకు గురైంది. సుమారు 25 మీటర్ల మేర రహదారి మొత్తం కొట్టుకుపోయి, కొండరాళ్లు బయటపడ్డాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన బల్లలు సైతం సాగరంలో కలిసి పోయాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలపై కొనసాగుతోంది. అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతం సుమత్రా తీర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 9వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారి.. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరంవైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. 10, 11 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవ్వరూ మంగళవారం నుంచి 12వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో గంధవరంలో 11 సెం.మీ. విడవలూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది.
అండగా ఉంటాం : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కుంభవృష్టితో చైన్నై జలమయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యల్లో తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మోదీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment