‘బిల్లు’పై చర్చ ప్రజల మధ్య జరగాలి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుతమున్న అసెంబ్లీని సమైక్యవాదుల అసెంబ్లీగా తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కో కన్వీనర్ విమలక్క అభివర్ణించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో టఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ సభలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, కొట్టుకోవడమే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందనివ్వరన్నారు. అసెంబ్లీ వెలుపల ఉన్న ఫతే మైదాన్‌లో ఎమ్మెల్యేలు సమావేశమై ప్రజల సమక్షంలో తెలంగాణ బిల్లుపై చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూసుకుంటారని విమలక్క పేర్కొన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ దళారులతో కుమ్మక్కై తెలంగాణ రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ల్యాండ్, గ్రానైట్, మైన్స్ మాఫియాలంతా కూడా తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా కాజేసిన తమ భూములను కాపాడుకోవడానికే సీమాంధ్ర నాయకులు నానా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల భూములను లాక్కొని తెలంగాణ రైతులు నాగళ్లతో దున్నడం ఖాయమన్నారు. జిల్లాలో ఉన్న భూములు నేడు సీమాంధ్రుల కబ్జాలో ఉన్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం మీదుగా వెళుతున్న కృష్ణా నీటి పైపులను పగులగొట్టి ఇక్కడి పెద్ద చెరువును నింపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో టఫ్ రాష్ట్ర నాయకులు భీం భరత్, నారాయణదాసు, అరుణోదయ నాయకులు బైరాగీ, రాజు, సీపీఐ నాయకులు కావలి నర్సింహ, ఎంఎస్‌ఎఫ్ నాయకులు కొండ్రు ప్రవీణ్, బీజేపీ నాయకులు మొగిలి గణేశ్, గుండ్ల దానయ్యగౌడ్, టఫ్ నాయకులు రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.