ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న విమలక్క
మిర్యాలగూడ (నల్గొండ): కుల దురహంకారంతోనే ప్రణయ్‌ని హత్య చేయించారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కులం కంటే గుణం చాలా గొప్పదన్నారు. కులాంతర వివాహం చేసుకున్న కూతురును ఆ తండ్రికి మనసుంటే ఆశ్వీరదించాలి కానీ కులదురంహకారంతో హత్య చేయించే హక్కు అయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమాజం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నప్పటికీ కుల వివక్షలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు.
ప్రణయ్ హత్యతో ఆ కుటుంబం కొడుకును కోల్పోవడంతో పాటు అమృత భర్తను ఆమె కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని కోల్పోయిందన్నారు. ఇలాంటి హత్యలు చేయడం సరైంది కాదన్నారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ప్రణయ్ హత్యపై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు సుబ్బారావు, తెలంగాణా మట్టి మనుషుల వేదిక కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, సాగర్, రాములు, సౌమ్య, శిరీష పలువరు నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment